Begin typing your search above and press return to search.

హమ్మయ్యా.. భారత్‌కు గుడ్‌న్యూస్.. చమురు కష్టాలు తీరినట్టే..

గత కొన్ని రోజులుగా పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాలు, హార్ముజ్ జలసంధిలో పెరుగుతున్న ఉద్రిక్తతలు భారతీయ వాహనదారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించాయి.

By:  A.N.Kumar   |   2 Jun 2026 10:27 AM IST
హమ్మయ్యా.. భారత్‌కు గుడ్‌న్యూస్.. చమురు కష్టాలు తీరినట్టే..
X

గత కొన్ని రోజులుగా పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాలు, హార్ముజ్ జలసంధిలో పెరుగుతున్న ఉద్రిక్తతలు భారతీయ వాహనదారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించాయి. ఇంధన సంక్షోభం ముంచుకొస్తోందనే భయాల మధ్య దేశంలో పెట్రోల్ ధరల కంటే సామాన్యుడి గుండెల్లో మంటలే ఎక్కువగా కనిపించాయి. దీనికి తోడు ‘‘రేపటి నుంచి పెట్రోల్ దొరకదట.. బంకులు మూసేస్తారట’’ అంటూ ‘వాట్సాప్ యూనివర్సిటీ’లో నడిచిన నకిలీ పరిశోధనలు, ఫార్వర్డ్ మెసేజ్‌లు దేశవ్యాప్తంగా తీవ్ర గందరగోళాన్ని సృష్టించాయి. చాలామంది ఇప్పటికే తమ బైక్, కార్ల ట్యాంకులను ఫుల్ చేయించడమే కాకుండా ఇంట్లో ఖాళీగా ఉన్న బకెట్లు, క్యాన్లను కూడా నింపేసేందుకు బంకుల ముందు గంటల తరబడి క్యూ కట్టారు. అయితే ఈ ఆందోళనలన్నింటికీ బ్రేక్ వేస్తూ తాజాగా ఒక తీపి కబురు అందింది. భారత్-ఒమన్ మధ్య కుదిరిన కీలక ఒప్పందం దేశంలో ఇంధన కొరత భయాలకు పూర్తిగా చెక్ పెట్టినట్లు తెలుస్తోంది.

ఒమన్ హ్యాండ్.. భారత్‌కు ఫుల్ అభయం!

అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారత్ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. తాజా ఒప్పందం ప్రకారం ఒమన్ పోర్టుల నుండి భారతదేశానికి చమురు, గ్యాస్ సరఫరాలు ఎలాంటి అంతరాయం లేకుండా నిరంతరాయంగా కొనసాగనున్నాయి. ఈ ఒప్పందం ద్వారా సరఫరా మార్గాలకు పూర్తి రక్షణ లభించనుంది. ఒమన్ వ్యూహాత్మక ప్రాంతం నుండి చమురు దిగుమతులు సజావుగా సాగనుండటంతో దేశంలో ఇంధన కొరత వచ్చే అవకాశమే లేదని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. దీంతో ‘‘పెట్రోల్ ధర లీటర్‌కు రూ.300 దాటిపోతుందట’’ అని భయపడి, తమ స్కూటర్లను, బైక్‌లను వాడకుండా షోకేస్‌లో పెట్టేసిన మిడిల్ క్లాస్ వాహనదారులకు ఇది పెద్ద ఊరటనిచ్చే వార్తగా మారింది.

గ్యాస్ సిలిండర్ల భయాలకు తెర!

ఈ సంక్షోభ భయాలు కేవలం పెట్రోల్ బంకులకే పరిమితం కాలేదు, వంటగది వరకు పాకాయి. ఎల్‌పీజీ సిలిండర్ బుక్ చేసిన వెంటనే డెలివరీ అవుతుందో లేదో అని, సిలిండర్ ఇంటికి రాగానే పండగ చేసుకునే పరిస్థితులు కనిపించాయి. గ్యాస్ కొరత వస్తుందనే భయంతో ఇంట్లో ఉన్న రెండు సిలిండర్లపై మూడు తాళాలు వేసి కాపలా కాస్తున్న కుటుంబాలకు కూడా ఈ ఒమన్ ఒప్పందం పెద్ద శుభవార్తగా నిలిచింది. ఇకపై గ్యాస్ సరఫరా కూడా యథావిధిగా ఎలాంటి కొరత లేకుండా కొనసాగుతుందని నిపుణులు చెబుతున్నారు.

వైరల్ మెసేజ్‌ల బ్యాచ్‌కు గట్టి దెబ్బ!

మరోవైపు ‘‘త్వరగా నింపించుకోండి.. స్టాక్ అయిపోతోంది’’ అంటూ సోషల్ మీడియాలో నిమిషాల వ్యవధిలో పుకార్లను షేర్ చేస్తూ కాలక్షేపం చేసే ఫార్వర్డ్ మెసేజ్‌ల తయారీదారులు మాత్రం ఈ వార్తతో తీవ్ర నిరాశలోకి వెళ్లినట్లు సమాచారం. ఈ రూమర్లు నమ్మి బంకుల ముందు ఎమర్జెన్సీ క్యూలు కట్టిన జనం.. నిజం తెలుసుకుని ఊపిరి పీల్చుకుంటున్నారు. అయితే కొందరు పుకార్ల రాయుళ్లు అప్పుడే తమ రూట్ మార్చి.. సోషల్ మీడియాలో ప్రచారం చేయడానికి కొత్త పుకార్ల కోసం పరిశోధనలు ప్రారంభించారని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.

ధరలు తగ్గుతాయా? నిపుణులు ఏమంటున్నారు?

సరఫరా భయాలు తొలిగినప్పటికీ ఆర్థిక నిపుణులు మాత్రం సామాన్యుడికి ఒక చిన్న హెచ్చరిక లాంటి పచ్చి నిజాన్ని గుర్తు చేస్తున్నారు. అంతర్జాతీయ ఉద్రిక్తతలు ఉన్నా ఒమన్ ద్వారా మనకు చమురు సరఫరా సవ్యంగా సురక్షితంగా సాగుతుందనేది వంద శాతం నిజం. చమురు కొరత రాదు సరే.. మరి మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఏమైనా తగ్గుతాయా అంటే.. "అది ప్రస్తుతానికి మరో అంతర్జాతీయ రహస్యం" అని నిపుణులు నవ్వుతూ వ్యాఖ్యానిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధరల హెచ్చుతగ్గులు, రూపాయి విలువపైనే ఇది ఆధారపడి ఉంటుందని పేర్కొంటున్నారు.

ఏది ఏమైనప్పటికీ ఒమన్ ఒప్పందంతో దేశంలో ఇంధన సంక్షోభం వస్తుందనే భయాలు ప్రస్తుతానికి పూర్తిగా తొలగిపోయాయి. పెట్రోల్ బంకుల ముందు కనిపిస్తున్న కిలోమీటర్ల మేర ‘ఎమర్జెన్సీ క్యూ’లు, వాట్సాప్‌లో హల్‌చల్ చేసే ‘చివరి హెచ్చరిక’ మెసేజ్‌లు ఇకపై కొంతకాలం పాటు సెలవు తీసుకోనున్నాయి. కాబట్టి వాహనదారులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.