Begin typing your search above and press return to search.

పాక్‌కు దిమ్మతిరిగే షాక్.. దిగుమతులపై భారత్ పూర్తి నిషేధం!

ఇండియా, పాకిస్తాన్ మధ్య జరిగే వ్యాపారానికి ఒకే ఒక దారి ఉండేది. అదే అటారీ-వాఘా బోర్డర్. దాన్ని కూడా ఎప్పుడో మూసేశారు.

By:  Tupaki Desk   |   3 May 2025 2:00 PM IST
పాక్‌కు దిమ్మతిరిగే షాక్.. దిగుమతులపై భారత్ పూర్తి నిషేధం!
X

పహల్గాంలో టూరిస్టుల మీద ఉగ్రవాదులు దాడి చేసిన సంగతి తెలిసిందే. దానితో ఇండియాకు పాకిస్తాన్ కు మధ్యలో మంటలు రాజుకున్నాయి. అప్పటినుంచే మనోళ్లు పాక్‌తో అన్ని దౌత్య సంబంధాలు తెంచుకున్నారు. ఇప్పుడు తాజాగా ఇంకో పెద్ద షాక్ ఇచ్చారు. పాకిస్తాన్ నుంచి వచ్చే ఏ ఒక్క వస్తువునూ దిగుమతి చేసుకోకూడదని తెగేసి చెప్పేశారు. కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ దీనికి సంబంధించి ఒక ఆర్డర్ కూడా పాస్ చేసింది. మన దేశ భద్రతను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. పాకిస్తాన్ నుంచి మన దేశానికి వచ్చే అన్ని రకాల సరుకులపై ఈ నిషేధం వర్తిస్తుందట.

"పాకిస్తాన్‌లో తయారయ్యే లేదా అక్కడి నుంచి ఇండియాకు వచ్చే ఏ ఒక్క వస్తువును కూడా డైరెక్ట్‌గా కానీ, ఇన్ డైరెక్ట్‌గా కానీ దిగుమతి చేసుకోం. ఇదివరకే పర్మిషన్ ఉన్నా సరే, ఫ్రీగా వచ్చేవి అయినా సరే పాకిస్తాన్ నుంచి ఏమీ రానివ్వం. ఈ రూల్ ఇప్పుడే అమల్లోకి వస్తుంది. మళ్లీ చెప్పేంత వరకు ఇట్లానే ఉంటుంది. ఒకవేళ ఎవరికైనా ఏమైనా మినహాయింపులు కావాలంటే, ముందుగా ఇండియా గవర్నమెంట్ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి" అని వాణిజ్య మంత్రిత్వ శాఖ తమ ఆర్డర్‌లో తేల్చి చెప్పింది.

ఇండియా, పాకిస్తాన్ మధ్య జరిగే వ్యాపారానికి ఒకే ఒక దారి ఉండేది. అదే అటారీ-వాఘా బోర్డర్. దాన్ని కూడా ఎప్పుడో మూసేశారు. ఇక 2019లో పుల్వామాలో బాంబు పేలుడు జరిగినప్పటి నుంచే పాకిస్తాన్ నుంచి మనం చాలా తక్కువ వస్తువులు తెచ్చుకుంటున్నాం. పాక్ వస్తువులపై మన గవర్నమెంట్ ఏకంగా 200 శాతం ట్యాక్స్ వేసింది. కొన్ని రకాల మందులు, పండ్లు, నూనె గింజలు లాంటి కొన్నే తెచ్చుకుంటున్నాం. లెక్కల ప్రకారం చూసినా ఈ దిగుమతులు చాలా తక్కువే. 2024-25లో ఇండియా నుంచి పాకిస్తాన్‌కు దాదాపు 447.65 మిలియన్ డాలర్ల విలువైన వస్తువులు ఎగుమతి కాగా, అక్కడి నుంచి మనం తెచ్చుకున్నది కేవలం 0.42 మిలియన్ డాలర్ల విలువైన సరుకులు మాత్రమే. ప్రపంచవ్యాప్తంగా ఇండియా చేసే బిజినెస్‌లో ఇది కేవలం 0.1 శాతం మాత్రమే.

ఈ బిజినెస్ విలువ తక్కువే అయినా పాకిస్తాన్‌లోని కొన్ని కంపెనీలు మాత్రం ఇండియాకు చేసే ఎగుమతుల మీదనే బతుకుతున్నాయి. ఆర్గానిక్ కెమికల్స్, ప్లాస్టిక్స్, విలువైన లోహాల మిశ్రమాలు, మినరల్ ఫ్యూయల్స్, నూనె పదార్థాలు, కొన్ని రకాల పిండి పదార్థాలు, గమ్, ఎంజైమ్స్, రంగులు, మసాలా దినుసులు లాంటివి మనం తెచ్చుకునే వాటిలో ఉన్నాయి. ఇప్పుడు ఇండియా వాటిని కూడా బంద్ చేయడంతో పాక్‌లో ఆ బిజినెస్‌లు మూతపడే ప్రమాదం ఉంది. ఇంకోవైపు, పాకిస్తాన్ జెండా ఉన్న ఓడలు ఇండియా పోర్టుల్లోకి రావడానికి కూడా మన గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వలేదు. ఈ రూల్ కూడా ఇప్పుడే అమల్లోకి వస్తుందని చెప్పారు. అంతేకాదు, ఇండియా ఓడలు కూడా పాక్ పోర్టుల్లోకి వెళ్లకూడదని తేల్చి చెప్పారు. అంటే ఇక మీదట సముద్రం ద్వారా కూడా వాళ్లకి మనకి ఎలాంటి సంబంధం ఉండదు.