పాక్‌తో జల సంధి రద్దు చేసిన భారత్.. అసలు మనకు ఏయే దేశాలతో ఒప్పందాలున్నాయి
పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో 26మంది పర్యాటకులు మరణించిన నేఫథ్యంలో భారత్ పాకిస్థాన్‌పై తీవ్ర చర్యలు చేపట్టింది.
By: Tupaki Desk | 25 April 2025 2:00 AM ISTపహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో 26మంది పర్యాటకులు మరణించిన నేఫథ్యంలో భారత్ పాకిస్థాన్‌పై తీవ్ర చర్యలు చేపట్టింది. ఈ ఉగ్రదాడిలో పాకిస్థాన్ కుట్ర ఉందని తేలడంతో భారత్ ఐదు కీలక నిర్ణయాలు తీసుకుని పాక్‌కు దాని భాషలోనే సమాధానం చెప్పడం మొదలు పెట్టింది. ఈ నిర్ణయాలలో అత్యంత ముఖ్యమైనది 1960లో ఇరు దేశాల మధ్య కుదిరిన సింధు జల సంధిని రద్దు చేయడం. సరిహద్దు నుండి ఉగ్రవాదానికి మద్దతు పూర్తిగా నిలిచిపోయే వరకు ఈ కీలకమైన జల సంధిని తక్షణమే నిలిపేస్తున్నట్లు భారత్ ప్రకటించింది.
సింధు జల సంధి ప్రకారం.. పాకిస్థాన్‌కు చీనాబ్, జీలం, సింధు నదుల నీరు అందుతోంది. పాకిస్థాన్‌లోని పంజాబ్, సింధ్ ప్రావిన్స్‌లలోని రైతులు వ్యవసాయం, ఇతర నీటి అవసరాల కోసం పూర్తిగా ఈ నదుల నీటి మీదనే ఆధారపడి ఉన్నారు. అయితే, ఇక్కడ మనం భారతదేశం ఇతర అంతర్జాతీయ జల సంధుల గురించి తెలుసుకుందాం. పాకిస్థాన్‌తో కాకుండా భారత్ ఇతర ఏ దేశాలతో నీటి పంపకం గురించి ఒప్పందాలు చేసుకుందో చూద్దాం.
భారత్-బంగ్లాదేశ్ జల సంధి
భారత్, బంగ్లాదేశ్ మధ్య 1996లో గంగా జల సంధి జరిగింది. ఈ ఒప్పందం రెండు దేశాల మధ్య గంగా నది నీటి పంపకంపై ఉన్న వివాదాలను పరిష్కరించాలన్నది దీని ఉద్దేశం. అప్పటి ప్రధాన మంత్రి హెచ్‌డి దేవెగౌడ, షేక్ హసీనా ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం 30 సంవత్సరాల కాలానికి వర్తిస్తుంది.
మహాకాళి జల సంధి
భారత్, నేపాల్ మధ్య 1996లో మహాకాళి నదికి సంబంధించి జల ఒప్పందం జరిగింది. దీనిని మహాకాళి జల సంధి అని పిలుస్తారు. ఈ జల సంధిలో సదరా బ్యారేజ్, తనక్‌పూర్ బ్యారేజ్, పంచేశ్వర్ ప్రాజెక్ట్ వంటివి ఉన్నాయి.
భారత్-చైనా ఒప్పందం
భారత్, చైనా మధ్య బ్రహ్మపుత్ర నదిపై వర్షపు నీరు, నీటి మట్టం వంటి హైడ్రోలాజికల్ సమాచారాన్ని పంచుకోవడానికి ఒక ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం ఐదు సంవత్సరాల కాలానికి కుదిరింది. అయితే, రెండు దేశాల మధ్య అధికారికంగా ఎటువంటి జల సంధి లేదు.
పాక్ జల సంధి
భారతదేశంలోని తమిళనాడు, శ్రీలంకలోని ఉత్తర ప్రావిన్స్‌లోని జాఫ్నా జిల్లా మధ్య ఒక జల సంధి ఉంది. ఈ జల సంధి ఈశాన్యంలో పాక్ అఖాతాన్ని నైరుతిలో మన్నార్ అఖాతంతో కలుపుతుంది.
