భారత్ పాక్ ల మధ్య .... హీటెక్కించే టాపిక్ అదే !
భారత్ పాక్ ల మధ్య తాత్కాలికంగా కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఈ గడువు ఈ నెల 18తో ముగియనుంది.
By: Tupaki Desk | 17 May 2025 9:00 AM ISTభారత్ పాక్ ల మధ్య తాత్కాలికంగా కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఈ గడువు ఈ నెల 18తో ముగియనుంది. ఈ మధ్యలో ఈ నెల 12న ఒకసారి రెండు దేశాల డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్స్ డీజీఎంఓ స్థాయిలలో హాట్ లైన్ చర్చలు సాగాయి. అయితే ఆ చర్చలలో సరిహద్దులలో రెండు దేశాలూ తమ సైన్యాన్ని తగ్గించుకోవాలని ఉద్రిక్తతలు లేకుండా చూసుకోవాలని చర్చించాయని తెలిసింది.
అయితే మరోసారి ఈ నెల 28న చర్చలు డీజీఎంఓల మధ్య సాగుతాయని అంటున్నారు. ఈ చర్చలలో ఏమి మాట్లాడుతారు అన్నది ఆసక్తిని గొలుపుతోంది. కాల్పుల విరమణ అన్నది రెండు దేశాలు పొడిగిస్తాయా అన్నది చూడాల్సి ఉంది. భారత్ అయితే ఉగ్రవాదాన్ని పూర్తిగా పాక్ వదలాలని కోరుతోంది. అలాగే ఉగ్ర శిబిరాలను తానే ద్వంశం చేయాలని డిమాండ్ పెడుతోంది. పాక్ వద్ద ఉన్న ఉగ్రవాదుల జాబితాను రిలీజ్ చేసి వారిని అప్పగించాలని కూడా పట్టుబడుతోంది.
అంతే కాదు పాక్ ఆక్రమిత కాశ్మీర్ ని అప్పగించాలని అంటోంది. ఇలా భారత్ వైపు నుంచి స్పష్టంగా చాలా అంశాలు ఉన్నాయి. పాక్ వీటి మీద స్పందించేది ఉందా అన్నదే చూడాలి. అయితే పాక్ మాత్రం సింధు నదీ జలాల నిలుపుదలను పునస్సమీక్షించాలని భారత్ ని కోరుతోంది. అలాగే శాంతి చర్చలకు సిద్ధమని చెబుతోంది. మరి ఆ శాంతి చర్చలలో ఏ అంశాలు ఉంటాయన్నది పాక్ నిర్దిష్టంగా చెప్పడంలేదు.
గతంలో మాదిరిగా మొక్కుబడి చర్చలతో బురిడీ కొట్టించి భారత్ నుంచి అన్ని రకాలైన ప్రయోజనాలను పొందాలని పాక్ చూస్తోంది. కానీ అది ఈసారికి సాధ్యమయ్యేదిగా ఏ మాత్రం లేవని అంటున్నారు. భారత్ అయితే పాక్ విషయంలో చాలా పట్టుదలగా ఉంది.
కాల్పుల విరమణను కూడా భారత్ పూర్తిగా నమ్మడం లేదు. సరిహద్దులలో అప్రమత్తంగా ఉంటోంది. కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాధ్ సింగ్ మాటలలో చూస్తే కాపుల విరమణ అన్నది తాత్కాలికమే అని తేలుతోంది. పాక్ ఏ మాత్రం కవ్వించినా ఒక్కటికి వంద శాతం రెట్టించిన తీరులో భారత్ గట్టి జవాబు ఇవ్వాలని చూస్తోంది.
ఈ నేపధ్యంలో కాల్పుల విరమణను భారత్ అయితే కొనసాగిస్తూనే పాక్ మీద అన్ని రకాలైన ఒత్తిడిని పెట్టాలని అనుకుంటోంది. పాక్ మాత్రం అంతా పూర్వం మాదిరిగా రొటీన్ గా ఉంటుందని భావిస్తోంది. అక్కడే ప్రతిష్టంబన వస్తోంది. ఈ నేపధ్యంలో కాల్పుల విరమణ అన్నది పాక్ కి ఇష్టం ఉన్నా లేకపోయినా మరికొంత కాలం తప్పేట్లు లేదనే అంటున్నారు ఎందుకంటే తాజాగా భారత్ చేసిన దాడులతో పాక్ పూర్తిగా చావు దెబ్బ తిన్నది అందువల్ల పాక్ భారత్ రెండూ కూడా కాల్పుల విరమణను కొనసాగిస్తూనే తగిన అవకాశాల కోసం చూస్తాయన్న విశ్లేషణలు ఉన్నాయి.
