Begin typing your search above and press return to search.

ఐరన్ లేడీ...ఇందిరను అంతా గుర్తు చేసుకుంటున్నారు!

ఈ సందర్భంగా భారత్ విధానాన్ని ఇందిరాగాంధీ నిక్సన్ ని కుండబద్దలు కొట్టినట్లుగా చెప్పారు.

By:  Tupaki Desk   |   11 May 2025 4:00 PM IST
ఐరన్ లేడీ...ఇందిరను అంతా గుర్తు చేసుకుంటున్నారు!
X

గత కొద్ది రోజులుగా భారత్ పాకిస్థాన్ ల మధ్య సరిహద్దులలో ఘర్షణలు దాడులు జరిగాయి. చివరికి కాల్పుల నిలుపుదలతో అవి ముగిసాయి. అయితే దీని మీద అనేక రకాలైన భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. పాక్ ని దెబ్బకొట్టే మంచి చాన్స్ పోయింది అని కొందరు అంటూంటే యుద్ధం భారత్ విధానం కాదని మరి కొందరు అంటున్నారు. యుద్ధం కాదు చర్చలు అని తాను ముందే చెప్పాను అని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ కూడా రియాక్టు అయ్యారు.

ఇవన్నీ ఒక ఎత్తు అయితే పాక్ తో భారత్ కి యుద్ధం అన్నది ఇప్పటిది కాదు గతంలో చాలా జరిగాయి. అయితే 1971లో మాత్రం జరిగిన యుద్ధంతో భారత్ చరిత్ర పుటలలో నిలిచిపోయే ఘన విజయం అందుకుంది. ఆ యుద్ధంలో ఏకంగా పాక్ ని రెండు ముక్కలు చేసింది ఐరన్ లేడీ ఆనాటి ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ. అంతే కాదు ఒక వైపు అమెరికా మరో వైపు చైనా ఇంకో వైపు బ్రిటన్ కలసికట్టుగా పాకిస్థాన్ ని మద్దతుగా నిలిచినా ప్రపంచంలో భారత్ ని ఒంటరి చేసినా ఆమె వెరవలేదు, బెదరలేదు. భారత్ శౌర్యమేంటో చూపించారు.

పాక్ ని ఓడించడమే కాదు అగ్ర రాజ్యం అమెరికాకు భారత్ అంటే ఏమిటో రుజువు చేశారు. ఈ సందర్భంగా అమెరికాలోని వైట్ హౌస్ లో నాటి అమెరికా ప్రెసిడెంట్ రిచర్డ్ నిక్సన్ ఉన్నారు. పాక్ తో భారత్ ఉద్రిక్తతలు యుద్ధానికి దారి తీస్తున్న నేపధ్యంలో నిక్సన్ తో ఇందిరాగాంధీ భేటీ వైట్ హౌస్ లో జరిగింది.

ఈ సందర్భంగా భారత్ విధానాన్ని ఇందిరాగాంధీ నిక్సన్ ని కుండబద్దలు కొట్టినట్లుగా చెప్పారు. తమది స్వతంత్ర దేశమని తమ అభిప్రాయాలు తమకు ఉన్నాయని ఏ ఇతర దేశమూ తమను శాసించలేదని ఆమె కరాఖండీగా స్పష్టం చేశారు. అంతే కాదు భారత్ కి అమెరికా ఒక ముఖ్య మిత్రుడు మాత్రమే బాస్ కాజాలరని ఆమె ఘాటుగానే జవాబు చెప్పారుట. అమెరికా తాను పాక్ ఇండియా ఇష్యూలో జోక్యం చేసుకోవడానికి ఆసక్తి చూపి భారత్ ని నిలువరించే ప్రయత్నం చేసినపుడు ఐరన్ లేడీ ఇందిరా గాంధీ అగ్ర రాజ్యానికి ధీటుగా ఇచ్చిన బదులు ఇది.

అంతే కాదు పాకిస్థాన్ తో యుద్ధం ప్రకటించాక అమెరికా పాకిస్థాన్ కి అత్యంత శక్తివంతమైన ఆయుధాలను సమకూర్చిపెట్టింది. భారత్ కి ఇంధనం సరఫరా కాకుండా అడ్డుపడింది. భారత్ కి ఏ సాయం అందకుండా ఇతర దేశాలను తన శక్తియుక్తులతో భయపెట్టింది.

అయినా ఇందిరాగాంధీ వెరవలేదు, వెనకడుగు వేయలేదు. ఎవరీ అమెరికా మా మీద శాసించడానికి అనుకున్నారు. తానుగా యుద్ధం చేశారు. ఏకంగా లక్షన్నర మంది దాకా పాక్ సైనికులను బంధీలుగా పట్టుకున్నారు. పాక్ భూభాగంలోకి ప్రవేశించి మరీ లాహోర్ దాకా పాక్ సేనలను తరిమి కొట్టారు. తూర్పు పాకిస్థాన్ స్వతంత్ర కాంక్షను అర్థం చేసుని బంగ్లాదేశ్ గా కొత్త దేశం ఆవిర్భావానికి కృషి చేశారు.

ఆనాడు ఆమెకు విపక్ష నేతగా ఉన్న వాజ్ పేయ్ నుంచి ఇతర రాజకీయ పార్టీల నుంచి ఎంతగానో సహకారం దక్కింది. ఇందిరను దుర్గామాత అని వాజ్ పేయ్ కొనియాడారు అంటే నాడు అధికార విపక్షాల మధ్య ఉన్న బంధం ఎంత గొప్పదో దేశ హితం కోసం ఎంతలా కలసి మెలసి పనిచేశారో అంతా ఇపుడు ఆలోచించాలి. ఇపుడు కూడా ఒక పరిమిత స్థాయిలో భారత్ పాక్ ల మధ్య యుద్ధం వచ్చింది. అమెరికా మధ్యవర్తిత్వంతో ఈ యుద్ధం ఆగిపోయింది.

ఈ విషయాల నేపధ్యంలో ఆనాటి సంఘటనలను ఇందిరాగాంధీ తెగువను ఇపుడు అంతా మరోసారి గుర్తు చేసుకుంటున్నారు. అమెరికా పెద్దన్న పాత్ర రుచించని వారు ఇందిరాగాంధీ అమెరికాను ఎలా దూరం పెట్టిందో కూడా గుర్తు చేసుకుంటున్నారు. దటీజ్ ఇందిరా అని అంటున్నారు.