వెక్కి వెక్కి ఏడుస్తున్న పాక్.. వరసబెట్టి నాలుగు లేఖలు !
అవును. చేసుకున్న వారికి చేసుకున్నంత అని ఒక ముతక సామెత ఉంది. భారత్ సహనాన్ని పరీక్షించి మరీ గత నాలుగు దశాబ్దాలుగా ఉగ్ర భూతాన్ని వదిలి పాక్ సరదా చేసింది
By: Tupaki Desk | 7 Jun 2025 3:00 AM ISTఅవును. చేసుకున్న వారికి చేసుకున్నంత అని ఒక ముతక సామెత ఉంది. భారత్ సహనాన్ని పరీక్షించి మరీ గత నాలుగు దశాబ్దాలుగా ఉగ్ర భూతాన్ని వదిలి పాక్ సరదా చేసింది. భారత్ ని దెబ్బ తీయాలని ఎన్నో సార్లు చూసింది. చాలా సార్లు అందులో సక్సెస్ అయింది. సీమాంతర ఉగ్రవాదాన్ని రెచ్చగొడుతూ భారత్ లో శాంతి అన్న మాట లేకుండా చేయాలని అనుకుంది. మతాల మధ్య చిచ్చు పెట్టాలని తాజాగా కాశ్మీర్ లోని పహిల్గాం ఉగ్ర దాడిని చేయించింది.
ఇది అన్నింటికంటే పరాకాష్టగా మారింది. మతం అడిగి మరీ మనుషులను చంపడం ప్రపంచ ఉగ్రవాదంలో కొత్త రకం క్రూరత్వం గా ఉంది. దీంతో భారత్ కి మండిపోయింది. ఎక్కడ లేని ఆగ్రహం చూపించింది. అలా భారత్ మూడో కన్ను తెరచేసరికి పాక్ ఇపుడు తన అసలు దరిద్రం ఏంటో కళ్ళారా చూస్తోంది.
భారత్ నుంచి పాకిస్థాన్ కి ప్రవహిస్తున్న సిందు నదీ జలాలను నిలుపు చేసింది. దాంతో పాక్ గొంతు ఎండిపోతోంది. గత రెండు నెలలుగా పాక్ కి ఊపిరి ఆడడం లేదు. దాహంతో అల్లాడిపోతోంది. ఈ నేపధ్యంలో ఒకటి రెండూ కాదు ఏకంగా నాలుగు లేఖలను భారత్ కి రాసింది.
సింధూ జలాల కోసం పాక్ ఎంతో ఆత్రపడుతోంది. దాంతో మే నెల మొదలుకుని ఇప్పటికి నాలుగు లేఖలు రాసింది. మే నెల మొదటి వారంలో ఒక లేఖ రాసిన పాక్ ఆపరేషన్ సిందూర్ తర్వాత మరో మూడు లేఖలను భారత్ కి రాసింది. సింధూ జలాలను ఆపవద్దను చర్చలకు తాము సిద్ధమని ఆ లేఖలలో పాక్ స్పష్టం చేస్తోంది.
ఈ లేఖలు అన్నీ పాకిస్థాన్ జలవనరుల శాఖ నుంచి భారత్ జల వనరుల శాఖకు నేరుగా వస్తున్నాయి. సింధూ నదీ జలాలను నిలుపు చేస్తే పాకిస్థా తీవ్రమైన దుర్భిక్షంలోకి వెళ్తుందని ఆ లేఖల ద్వారా పాక్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. పాక్ ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడతారని సెంటిమెంట్ ని కూడా రాజేస్తోంది.
ఈ అంశం మీద చర్చించేందుకు పాక్ సిద్ధంగా ఉందని కూడా ఆ లేఖలలో స్పష్టం చేసింది. ఈ లేఖలను అందుకున్న భారత జల మంత్రిత్వ శాఖ వాటిని నేరుగా విదేశంగ మంత్రిత్వ శాఖకు పంపించింది. అయితే ఈ మధ్యనే జాతిని ఉద్దేశించి దూరదర్శన్ ద్వారా ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోడీ రక్తం నీరు ఒకే సారి ప్రవహించలేవు అని స్పష్టం చేశారు అని గుర్తు చేస్తున్నారు.
