Begin typing your search above and press return to search.

గ్రౌండ్ రిపోర్టు: సరిహద్దు రాష్ట్రాల్లో పరిస్థితి ఎలా ఉంది?

ఇదిలా ఉండగా ఆదివారం చోటు చేసుకున్న పరిణామాలతో ఆదివారం రాత్రి మాత్రం ఎలాంటి దాడులు జరగలేదు. జమ్ము నగరంలో పరిస్థితి సాధారణంగా ఉన్నట్లు చెబుతున్నారు.

By:  Tupaki Desk   |   12 May 2025 11:00 AM IST
India-Pakistan Ceasefire Brings Temporary Calm After Cross-Border Drone Strikes
X

ఆపరేషన్ సిందూర్ తర్వాత పాకిస్తాన్ గత గురువారం రాత్రి వేళలో సరిహద్దు రాష్ట్రాల్లోని పలు టార్గెట్లను పెట్టుకొని ఆత్మాహుతి డ్రోన్లు.. మానవరహిత విమానాల్ని ప్రయోగించి.. పలు చోట్ల దాడులకు పాల్పడిన సంగతి తెలిసిందే. గురు.. శుక్రవారాల్లో రాత్రిళ్లు సరిహద్దు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల ప్రజలకు కంటికి నిద్ర లేకుండా చేసిన పాక్ తీరుకు భారత సైన్యం బలమైన సమాధానం చెప్పినప్పటికి.. జనావాసాల్ని లక్ష్యంగా చేసుకొని దాడులు చేసిన వైనం తెలిసిందే.

ఇదిలా ఉండగా అనూహ్య రీతిలో శనివారం సాయంత్రం భారత్ - పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగినట్లుగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎక్స్ ఖాతాలో పోస్టు చేయటం.. ఆ వెంటనే పాక్ నుంచి అలాంటి ప్రకటన వచ్చిన వేళ.. భారత ఆర్మీ అధికారులు సైతం ఈ విషయాన్ని వెల్లడించారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ శనివారం రాత్రి పాక్ మళ్లీ దాడులకు దిగిన సంగతి తెలిసిందే.

దీంతో కాల్పుల విరమణ జరిగినప్పటికీ జమ్ముకశ్మీర్ లోని పలు ప్రాంతాల్లో డ్రోన్లు.. పేలుళ్లు.. సైరన్ల మోతతో దద్దరిల్లిన పరిస్థితి. ఈ వ్యవహారంపై భారత్ సీరియస్ కావటం.. పాక్ దుర్మార్గ బుద్ధిని ప్రపంచానికి తెలియజేసింది. ఇదిలా ఉండగా ఆదివారం చోటు చేసుకున్న పరిణామాలతో ఆదివారం రాత్రి మాత్రం ఎలాంటి దాడులు జరగలేదు. జమ్ము నగరంలో పరిస్థితి సాధారణంగా ఉన్నట్లు చెబుతున్నారు.

శనివారం అర్థరాత్రి దాటిన తర్వాత నుంచి సరిహద్దు రాష్ట్రాల్లోఎక్కడా కూడా ఎలాంటి దాడులు జరగలేదు. పరిస్థితి సాధారణంగా ఉన్నట్లుగా చెబుతున్నారు. భద్రతా దళాలు మాత్రం పూర్తిస్థాయి అప్రమత్తతతో ఉన్నాయి. పాక్ తో సరిహద్దులు పంచుకునే పంజాబ్ లోని పఠాన్ కోట్.. ఫిరోజ్ పూర్.. అమ్రత్ సర్ లోనూ పరిస్థితి సాధారణంగానే ఉన్నట్లు చెబుతున్నారు. శనివారం రాత్రి పాక్ దాడుల నేపథ్యంలో అమ్రత్ సర్ లో బ్లాక్ అవుట్ అమలు చేశారు. ఆదివారం నుంచి ఎత్తేశారు.

అయితే.. అనుమానం ఉన్న ప్రతి వాహనాన్ని తనిఖీలు చేస్తున్నారు. రాజస్థాన్ లోని సరిహద్దు ప్రాంతాల్లో మాత్రం ముందస్తు చర్యల్లో భాగంగా బ్లాక్ అవుట్ విధించారు. పాక్ దాడుల నేపథ్యంలో సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లిన జమ్ముకశ్మీర్ సరిహద్దు ప్రజల్ని.. వారి స్వస్థలాలకు తిరిగి వెళ్లొద్దని అధికార యంత్రాంగం హెచ్చరించింది. భారీ ఎత్తున షెల్లింగ్ చేపట్టిన నేపథ్యంలో.. పేలని షెల్స్ ఇంకా ఉండే అవకాశం ఉందని.. వాటిని గుర్తించాల్సి ఉందని చెబుతున్నారు. ఈ కారణంతోనే అధికారిక ప్రకటన వెలువడే వరకు వారి ఇళ్లకు వెళ్లొద్దని హెచ్చరిస్తున్నారు.