సింధు నదుల నీటిని ఆపడానికి భారత్‌కు ఎంత సమయం పడుతుంది?
పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత, భారత్ పాకిస్తాన్‌కు గట్టిగా బుద్ది చెప్పేందుకు ఐదు కీలక నిర్ణయాలు తీసుకుంది.
By: Tupaki Desk | 25 April 2025 11:22 AM ISTపహల్గామ్ ఉగ్రదాడి తర్వాత, భారత్ పాకిస్తాన్‌కు గట్టిగా బుద్ది చెప్పేందుకు ఐదు కీలక నిర్ణయాలు తీసుకుంది. భద్రతా వ్యవహారాలపై క్యాబినెట్ కమిటీ (CCS) సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయం సింధు జల ఒప్పందాన్ని నిలిపివేయడం. పాకిస్తాన్ ఉగ్రవాదానికి మద్దతునిస్తూ ఉంటే.. ఈ ఒప్పందాన్ని అమలు చేసేదే లేదని భారత్ తేల్చిచెప్పింది. భారత్ తీసుకున్న ఈ నిర్ణయం పాకిస్తాన్‌కు పెద్ద దెబ్బగా చెప్పొచ్చు. పాకిస్తాన్‌లోని సింధ్, పంజాబ్ ప్రావిన్సుల్లో 90 శాతం సాగు భూమి నీటి అవసరాల కోసం సింధు జల ఒప్పందం ద్వారా లభించే నీటి మీదనే ఆధారపడి ఉంటుంది.
ఒకవేళ చీనాబ్, జీలం, సింధు వంటి నదుల నీటిని భారత్ ఆపేస్తే పాకిస్తాన్‌లో తీవ్ర సంక్షోభం ఏర్పడవచ్చు. నీరు నిలిచిపోతే పాకిస్తాన్‌లోని సాగు భూములు ఎండిపోవడమే కాకుండా, తాగునీటికి కటకట ఏర్పడుతుంది. విద్యుత్ ప్రాజెక్టులు కూడా తీవ్రంగా నష్టపోతాయి. భారత్ తీసుకున్న ఈ చర్య పాకిస్తాన్‌ను ఆర్థికంగా మరింత దిగజార్చే అవకాశం ఉంది. అయితే, సింధు జల ఒప్పందాన్ని రద్దు చేయడం అంత ఈజీనా.. భారత్ ఒక్క రాత్రిలో మూడు నదుల నీటిని ఆపగలదా.. ఈ మూడు నదులు నీటిని నిలిపేందుకు భారత్ కు ఎంత సమయం పడుతుంది.. లాంటి ప్రశ్నలకు సమాధానం ఈ కథనంలో తెలుసుకుందాం.
వాస్తవానికి భారత్, పాకిస్తాన్ 1960లో సింధు నదీ వ్యవస్థలోని నీటి వినియోగం మీద ఇక ఒప్పందం కుదుర్చున్నాయి. ఈ ఒప్పందం ప్రకారం సట్లెజ్, బియాస్, రావి నదుల నీటిని భారత్ ఉపయోగించుకోవచ్చు. అదే సమయంలో జీలం, చీనాబ్, సింధు నదుల నీటిపై పాకిస్తాన్ వాడుకుంటుంది. సింధు జల ఒప్పందంలో భారత్ పాకిస్తాన్‌తో చేసుకున్న ఒప్పందంలో మొత్తం నదీ నీటిలో కేవలం 20 శాతం మాత్రమే తన వద్ద ఉంచుకుంది. శాంతి కోసం భారత్ 80 శాతం నీటిని పాకిస్తాన్ వినియోగానికే వదిలేసింది.
సింధు జల ఒప్పందాన్ని నిలిపివేస్తూ భారత్ తీసుకున్న నిర్ణయం స్పష్టంగా జీలం, చీనాబ్, సింధు నదుల నీటిని పాకిస్తాన్ ఇకపై ఉపయోగించుకోకుండా అడ్డుకోవడమే. అయితే, ఇది అంత సులభమా అంటే ఏమాత్రం కాదు. ఈ నీటిని ఒక్క రాత్రిలో పాకిస్తాన్‌కు చేరకుండా ఆపడానికి అవసరమైన మౌలిక సదుపాయాలు ప్రస్తుతం భారత్ వద్ద లేవు. ఒకవేళ భారత్ డ్యామ్‌లు నిర్మించడం ద్వారా లేదా నీటిని నిల్వ చేయడం ద్వారా అలా చేయడానికి ప్రయత్నించినా జమ్మూ కాశ్మీర్, పంజాబ్ వంటి రాష్ట్రాల్లో తీవ్ర వరదలు వచ్చే ప్రమాదం ఉంది.
