Begin typing your search above and press return to search.

500 మంది జనం..నాటి బంకర్లు సజీవం..1971 యుద్ధం గెలిచింది ఇక్కడి నుంచే!

భారత్, పాకిస్తాన్ మధ్య 1971లో జరిగిన యుద్ధం నాటి గుర్తులు ఇప్పటికీ సరిహద్దు ప్రాంతంలో ఉన్నాయి.

By:  Tupaki Desk   |   3 May 2025 3:57 PM
500 మంది జనం..నాటి బంకర్లు సజీవం..1971 యుద్ధం గెలిచింది ఇక్కడి నుంచే!
X

జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాంలో ఇటీవల జరిగిన ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో రాజస్థాన్‌లోని సరిహద్దు ప్రాంతాల్లో దీని ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. భారత్-పాక్ అంతర్జాతీయ సరిహద్దుకు దగ్గరగా ఉన్న గ్రామాల్లో నివసిస్తున్న ప్రజలు అప్రమత్తంగా ఉండడమే కాకుండా ఎలాంటి పరిస్థితిని అయినా ఎదుర్కొనేందుకు రెడీగా ఉన్నారు. అవసరమైతే తమ ఇళ్లను వదిలి వెళ్లడానికి కూడా వెనుకాడబోమని సైన్యానికి అన్ని విధాలా సహాయం చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని గ్రామస్తులు చెబుతున్నారు.

భారత్, పాకిస్తాన్ మధ్య 1971లో జరిగిన యుద్ధం నాటి గుర్తులు ఇప్పటికీ సరిహద్దు ప్రాంతంలో ఉన్నాయి. ఎడారిలోని వేడి ఇసుక తిన్నెల మధ్య భారత సైన్యం, ఇనుప బుల్లెట్‌ప్రూఫ్ బంకర్లు దర్శనమిస్తాయి. ఈ బంకర్ల నుంచే సైనికులు పాకిస్తాన్ సరిహద్దులో శత్రుదేశం ప్రతి చర్యను కనిపెట్టేవారు. మందపాటి ఇనుప రేకులతో తయారు చేసిన బుల్లెట్‌ప్రూఫ్ బంకర్లు జైసల్మేర్ సరిహద్దు ప్రాంతంలోని చివరి గ్రామంలో ఇప్పటికీ ఉన్నాయి. 1971 నాటి భారత్-పాక్ యుద్ధ సమయంలో భద్రతా దృష్ట్యా సైన్యం ఈ గ్రామాన్ని ఖాళీ చేయించింది.

దాదాపు 500 మంది జనాభా కలిగిన ఈ గ్రామం సరిహద్దు చివరి గ్రామంగా పిలుస్తారు. గ్రామంలో ఎటువంటి అనుమానాస్పద వ్యక్తులు కనిపించకుండా నిఘా అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తుంటారు. ఈ గ్రామానికి సమీపంలోనే భారత్-పాక్ సరిహద్దు పాత కంచె, బంకర్లు ఉన్నాయి. వేడి ఇసుక తిన్నెల మధ్య ఇక్కడ ఉష్ణోగ్రత 47 డిగ్రీల సెల్సియస్‌ను దాటి ఉంటుంది. నిలబడడం కూడా కష్టమైన ఈ వేడిలో నుంచే భారతీయ సైనికులు 1971 యుద్ధంలో పోరాడి పాకిస్తాన్ సైన్యాన్ని మట్టి కరిపించారు.

1971 నాటి భారత్-పాకిస్తాన్ యుద్ధం తర్వాత భారత సైన్యం పాకిస్తాన్‌ను భారతదేశం పాత సరిహద్దు నుంచి దాదాపు 20 కిలోమీటర్ల మేర తరిమికొట్టి పాకిస్తాన్ భూభాగాన్ని స్వాధీనం చేసుకుంది. ఇప్పుడు భారత్-పాకిస్తాన్ సరిహద్దు దాదాపు 20 కిలోమీటర్లు ముందుకు జరిగింది. 1971 నాటి భారత్-పాక్ యుద్ధాన్ని గుర్తు చేసుకుంటూ ఒక వృద్ధ గ్రామస్తుడు మాట్లాడుతూ.. "బాంబులు పడుతున్నప్పుడు నేను రామ్‌గఢ్‌లో ఉన్నాను. ఈ గ్రామాల్లో బంకర్లు అప్పటికే నిర్మించారు. అవి యుద్ధం వంటి పరిస్థితుల్లో గ్రామస్తులకు, సైనికులకు ఆశ్రయం ఇస్తాయి’’ అని అన్నారు. అయితే, యుద్ధం వస్తే వేసవిలో తమ పశువులను ఎలా చూసుకోవాలో కొంతమంది గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు.

మరొక గ్రామస్తుడు మాట్లాడుతూ.. "మేము బంకర్లలోకి వెళ్ళిపోతాము, కానీ పశువుల సంగతేంటి? ఇంత వేడిలో వాటిని చూసుకోకపోతే అవి చనిపోవచ్చు. అయినప్పటికీ, దేశం ముఖ్యం ఈ బాధను కూడా భరిస్తాము" అని అన్నారు. పాకిస్తాన్‌కు గట్టిగా బుద్ధి చెప్పడం చాలా అవసరమని గ్రామస్తులు నమ్ముతున్నారు. పాకిస్తాన్‌కు దాని దుశ్చర్యలకు సరైన సమాధానం చెప్పే వరకు అది మారదని వారు అభిప్రాయపడుతున్నారు.