భారత్ చేతిలో చైనా క్షిపణి గుట్టు... ఏమిటీ పీఎల్-15 స్పెషల్?
అవును... భారత్ లోని లక్ష్యాలపై దాడి చేయడానికి చైనా తయారీ ‘పీఎల్-15ఈ’ దీర్ఘశ్రేణి క్షిపణి ఉపయోగించామని పాకిస్థాన్ వాయుసేన అంగీకరించింది.
By: Tupaki Desk | 11 May 2025 1:38 PM ISTభారత్ – పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు ఉన్న ఈ నెల 8వ తేదీన పాకిస్థాన్ తన వద్ద ఉన్న జే-10, ఎఫ్-16, జేఎఫ్-17 యుద్ధ విమానాలను భారత గగనతంలోకి పంపింది. అయితే వాటన్నింటినీ భారత గగనతల రక్షణ వ్యవస్థ గాల్లోనే నిర్వీర్యం చేసింది! వీటి మధ్యలో భారత జెట్ లపైకి ‘ఎల్-15ఈ’ క్షిపణిని ప్రయోగించింది. అయితే... దాని శకలాలు దొరికాయి!
అవును... భారత్ లోని లక్ష్యాలపై దాడి చేయడానికి చైనా తయారీ ‘పీఎల్-15ఈ’ దీర్ఘశ్రేణి క్షిపణి ఉపయోగించామని పాకిస్థాన్ వాయుసేన అంగీకరించింది. ఈ సమయంలో వీటికి సంబంధించిన క్షిపణి శకలాలు పంజాబ్ లో దొరికాయి. పైగా వీటిలో ఒక క్షిపణి.. ఏమాత్రం చెక్కుచెదరలేదన్నట్లుగా దొరికింది. దీంతో.. భారత భద్రతా బలగాలు దాన్ని స్వాధీనం చేసుకున్నాయి.
ఇప్పుడు దాన్ని విడగొట్టి, ఇందులో వాడిన పరిజ్ఞానాల గుట్టును భారత్ ప్రత్యక్షంగా తెలుసుకోనుంది. వీటి సాయంతోనే రఫేల్, సుఖోయ్-30ఎంకేఐ వంటి భారత్ యుద్ధవిమానాలను కూల్చినట్లు పాకిస్థాన్ ప్రచారం చేసుకుంది. అయితే.. అదంతా పచ్చి అబద్ధమని, ఫేక్ ప్రచారమని భారత్ కొట్టిపారేసింది. భారత్ పడగొట్టిన క్షిపణిని, పాక్ రివర్స్ లో చెప్పుకుందని అంటున్నారు!
ఏమిటీ పీఎల్-15 స్పెషల్?:
పీఎల్-15 అనే దీర్ఘశ్రేణి అస్త్రాన్ని చైనాలోని 607 ఇనిస్టిట్యూట్ అభివృద్ధి చేసింది. చైనా ఏరోస్పేస్ సైన్స్ అండ్ ఇండస్ట్రీ కార్పొరేషన్ దీన్ని ఉత్పత్తి చేస్తోంది. ఇందులో రెండు వేరియంట్లు ఉన్నాయి. అందులో ఒకదాని పేరు ‘పీఎల్-15’ కాగా.. మరికటి పీఎల్-15ఈ. ఇందులో పీఎల్-15ఇ ని పాకిస్థాన్ కు చైనా ఇచ్చింది. దీని రేంజ్ 145 కిమీ కాగా... పీఎల్-15 పరిధి 200 నుంచి 300 కిలోమీటర్లు.
ఇక ధన ఇందనంతో నడిచే డ్యూయెల్ పల్స్ రాకెట్ మోటార్ కలిగి ఉన్న ఇవి.. ధ్వని కంటే సుమారు ఐదు రెట్లు అధిక వేగంతో దూకుకెళ్తాయి. వీటిలో 20 నుంచి 25 కిలోల హై ఎక్స్ ప్లోజివ్ ఫ్రాగ్మెంటేషన్ వార్ హెడ్ ఉంది. ఇది భారత్ లో ఉన్న "అస్త్ర", అమెరికాకు చెందిన "ఏఐఎం-120 అమ్రామ్" కు పోటీదారు అని చెబుతున్నారు.
