Begin typing your search above and press return to search.

రెండున్నర గంటల్లో నిర్ణయాలు... పాక్ ఆయువుపట్టుకు కౌకు దెబ్బలు!

జమ్ముకశ్మీర్ లోని పహల్గాంలోని పర్యాటకులపై ఉగ్రవాదులు భీకర దాడులు జరిపిన ఘటనలో 26 మంది మరణించిన సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   24 April 2025 11:43 AM IST
రెండున్నర గంటల్లో నిర్ణయాలు... పాక్  ఆయువుపట్టుకు కౌకు దెబ్బలు!
X

జమ్ముకశ్మీర్ లోని పహల్గాంలోని పర్యాటకులపై ఉగ్రవాదులు భీకర దాడులు జరిపిన ఘటనలో 26 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనను భారత్ సహా ప్రపంచం మొత్తం ఖండించింది. ఈ సమయంలో.. సీమాంతర ఉగ్రవాదాన్ని వీడే వరకూ పాకిస్థాన్ పట్ల కఠినంగా వ్యవహరించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది.

ఈ సమయంలో.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన బుధవారం ఢిల్లీలో జరిగిన భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (సీసీఎస్) ఈ మేరకు పలు కీలక నిర్ణయాలు తీసుకొంది. ఈ నేపథ్యంలో సుమారు రెండున్నర గంటలపాటు చర్చించి తీసుకున్న నిర్ణయాలు పాక్ ఆయూవు పట్టుకు కౌకు దెబ్బలనే కామెంట్లను సొంతం చేసుకున్నాయి.

అవును... పహల్గాం ఘటన అనంతరం ప్రధాని మోడీ అధ్యక్షతన భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (సీసీఎస్) బుధవారం ఢిల్లీలోని లోక్ నాయక్ మార్గ్ లో ఉన్న ప్రధాని నివాసంలో సమావేశమైంది. సుమారు రెండున్నర గంటల పాటు జరిగిన ఈ భేటీలో అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, జై శంకర్, అజిత్ దోవల్, విక్రమ్ మిస్త్రీ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో భాగంగా...

* సీమాంతర ఉగ్రవాదానికి ముగింపు పలికే వరకూ పాకిస్థాన్ తో సింధూనదీ జలాల ఒప్పందాన్ని నిలిపేయాలని భారత్ నిర్ణయించింది.

* ఇదే సమయంలో... భారత్ - పాక్ మధ్య వాణిజ్యం, ప్రజల మధ్య సంబంధాలకు కీలకమైన బిందువు అయిన అట్టారీ - వాఘా ల్యాండ్ క్రాసింగ్ ను తక్షణమే మూసివేస్తున్నట్లు ప్రకటించింది.

* ఢిల్లీలోని పాకిస్థాన్ హైకమిషన్ సిబ్బంది సంఖ్య 55 నుంచి 30కి తగ్గించింది!

* భారత్ లోని పాక్ దౌత్య కార్యాలయాల్లో పనిచేస్తోన్న ఆ దేశ సైనిక అధికారులను, సిబ్బందిని అవాంఛిత వ్యక్తులుగా ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది. దేశం విడిచి వెళ్లేందుకు వారికి 48 గంటల గడువు ఇచ్చింది!

* అదేవిధంగా... సార్క్ వీసా మినహాయింపు పథకం ద్వారా భారత్ లో పర్యటిస్తున్న పాకిస్థాన్ జాతీయులకు అనుమతులు రద్దు చేసింది. మే ఒకటో తేదీలోగా వారంతా దేశం విడిచి వెళ్లిపోవాలని హుకుం జారీ చేసింది!

ఇలా పైకి కనిపించని కౌకు దెబ్బలు లాంటి దౌత్యపరమైన నిర్ణయాలతో పాక్ కు స్ట్రోక్ ఇచ్చిన భారత్ మరోపక్క... పహల్గాం నరమేధానికి పాల్పడిన ముష్కరులను శిక్షించడంతోపాటు వారిని ఎగదోస్తున్న శక్తులను బాధ్యులుగా నిలబెడతామని, వారిని వెంటాడి వేటాడతామని పాకిస్థాన్ ను గట్టిగా హెచ్చరించింది.

ఇదే సమయంలో.. ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకోవడానికి భద్రతా దళాలు వేటను ముమ్మరం చేశాయి. ఇప్పటికే బుధవారం భారత్ లో ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్న ముష్కరులను గుర్తించిన సైన్యం.. ఎన్ కౌంటర్ మొదలైనట్లు, ఇద్దరు ఉగ్రవాదులు రాలినట్లు వెల్లడించింది. వారి నుంచి భారీగా మందుగుండు సామాగ్రి, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది.