Begin typing your search above and press return to search.

మనం ఫైటర్ జెట్స్ కోల్పోయాం.. తొలిసారి ఓపెన్ అయిన సీడీఎస్!

మరోవైపు కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈ అంశాన్ని తరచూ ప్రస్తావిస్తూ ఉన్న సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   1 Jun 2025 10:27 AM IST
మనం ఫైటర్ జెట్స్ కోల్పోయాం.. తొలిసారి ఓపెన్ అయిన సీడీఎస్!
X

ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో పాక్ తో నెలకొన్న ఉద్రిక్తతల వేళ.. భారత్ కొన్ని ఫైటర్ జెట్ లను కోల్పోయిందన్న వాదనకు సంబంధించి కీలక అంశాన్ని వెల్లడించారు సీడీఎస్ (చీఫ్ ఆఫ్ ది డిఫెన్స్ స్టాఫ్) అనిల్ చౌహాన్. ఇప్పటివరకు పలు రాఫెల్ యుద్ధ విమానాల్ని భారత్ కోల్పోయినట్లుగా ప్రచారం జరగటం తెలిసిందే. అయితే.. దీనికి సంబంధించి ఇప్పటివరకు మోడీ సర్కారు కానీ.. డిఫెన్స్ అధికారులు కానీ క్లారిటీ ఇచ్చింది లేదు.

మరోవైపు కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈ అంశాన్ని తరచూ ప్రస్తావిస్తూ ఉన్న సంగతి తెలిసిందే. ఈ మధ్యనే ఒక బహిరంగ సభలో మాట్లాడిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం.. రాఫెల్ యుద్ధ విమానాల్ని కోల్పోయినట్లుగా పేర్కొన్నారు. ఓవైపు ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో భారత్ చేసిన వైమానిక దాడులతో తమ ఎయిర్ బేస్ లు నేలమట్టం అయినట్లుగా పాక్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ ధ్రువీకరించటం తెలిసిందే.

భారత్ దాడుల్ని తిప్పి కొట్టే ప్రయత్నం చేసినా నష్టాన్ని ఆపటం సాధ్యం కాలేదని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి వేళ పాక్ తో జరిగిన యుద్ధంలో భారత్ ఎన్ని యుద్ధ విమానాల్ని కోల్పోయిందన్న వాదన తెర మీదకు వచ్చింది. దీనికి సంబంధించి తొలిసారి కీలక వ్యాఖ్యలు చేశారు సీడీఎస్ అనిల్ చౌహాన్. సింగపూర్ లో జరుగుతున్న షాంగ్రీ లా డైలాగ్ సెక్యూరిటీ ఫోరం సదస్సుకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా బ్లూమ్ బర్గ్ టీవీ, రాయిటర్స్ కు కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

ఇంతకూ ఆయన ఏమన్నారన్నది ఆయన మాటల్లోనే చెబితే... ‘అవును.. పాక్ తో జరిగిన యుద్ధంలో భారత్ ఫైటర్ జెట్స్ ను కోల్పోయిన మాట వాస్తవమే. యుద్ధం అన్నాక కొన్ని ఇలా జరుగుతూనే ఉంటాయి. మనం ఎన్ని కోల్పోయాయం అనేది ప్రశ్న కాదు. ఎందుకు కోల్పోయాయమన్నది మాత్రమే సమీక్షించుకోవాలి. పాక్ చెప్పినట్లుగా ఆరు ఫైటర్ జెట్స్ మనం కోల్పోలేదు. అందులో వాస్తవం లేదు’ అని స్పష్టం చేశారు. దీంతో.. ఇప్పటివరకు ఫైటర్ జెట్స్ ను భారత్ కోల్పోయిందన్న మాటకు అధికారికంగా ఒప్పుకున్నట్లైంది. కాకుంటే.. ఎన్ని అన్న దానిపై మాత్రం స్పష్టత రాలేదు.

అంతేకాదు తప్పు ఎందుకు జరిగిందో? ఎక్కడ జరిగిందో వెంటనే గుర్తించి సరిదిద్దుకున్నామని.. ఆ తర్వాత రెండు రోజుల్లోనే అన్ని రకాల విమానాలు.. ఆయుధాలతో కఛ్చితమైన దాడులు చేసి పాక్ ను దెబ్బ కొట్టామని చెప్పారు. అయితే.. రెండు దేశాల మధ్య అణుయుద్ధం జరిగేటువంటి పరిస్థితి ఏదీ తలెత్తలేదన్నారు. భారత్ - పాక్ మధ్య అణుయుద్ధం జరిగే పరిస్థితిని తాను ఆపానని.. కాల్పుల విరమణకు ఒప్పించామని చెప్పిన ట్రంప్ మాటల్ని ఆయన తోసిపుచ్చారు.

పాకిస్తాన్ లోని కీలక ఎయిర్ బేస్ లు.. సైనిక స్థావరాల వద్ద గగనతల రక్షణ వ్యవస్థలు ఉన్నా.. వాటిని తప్పుదారి పట్టించి మరీ భారత్ దాడులు చేసినట్లుగా చౌహాన్ చెప్పారు. పాకిస్థాన్ భూభాగంలో 300 కిలోమీటర్లు లోపలి వరకు కేవలం ఒక్క మీటరు తేడాతో కూడిన కచ్ఛితత్త్వంతో లక్ష్యాల్ని ధ్వంసం చేసినట్లు చెప్పారు. పాక్ కు చైనా అందించిన గగనతల రక్షణ వ్యవస్థలు పని చేయలేదన్నారు.