భారత్ అంబులపొదిలో అద్భుత ఆయుధవ్యవస్థ... ఏమిటీ ఎస్-400?
అవును... ఆపరేషన్ సిందూర్ కు ప్రతీకారంగా పాకిస్థాన్ వైమానిక, క్షిపణి దాడులకు దిగితే వాటిని నిలువరించే అత్యంత శక్తివంతమైన ఆయుధ వ్యవస్థ ఎస్-400.
By: Tupaki Desk | 8 May 2025 11:21 AM ISTపహల్గాం ఉగ్రదాడికి భారత్ అపరేషన్ సిందూర్ తో ప్రతీకారం మొదలుపెట్టింది. కేవలం 25 నిమిషాల్లో 9 ఉగ్రస్థావరాలపై 24 క్షిపణులతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో సుమారు 80 మంది ఉగ్రవాదులు మరణించారని అంటున్నారు. ఈ సమయంలో ప్రతీకార దాడులకు పాక్ ప్రతీకారానికి దిగితే భారత్ అంబుల పొదిలోని అద్భుత వ్యవస్థ అడ్డుకుంటుంది.
అవును... ఆపరేషన్ సిందూర్ కు ప్రతీకారంగా పాకిస్థాన్ వైమానిక, క్షిపణి దాడులకు దిగితే వాటిని నిలువరించే అత్యంత శక్తివంతమైన ఆయుధ వ్యవస్థ ఎస్-400. ఇది శత్రువుల క్షిపణులు, డ్రోన్లతో పాటు యుద్ధ విమానాలను మార్గమధ్యలోనే పేల్చివేస్తుంది. ఇప్పుడు భారత బలగాలు దీన్ని మరింత క్రియాశీలం చేసినట్లు తెలుస్తోంది.
రష్యాకు చెందిన ఎన్.పీ.వో. అల్మాజ్ సంస్థ అభివృద్ధి చేసిన ఈ సంచార్ క్షిపణి వ్యవస్థ.. గతంలో ఉన్న ఎస్-300కి అప్ డేటెడ్ వెర్షన్. ఇదే సమయంలో ఎస్-400 కంటే మరింత మెరుగైన ఎస్-500 గగనతల రక్షణ వ్యవస్థను అభివృద్ధి చేస్తోన్నారు. ప్రస్తుతం భారత్ వద్ద ఉన్న ఎస్-400.. ప్రత్యర్థి జామింగ్ విధానాలను తట్టుకోగలదు.
2018లో మొత్తం ఐదు క్షిపణి వ్యవస్థల కొనుగోలుకు భారత్, రష్యాతో 543 కోట్ల డాలర్ల ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇందులో మూడు వ్యవస్థలు ఇప్పటికే భారత్ కు చేరగా.. మిగిలిన రెండు క్షిపణి వ్యవస్థలు వచ్చే ఏడాది ఆగస్టులో చేరే అవకాశం ఉందని అంటున్నారు. డ్రోన్లు, యుద్ధవిమానాలు, బాలిస్టిక్ క్షిపణులను అత్యంత కచ్చితత్వంతో ఇది నేలకూల్చగలదు.
ప్రస్తుతం ఆపరేషన్ సిందూర్ అనంతరం పాక్ నుంచి ఎదురయ్యే ముప్పుల కోసం భారత్ దగ్గర ఉన్న మూడు ఎస్-400 లను సరిహద్దు రాష్ట్రాల్లో మొహరించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా... ఒకటి రాజస్థాన్, మరొకటి పంజాబ్ లలో మొహరించగా.. చైనా నుంచి ముప్పు నేపథ్యంలో అరుణాచల్ ప్రదేశ్ లో మరొక వ్యవస్థను మొహరించే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఇజ్రాయెల్ వద్ద ఉన్న అద్భుత రక్షణ వ్యవస్థ అయిన ఐరన్ డోమ్ వ్యవస్థకు ఎస్-400 ఏమాత్రం తీసిపోదని అంటున్నారు. దీని పరిధి 400 కి.మీ. కాగా.. ఏకకాలంలో ఆకాశంలో 360 డిగ్రీల్లో 300 లక్ష్యాలపై కన్నేసి ఉంచగలదు.