Begin typing your search above and press return to search.

తాజా యుద్ధం...భారత్ కి తెలిసొచ్చిన సత్యాలు !

ఏ వ్యక్తికి అయినా వ్యవస్థకు అయినా దేశానికి అయినా ఏ సంఘటన కానీ సందర్భం కానీ జరిగినపుడు మంచిగా అయినా లేక చెడుగా అయినా చాలా విషయాలు తెలిసివస్తాయి

By:  Tupaki Desk   |   11 May 2025 8:15 AM IST
India’s Wake-Up Call After Limited War
X

ఏ వ్యక్తికి అయినా వ్యవస్థకు అయినా దేశానికి అయినా ఏ సంఘటన కానీ సందర్భం కానీ జరిగినపుడు మంచిగా అయినా లేక చెడుగా అయినా చాలా విషయాలు తెలిసివస్తాయి. మంచివి అయితే వాటి నుంచి స్పూర్తి పొంది మరింత జోష్ తో ముందుకు అడుగు వేయాల్సి ఉంటుంది. లేక ఇబ్బంది కలిగించేవి అయితే వాటిని పాఠాలుగా తీసుకుని ఈసారి ఆ పొరపాట్లు జరగకుండా జాగ్రత్త పడాల్సి ఉంటుంది.

పాక్ తో జరిగిన పరిమిత యుద్ధంలో అలాగే భారత్ కి అనేక విషయాలు తెలిసి వచ్చాయని అంటున్నారు. ముందుగా తన శత్రువులు ఎవరో మిత్రులు ఎవరో బాగా తెలిసిందని అంటున్నారు. తాను ఎంతో సాయం చేసిన టర్కీ ఆపరేషన్ సింధూర్ తరువాత మరుక్షణమే పాక్ పంచన చేరడం భారత్ కి ఒక పెద్ద వెన్నుపోటుగా చెబుతున్నారు.

ఎంతో సహాయం చేసి మంచి మిత్రుడిగా టర్కీని గుర్తించిన భారత్ కి ఇది షాక్ లాంటిదే అని అంటున్నారు. అలాగే అజార్ బైజాన్ అన్న మరో దేశం కూడా పాక్ పంచన చేరింది. చిత్రమేంటి అంటే అజార్ బైజాన్ కి భారత పర్యాటకుల వల్లనే ఆదాయం వస్తోంది. టర్కీది అదే పరిస్థితి. ఇలా భారత సొమ్ము తింటూ దాయాది పాక్ పంచన చేరిన ఈ రెండు దేశాలకు కీలెరిగి వాత పెట్టాల్సిన అవసరం అయితే భారత్ కి ఉంది.

మరో వైపు చూస్తే చైనా వైఖరి ఎపుడూ భారత్ కి తెలుసు. చైనా ఈ పరిమిత యుద్ధంలో పాక్ వైపు నిలబడింది. ఆయుధాలను కూడా సాయం చేసింది. అయితే ఈ ఆయుధాలు బీ గ్రేడ్ వి కావడం భారత్ కి ఉపశమనం కలిగించేదే. చైనా వద్ద అత్యాధునిక ఆయుధాలు ఉన్నాయి. వాటిని కనుక ఇచ్చి ఉంటే చైనా సూపర్ పవర్ తో భారత్ మీద రెచ్చిపోయి ఉండేది.

మరి అంత మంచి స్నేహితుడిగా పాక్ తో నటిస్తున్న చైనా ఎందుకు వాటిని ఇవ్వలేదు అంటే పాక్ ని పూర్తిగా నమ్మకపోవడం అని అంటున్నారు. పాక్ కి చైనాతో పాటు అమెరికా కూడా దోస్త్ అన్నది డ్రాగన్ కి తెలుసు. అలా సూపర్ పవర్ ఆయుధాలు తన వద్ద ఉన్నాయని తెచ్చి పాక్ కి ఇస్తే వాటిని అమెరికా తెలుసుకుని మొత్తం తన టెక్నాలజీతో వాటికి మించి ధీటు అయిన ఆయుధాలు తయారు చేస్తే తనకే ముప్పు అని తలచే చైనా జాగ్రత్త పడింది అని అంటున్నారు.

అందువల్ల సాయం చేసినట్లుగానే చేసి తుస్సుమన్న ఆయుధాలే ఇచ్చింది అని అంటున్నారు. దీంతో కష్టకాలంలో పాక్ కి చైనా సాయం ఎంత చేసినా భారత్ కి భయాలు లేవని ఈ పరిమిత యుద్ధం వల్ల తెలిసి వచ్చింది. ఇక అమెరికాలో ట్రంప్ భారత్ కి అనుకూలం అని ఎంత అనుకున్నా పాక్ కోసం పంచాయతీలకు సిద్ధమవుతారని కూడా తెలిసి వచ్చింది.

ట్రంప్ కంటే ముందు జో బైడెన్ ఉంటే పాక్ కి అనుకూలుడు అన్న మాట ఉంది. ట్రంప్ రావడంతో పాక్ ఉలిక్కిపడింది. ఎందుకంటే పాక్ కి ఇవ్వాల్సిన నిధులలో ట్రంప్ వస్తూనే కోత పెట్టారు. కానీ సరైన సమయంలో భారత్ నుంచి యుద్ధ ముప్పు లేకుండా చేసి ట్రంప్ తాను పెద్దన్ననే అని రుజువు చేసుకున్నారు ఇలా భారత్ కి అమెరికా వైఖరి కీలక సమయాలలో ఎలా ఉంటుందో తెలిసివచ్చింది అని అంటున్నారు.

అలాగే జీ 7 దేశాలు భారత్ అంటే ఎంతో ప్రేమగా ఉంటాయి. అయినా అవి శాంతి జపమే చేస్తూ వచ్చాయి. అయితే భారత్ కి కొంత ఊరట ఏంటి అంటే ఏ పెద్ద ముస్లిం దేశం కూడా పాక్ కి మద్దతుగా నిలవకపోవడం. అది పదకొండేళ్ళుగా మోడీ సాగిస్తున్న విదేశీ యాత్రలు దౌత్య విధానాల వల్లనే అని చెప్పితీరాలి.

ఇక పాక్ వద్ద సరకు తక్కువ చప్పుడు ఎక్కువ అన్నది కూడా భారత్ కే కాదు ప్రపంచానికి ఈ పరిమిత యుద్ధంతో తెలిసి వచ్చింది. ఈ రోజున పెద్దన్న మాట విని కాల్పుల నిలుపుదల చేసినా భారత్ కి మళ్ళీ ఉగ్ర నీడని అయినా పాక్ చూపించినా ఏ పెద్దన్న చెప్పినా ఈసారి పాక్ కి మూడే దాకా భారత్ తన సత్తాని చూపించి తీరుతుందని అంటున్నారు మొత్తానికి కష్టంలోనూ క్లిష్ట సమయంలోనూ అన్నీ తెలుస్తాయని అంటారు. అలా భారత్ కి ప్రపంచంలో ఎవరేమిటి అన్నది బాగా ఈ పరిమిత యుద్ధంలో తెలిసివచ్చింది అని అంటున్నారు.