నరరూప రాక్షసులపై రివార్డ్ ప్రకటించిన పోలీస్!
జమ్మూకశ్మీర్ లోని పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదుల పాశవిక దాడి భారత్ ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 24 April 2025 6:16 PM ISTజమ్మూకశ్మీర్ లోని పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదుల పాశవిక దాడి భారత్ ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా స్పందించిన భారత్... ఈ నరమేధానికి పాల్పడిన ముష్కరులను శిక్షించడంతోపాటు.. వారిని ఎగదోస్తున్న శక్తులనూ బాధ్యులుగా నిలబెడతామని పాకిస్థాన్ ను గట్టిగా హెచ్చరించింది.
ఇదే సమయంలో తాజాగా బీహార్ లోని ఓ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోడీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇందులో భాగంగా... దాడి చేసినవారు, దాడి వెనుక ఉన్న కుట్రదారులకు వారి ఊహకు మించిన శిక్ష పడుతుందని అన్నారు. మరోపక్క ముష్కరుల ఆచూకీ తెలిపిన వారికి అనంతనాగ్ జిల్లా పోలీసులు రివార్డ్ ప్రకటించారు.
అవును... ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకోవడానికి భద్రతా దళాలు వేటను ముమ్మరం చేశాయి. ఇందులో భాగంగా... బుధవారం భారత్ లో ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్న ఉగ్రవాదులను గుర్తించిన సైన్యం.. ఎన్ కౌంటర్ మొదలైనట్లు తెలిపింది. ఈ సందర్భంగా ఇద్దరు ముష్కరులను మట్టుబెట్టినట్లు ఆర్మీ వెల్లడించింది.
ఇదే సమయంలో... మంగళవారం పహల్గాంలో దాడికి పాల్పడిన ముష్కరుల ఆచూకీ తెలిపినవారికి రూ.20 లక్షల బహుమతి ఇస్తామని జమ్మూకశ్మీర్ లోని అనంతనాగ్ పోలీసులు ప్రకటించారు. ఈ పిరికిపంద చర్యలో పాల్గొన్న ఉగ్రవాదులను మట్టుబెట్టడానికి లేదా బంధించడానికి సహకరించే సమాచారం ఇచ్చేవారికి ఈ రివార్డు అందుతుందని ఎక్స్ వేదికగా తెలిపారు.
మరోపక్క ఉగ్రదాడిలో ఆప్తులను కోల్పోయిన బాధిత కుటుంబాలకు జమ్మూకశ్మీర్ ప్రభుత్వం రూ.10 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది. ఇదే సమయంలో.. ఆ దాడిలో తీవ్రంగా గాయపడిన వారికి రూ.2 లక్షల చొప్పున, స్వల్పంగా గాయపడిన వారికి రూ.లక్ష చొప్పున నగదు సహాయం చేయనున్నట్లు వెల్లడించింది.
