Begin typing your search above and press return to search.

ఆన్ లైన్ కొనుగోళ్లలో సౌత్ లో టాప్ తెలంగాణ.. చివర ఎవరంటే?

టెక్నాలజీ సామాన్యుడి చేతికి అందుబాటులోకి వస్తే ఎలాంటి సిత్రాలు చోటు చేసుకుంటాయన్న దానికి నిదర్శనంగా తాజా రిపోర్టును చెప్పొచ్చు.

By:  Tupaki Desk   |   1 Jun 2025 11:00 PM IST
ఆన్ లైన్ కొనుగోళ్లలో సౌత్ లో టాప్ తెలంగాణ.. చివర ఎవరంటే?
X

టెక్నాలజీ సామాన్యుడి చేతికి అందుబాటులోకి వస్తే ఎలాంటి సిత్రాలు చోటు చేసుకుంటాయన్న దానికి నిదర్శనంగా తాజా రిపోర్టును చెప్పొచ్చు. స్మార్ట్ ఫోన్.. ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చిన తర్వాత షాపింగ్ చేసే తీరులో మార్పు కొట్టొచ్చినట్లుగా వచ్చింది. దీనికి తోడు కొవిడ్ పుణ్యమా అని.. ఆన్ లైన్ షాపింగ్.. ఓటీటీలు అందరూ వాడేయటం షురూ చేశారు. ఓటీటీల విషయాన్ని పక్కన పెడితే.. ఆన్ లైన్ షాపింగ్ ఎంతలా పెరిగిందన్న విషయాన్ని తాజాగా ఒక రిపోర్టు స్పష్టం చేస్తోంది. కేంద్ర గణాంకాల శాఖ ఈ ఏడాది మొదటి మూడు నెలలు (జనవరి - మార్చి) వ్యవధిలో కాంప్రెహెన్సివ్ మాడ్యులర్ సర్వే: టెలికాం 2025 పేరుతో ఆన్ లైన్ కొనుగోళ్ల మీద ఒక సర్వే నిర్వహించి.. రిపోర్టును సిద్ధం చేశారు.

ఈ రిపోర్టులో పలు ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి. దేశ వ్యాప్తంగా 24.5 శాతం కుటుంబాలు ఆన్ లైన్ ద్వారా కొనుగోళ్లు చేస్తున్నారు. తెలంగాణలో ఇది 35.1 శాతం ఉండగా.. ఆంధ్రప్రదేశ్ లో 23.4 శాతంగా ఉంది. సౌత్ స్టేట్స్ లో తెలంగాణ టాప్ లో ఉండగా.. మరో తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ ఆఖరి స్థానంలో ఉండటం గమనార్హం. ఆన్ లైన్ కొనుగోళ్లలో చండీగఢ్.. గోవా.. దాద్రా - నగర్ హవేలీలు టాప్ లో నిలిచాయి. ఆయా ప్రాంతాల్లో 50 శాతానికి పైగా కుటుంబాలు ఆన్ లైన్ షాపింగ్ చేస్తున్నట్లుగా గుర్తించారు.

ఆసక్తికరమైన అంశం ఏమంటే.. దేశంలో వెనుకబడిన రాష్ట్రాలుగా పేర్కొనే బిహార్.. ఉత్తరప్రదేశ్ లాంటి పెద్ద రాష్ట్రాలు సైతం ఆన్ లైన్ షాపింగ్ లో దూసుకెళ్లటం విశేషం. ఉత్తరప్రదేశ్ లో 18.9 శాతం.. మధ్యప్రదేశ్ లో 17.9 శాతం.. గుజరాత్ లో 16.4 శాతం.. ఒడిశాలో 16.2 శాతం.. రాజస్థాన్ లో 14.3 శాతం.. ఛత్తీస్ గఢ్ లో 9.6 శాతం కుటుంబాలు ఆన్ లైన్ షాపింగ్ చేస్తున్నట్లుగా గుర్తించారు. బిహార్ లో 26.6 శాతం కుటుంబాలు ఆన్ లైన్ షాపింగ్ చేస్తున్నాయి.

మరో విశేషం ఏమంటే.. రవాణా సౌకర్యాలు తక్కువగా ఉండే ఈశాన్య రాష్ట్రాల్లో ఆన్ లైన్ షాపింగ్ లో ముందు ఉన్నాయి. పెద్ద రాష్ట్రాలతో పోలిస్తే.. ఈ రాష్ట్రాల్లోని జనాభా పెద్ద ఎత్తున ఆన్ లైన్ షాపింగ్ పెద్ద ఎత్తున చేస్తున్నట్లుగా తేల్చారు. ఈశాన్య రాష్ట్రాలైన మణిపూర్ ఇందులో అందరికంటే ముందు ఉంది. ఇక్కడ 46.3 శాతం మంది ఆన్ లైన్ షాపింగ్ చేస్తున్నారు. మిజోరంలో 39.1 శాతం.. అరుణాచల్ ప్రదేశ్ లో 33.6 శాతం.. అసోంలో 35 శాతం.. మేఘాలయ 31.3 శాతం.. నాగాలాండ్ లో 25.2 శాతం చొప్పున ప్రజలు ఆన్ లైన్ షాపింగ్ చేస్తున్నారు. ఈశాన్యంలో త్రిపుర రాష్ట్రం ఒక్కటే ఆన్ లైస్ షాపింగ్ లో వెనుకబడి ఉంది.

కొనుగోళ్ల విషయంలో దూకుడు ప్రదర్శించే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆన్ లైన్ షాపింగ్ విషయంలో వెనుకబడి ఉన్నారు. వారు బిహార్ కంటే కూడా వెనుకబడి ఉండటం గమనార్హం. బిహార్ లో 26.6 శాతం మంది ప్రజలు ఆన్ లైన్ షాపింగ్ చేస్తుంటే.. ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాత్రం 23.4 శాతానికే పరిమితమై ఉండటం గమనార్హం. తెలంగాణలో ఆన్ లైన్ షాపింగ్ చేసే గ్రామీణ ప్రాంత కుటుంబాలు జాతీయ స్థాయి సగటు 16 శాతానికి సమానంగా ఉంటే.. ఏపీలో ఈ పరిస్థితి కాస్త మెరుగ్గా (16.6 శాతం) ఉన్నట్లు రిపోర్టు వెల్లడించింది.

పట్టణ ప్రాంతాల్లో చండీగఢ్ 68.7 శాతంతో టాప్ ప్లేస్ లో ఉంటే.. తర్వాతి స్థానం అసోం 61.4 శాతంతో రెండో స్థానంలో ఉంది. అండమాన్ నికోబార్ 62.1 వాతంతో మూడో స్థానంలో ఉండగా.. తెలంగాణలోని పట్టణ ప్రాంతాల్లోని 56.6 శాతం మంది ఆన్ లైన్ కొనుగోళ్లు చేస్తున్నారు. ఆన్ లైన్ కొనుగోళ్లలో గ్రామీణ ప్రాంతాల వారు తమ కొనుగోళ్లలో సగటున 75.7 శాతం ఆహారేతర వస్తువుల వాటా 75.7 శాతం ఉండగా.. పట్టణ ప్రాంతాల్లో కొనుగోలు చేసే వస్తువుల్లో ఆహారేతర వస్తువుల వాటా 37 శాతంగా ఉంది.