పాక్ కు షాక్... భారత్ 5 సంచలన నిర్ణయాలు ఇవే!
ఇందులో భాగంగా... తాజా ఉగ్రదాడి వెనుక పాక్ హస్తం ఉందని కేంద్రం పేర్కొంది. ఈ నేపథ్యంలో.. పాక్ పర్యాటకులు భారత్ ను వీడాలని తేల్చి చెప్పింది. ఈ సందర్భంగా 5 ప్రధాన ప్రకటనలు చేసింది.
By: Tupaki Desk | 23 April 2025 11:33 PM ISTజమ్ముకశ్మీర్ లో జరిగిన ఉగ్రదాడి తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిన సంగతి తెలిసిందే. ఈ భీకర ఉగ్రదాడిలో 26మంది పర్యాటకులు మరణించారు. ఈ సమయంలో ఈ ఉగ్రదాడిని భారత్ అత్యంత తీవ్రంగా పరిగణించింది. ఈ సమయంలో ప్రధాని మోడీ నేతృత్వంలో ఆయన నివాసంలో సుమారు రెండున్నర గంటల పాటు భద్రతపై కేబినెట్ కమిటీ (సీసీఎస్) సమావేశం జరిగింది.
ఈ సమయంలో పెహల్గాం ఉగ్రదాడిపై సుదీర్ఘంగా చర్చించిన సీసీఎస్ సమావేశంలో.. పలు సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో భాగంగా... తాజా ఉగ్రదాడి వెనుక పాక్ హస్తం ఉందని కేంద్రం పేర్కొంది. ఈ నేపథ్యంలో.. పాక్ పర్యాటకులు భారత్ ను వీడాలని తేల్చి చెప్పింది. ఈ సందర్భంగా 5 ప్రధాన ప్రకటనలు చేసింది.
అవును... పెహల్గాం ఉగ్రదాడి వెనుక పాక్ హస్తం ఉందని కేంద్రం పేర్కొంది. ఈ నేపథ్యంలో పాక్ పౌరులు తక్షణం భారత్ ను వీడాలను తేల్చి చెప్పింది. ఇదే సమయంలో.. ప్రత్యేక వీసాదారులు 48 గంటల్లో భారత్ ను వీడాలని ఆదేశించింది. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ కార్యదర్శి మిక్రమ్ మిస్త్రీ వెల్లడించారు.
సింధూ జలాల సహకారాన్ని నిలిపేయడం!:
పెహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో సీసీఎస్ భేటీలో 5 కీలక నిర్ణయాలు తీసుకోగా.. అందులో సింధూ జలాల సహకారాన్ని నిలిపివేయడం ఒకటి. ఇందులో భాగంగా.. సింధూ నదీ వ్యవస్థ నుంచి ఏటా సుమారు 39 బిలియన్ క్యూబిక్ మీటర్ల నీరు భారత్ నుంచి పాక్ లో ప్రవహించే సింధూ జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేసింది.
వాఘా సరిహద్దు మూసివేత!:
ఇదే సమయంలో... భారత్ - పాక్ మధ్య వాణిజ్యం, ప్రజల మధ్య సంబంధాలకు కీలకమైన బిందువు అయిన అట్టారీ - వాఘా ల్యాండ్ క్రాసింగ్ ను తక్షణమే మూసివేస్తున్నట్లు భారత విదేశాంగశాఖ ప్రకటించింది.
పాక్ పౌరులకు భారత్ లోకి నో ఎంట్రీ!:
పెహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ తీసుకున్న మరో కీలక నిర్ణయం.. పాకిస్థాన్ జాతీయులు భారత్ లోకి ప్రవేశించడంపై నిషేధం విధించడం. ఈ సందర్భంగా స్పందించిన మిస్త్రీ... ఇకపై పాక్ పౌరులు భారత్ లో ప్రవేశించడం నిరవధికంగా నిలిపివేయబడిందని తెలిపారు. ఇందులో వీసా సేవలతో పాటు సరిహద్దు ప్రయాణ అనుమతులు ఉన్నాయని వెల్లడించారు.
సైనిక సలహాదారుల బహిష్కరణ!:
ఈసారి మాత్రం క్షమించేది లేదు..! అలా అని సైనిక చర్యతో మాత్రమే సమాధానం చెప్పడం కాదు.. అన్ని రకాలుగానూ పాక్ కు ముచ్చెమటలు పట్టించాలని భారత్ భావిస్తున్నట్లుంది! ఈ సమయంలో న్యూఢిల్లీలోని పాక్ హైకమిషన్ లో నియమించబడ్డ అన్ని సైనిక సలహాదారులను బహిష్కరించింది.
హైకమిషన్ సిబ్బంది సంఖ్య తగ్గింపు!:
ఈ సందర్భంగా భారత్ తీసుకున్న ఐదో నిర్ణయం.. ఢిల్లీలోని పాకిస్థాన్ హైకమిషన్ సిబ్బంది సంఖ్య తగ్గించడం. ఇందులో భాగంగా... హస్తినలో దౌత్యపరమైన సిబ్బందిని 30కి తగ్గించాలని పాక్ ను భారత్ ఆదేశించింది. కాగా.. ప్రస్తుతం ఉన్న సిబ్బంది సంఖ్య 55!
