Begin typing your search above and press return to search.

భారత్ పై పెను ప్రభావం.. టెన్షన్ పెడుతోన్న జలసంధి.. ఏమిటిది?

పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. గురువారం రాత్రి నుంచి ఇజ్రాయెల్ – ఇరాన్ మధ్య భీకర యుద్ధం జరుగుతోంది

By:  Tupaki Desk   |   17 Jun 2025 3:00 AM IST
భారత్ పై పెను ప్రభావం.. టెన్షన్ పెడుతోన్న జలసంధి.. ఏమిటిది?
X

పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. గురువారం రాత్రి నుంచి ఇజ్రాయెల్ – ఇరాన్ మధ్య భీకర యుద్ధం జరుగుతోంది. దీంతో.. ఇప్పటికే చమురు ధరలకు రెక్కలొచ్చాయి. ఈ క్రమంలో శనివారం బ్రెంట్ ముడి చమురు ధర బ్యారెల్ కు 6 డాలర్లకు పైగా పెరిగి ఐదు నెలల గరిష్ట స్థాయి 78 డాలర్లను దాటింది.

ఇక ఈ పోరు ఇతర గల్ఫ్ దేశాలకు కూడా వ్యాపిస్తే మాత్రం.. ప్రపంచ ఇంధన రవాణాకు జీవనాడిగా చెప్పే ఓ జలసంధి మూతపడే ప్రమాదం ఉందనే ఆందోళనలు మొదలయ్యాయి. కేవలం కొన్ని కిలోమీటర్ల వెడల్పున్న ఈ ప్రదేశం నుంచి ప్రపంచం వాడే చమురులో ఐదో వంతు రవాణా అవుతుందంటే దాని ప్రాముఖ్యత అర్ధం చేసుకొవచ్చు. అదే హర్మూజ్ జలసంధి.

అరేబియా సముద్రంలో ఒమన్‌, ఇరాన్‌ మధ్య ఉన్న అత్యంత ఇరుకైన ఈ జలసంధి నుంచి నిత్యం సుమారు 2 కోట్ల పీపాల చమురు వివిధ దేశాలకు వెళ్తుతుంది. ఇందులో భాగంగా... ఈ జలసంధి ద్వారా ఇరాన్‌, సౌదీ, యూఏఈ, కువైట్‌, ఇరాక్‌ ల నుంచి ఎగుమతి అవుతోంది. లిక్విఫైడ్‌ నేచురల్‌ గ్యాస్‌ (ఎల్.ఎన్.జీ) రవాణాకు కూడా ఇది అత్యంత కీలకం.

ఇందులో భాగంగా... మూడింట ఒక వంతు ఎల్‌.ఎన్‌.జీ కూడా ఇక్కడి నుంచే వివిధ దేశాలకు చేరుతుంది. దీనిలో అత్యధికం ఖతార్‌ ఎగుమతి చేస్తుంది. ఇలా చమురు రవాణా విషయంలో అత్యంత కీలకంగా ఉన్న ఈ జలసంధిలో ఏర్పడే ఏ అంతరాయమైనా ప్రపంచ వాణిజ్యాన్ని వణికించేస్తుందని అంటారు.

ఈ విషయాన్ని గుర్తించిన అగ్రరాజ్యం అమెరికా... బహ్రెయిన్ లో తన ఫిఫ్త్ ఫ్లీట్ స్థావరాన్ని ఏర్పాటు చేసుకొంది. ఈ మార్గం నుంచి వచ్చే చమురు, ఎన్.ఎన్.జీ. అత్యధికంగా భారత్ తో పాటు చైనా, జపాన్, దక్షిణ కొరియాలకు ఎగుమతి అవుతోంది. భారత్ కు ఇరాక్, సౌదీ, యూఏఈ, కువైట్, ఖతార్ నుంచి దిగుమతి అవుతుంది.

వాస్తవానికి మనదేశం వినియోగించే ఇంధనంలో 90% వివిధ మార్కెట్ల నుంచే దిగుమతి చేసుకొంటుండగా.. భారత్ అవసరాలకు వాడే చమురులో 40% ఈ ఒక్క మార్గం నుంచే రవాణా అవుతోంది. ఈ నేపథ్యంలో.. ఆ జలసంధి మార్గం మూసుకుపోతే.. ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కోవడంతోపాటు.. రవాణా, బీమా ఖర్చులు గణనీయంగా పెరుగుతాయి.

కాగా... ఇటీవల కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్‌ సింగ్‌ పురి మాట్లాడుతూ... దేశీయ అవసరాలకు సరిపడా చమురు సరఫరా అవుతుందని, దానిపై ఆందోళన అవసరం లేదని భరోసా ఇచ్చారు. ఈ క్రమంలో.. ఇప్పటికే వివిధ దేశాలతో మనకు ఉన్న చమురు ఒప్పందాలకు తోడు.. మనకు ఉన్న నిల్వలు 74 రోజులకు సరిపోతాయని తెలిపారు!

వాస్తవానికి ఈ జలసంధిని మూసే సాహసం ఇరాన్ గతంలో ఎప్పుడూ చేయలేదు.. ఫ్యూచర్ లో కూడా చేయకపోవచ్చనే చెప్పుకోవాలి. అందుకు కారణం... ఈ దేశం ఉత్పత్తి చేసే చమురులో సుమారు 80% చైనా కొనుగోలు చేస్తుంది. ఈ నేపథ్యంలో హార్మూజ్ జలసంధిని మూస్తే.. ఇరాన్ ఆర్థిక వ్యవస్థ భారీగా దెబ్బతింటుంది.

గతంలో ఇరాన్ - ఇరాక్ యుద్ధ సమయంలో కూడా ఈ జలసంధి తెరిచే ఉందంటే.. ఇది ఎంత ముఖ్యమైందో అర్ధం చేసుకోవచ్చు. అయితే.. 1980-88 వరకు జరిగిన ఇరాన్‌ - ఇరాక్‌ యుద్ధం ప్రభావం మాత్రం ఈ జలసంధిపై పడింది. నాడు ఇరు దేశాలు పరస్పర ఎగుమతులను దెబ్బతీసేందుకు.. ట్యాంకర్లపై దాడులు చేసుకొన్నాయి. దీనిని "ట్యాంకర్‌ వార్‌" అని కూడా అంటారు.

ఈ నేపథ్యంలో ఇరాన్ – ఇజ్రాయెల్ మధ్య యుద్ధం కారణంగా ఈ జలసంధిని మూసే అవకాశాలు అతిస్వల్పం అని అంటున్నారు. ఒకవేళ యుద్ధం కారణంగా మూసినా.. ఆ యుద్ధం రెండు నెలల పాటు కొనసాగే అవకాశాలు మరింత అత్యల్పం అని చెబుతున్నారు. అలాగైతే భారత్ సేఫ్ అనే చెప్పాలి.

మన వద్ద 74 రోజులకు సరిపడా నిల్వలు ఉన్నాయి. అలా కాకుండా ఇరాన్ – ఇజ్రాయెల్ యుద్ధ వల్ల సుమారు 3 నెలలు ఈ జలసంధిని మూసివేస్తే మాత్రం.. భారత్ చాలా ఇబ్బందుల్లో పడిపోతుంది.