పాకిస్థాన్ కి సింధూ నదీ జలాలు అందాలీ అంటే కనుక కచ్చితంగా ఉగ్రవాదానికి స్వస్తి చెప్పాలని తానే స్వయంగా ఉగ్ర శిబిరాలను నిర్మూలించాలని భారత్ కి ఈ విషయంలో భరోసా కల్పించాలని కోరుతున్నారు. అంతే కాదు ఇక మీదట జరిగే ఏ చర్చలు అయినా పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఉగ్రవాదం మీదనే అని భారత్ స్పష్టంగా చెబుతున్న వేళ కేవలం సింధూ జలాల విషయంలో చర్చిస్తామని పాక్ చెప్పడం ఆ విధంగానే లేఖలు రాయడం అంటే ఇది ఏ మాత్రం పరిష్కార మార్గం కాదని అంటున్నారు.
ఇదిలా ఉంటే భారత్ పాక్ ల మధ్యన సింధూ నదీ జలాల ఒప్పందం అన్నది 1960లో అప్పటి ప్రధాని పండిట్ నెహ్రూ ఉండగా కుదిరాయి. ఆ సమయంలో పాకిస్థాన్ కి అధ్యక్షుడుగా అయూబ్ ఖాన్ ఉనారు. మధ్యవర్తిత్వాన్ని ప్రపంచ బ్యాంక్ వహించింది. అలా నెహ్రూ అయూబ్ ఖాన్ సంతకాలతో ఈ ఒప్పందం అమలులోకి వచ్చింది.
ఇక ఈ ఒప్పందంలో ఉన్న దాని ప్రకారం చూస్తే కనుక సింధూ నదికి తూర్పున ప్రవహించే రావి బియాస్ సట్లేజ్ నదులపైన భారత్ కి పూర్తి హక్కులు ఉంటాయి. అదే సమయంలో సింధూ నదితో పాటు పశ్చిమ ఉప నదులైన జీలం, చీనాబ్ నదుల మీద పాక్ కి హక్కులు దక్కుతాయి. అయితే ఈ ఒప్పందం ఏకపక్షమే పాకిస్థాన్ కి మేలు చేసేందుకే అని అప్పట్లోనే విపక్షాలు విమర్శలు చేశాయి. ఏ అవసరం లేకపోయినా పాక్ కి ఈ నదుల నుంచి నీళ్ళు ఇవ్వడం ఎందుకు అన్న ప్రశ్న తలెత్తింది. అయితే పూర్తిగా మానవత్వం అన్న కోణంలో నుంచే ఈ నదీ జలాలను పాక్ కి దక్కేలా ఒప్పందం చేసుకున్నారు.
కానీ పాక్ మాత్రం మానవత్వం అన్న కోణాన్ని విస్మరించి భారత్ మీద ఉగ్ర దాడులకు ప్రోత్సహించేలా గడచిన దశాబ్దాల కాలంలో వ్యవహరిస్తూ వస్తోంది. గత ప్రభుత్వాలు పాక్ మీద అనేక రకాలైన చర్యలు తీసుకున్నా మోడీ సర్కార్ మాత్రం పాక్ ఆయువు పట్టు మీదనే దెబ్బ కొట్టేలా సింధూ జలాలను నిలుపు చేశారు. దాంతో పాక్ ఇపుడు అన్ని విధాలుగా అవస్థలు పడుతోంది. మరి పాక్ లేఖలు బుట్టదాఖలేనా లేక భారత్ కొత్త ప్రతిపాదనలు ఏమైనా పెడుతుందా అన్నది చూడాల్సి ఉంది.
