ట్రంప్ ది నోరా లేక తాటిమట్టా?
భారత్ - పాక్ ల మధ్య ఉద్రిక్త వాతావరణం ఏర్పడిన తర్వాత.. ఈ నెల 10న ఇరు దేశాలు కాల్పుల విరమణ అంగీకారానికి వచ్చాయి.
By: Tupaki Desk | 18 May 2025 11:50 AM ISTభారత్ - పాక్ ల మధ్య ఉద్రిక్త వాతావరణం ఏర్పడిన తర్వాత.. ఈ నెల 10న ఇరు దేశాలు కాల్పుల విరమణ అంగీకారానికి వచ్చాయి. ఈ విషయాన్ని ఇరుదేశాల కంటే ముందు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. దీనిపై భారత్ లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది! ఆ సంగతి అలా ఉంటే... నాటి నుంచి నేటి వరకూ ఈ విషయంపై ట్రంప్ చేసుకొంటున్న స్వోత్కర్ష ఒకెత్తు అయితే.. వాణిజ్యం పేరు చెప్పి యుద్ధం ఆపానని చెప్పడం పై మాత్రం తీవ్ర విమర్శలు వెల్లివెత్తుతున్నాయి.
అవును... భారత్ – పాక్ ల మధ్య తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొన్న సమయంలో... మరికొన్ని రోజుల్లో పాక్ పరిస్థితి అయిపోతుందని, ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్న పాక్ కు భారత్ గట్టి బుద్ది చెప్పబోతోందని.. ఇకపై ఆశ్రయం లేక ఉగ్రవాదులు గట్టి దెబ్బ తింటారని చాలా మంది భావించారు. ఈ సమయంలో పరిస్థితి గ్రహించిన పాక్.. ట్రంప్ ముందు సాష్టాంగ పడిందని చెబుతున్నారు.
దీంతో.. ఆ అవకాశాన్ని అందిపుచ్చుకున్న ట్రంప్.. భారత్ తో అమెరికాకు ఉన్న అనుబంధం మేరకు మధ్యవర్తిత్వం వహించారని.. ఈ సమయంలో అమెరికా విదేశాంగశాఖ ప్రతినిధి, యూఎస్ వైస్ ప్రెసిడెంట్ కీలక భూమిక పోషించారని అంటారు! ఏది ఏమైనా.. పాక్ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని భారత్ మరో అవకాశం ఇచ్చింది. ఇటు ట్రంప్ మాటకు విలువిస్తూ, అటు పాక్ కు మరో అవకాశం ఇచ్చింది!
దీంతో... ఇప్పటివరకూ ప్రపంచ వేదికలపై సుమారు ఏడు నుంచి ఎనిమిది సార్లు ఈ విషయాన్ని చెప్పుకున్న ట్రంప్... రెండు అణ్వాయుధ దేశాల మధ్య ఘర్షణను ఆపడం తాను సాధించిన పెద్ద విజయమని తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఆ స్వోత్కర్ష సంగతి అలా ఉంటే... ఇరు దేశాలనూ వాణిజ్యం గురించి చెప్పి, వారితో పెద్ద ఎత్తున వ్యాపారం చేస్తానని చెప్పి యుద్ధం ఆపానని చెప్పడంపై మాత్రం తీవ్ర విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి.
ఈ విషయంపై ఇప్పటికే భారత ప్రభుత్వం స్పందించింది. ఇందులో భాగంగా... మే 8న అమెరికా విదేశాంగ మంత్రి రూబియోతో, భారత విదేశాంగ మంత్రి జైశంకర్ మాట్లాడారు.. 9న యూఎస్ వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ తో నరేంద్ర మోడీ మాట్లాడారు.. మే 10న మార్క్ రూబియోతో అజిత్ దోవల్ మాట్లాడారు. ఈ మొత్తం చర్చల్లో ఎక్కడా, ఎవరి మధ్యా “వాణిజ్యం” ప్రస్థావనే రాలేదని స్పష్టం చేసింది.
అయినప్పటికీ ట్రంప్ మాత్రం ఆపడం లేదు. మైకుల ముందుకు వచ్చిన ప్రతీసారీ భారత్ – పాక్ ల మధ్య యుద్ధాన్ని ఆపానని చెప్పుకుంటూ... వారితో చాలా వాణిజ్యం చేస్తామని చెప్పి ఒప్పించినట్లు చెబుతూనే ఉన్నారు. దీంతో... అసలు ట్రంప్ ది నోరా.. లేక, తాటిమట్టా అని అంటున్నారు నెటిజన్లు!
మరోపక్క... భారత సుంకాల విధానంపైనా స్పందించిన ట్రంప్... ప్రపంచంలొనే అతి ఎక్కువ సుంకాలు విధిస్తున్న దేశం భారత్ అని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో భారత్ తో వ్యాపారం చేయడం దాదాపు అసాధ్యం అని అన్నారు. ఇదే సమయంలో.. అమెరికా కోసం 100 శాతం సుంకాల కోతకు భారత్ అంగీకరించిందని అన్నారు. ఇలా ఏది బడితే అది మాట్లాడుతూ.. నెటిజన్లతో చివాట్లు తింటున్నారు ట్రంప్!
