Begin typing your search above and press return to search.

వాటిపై సుంకం తగ్గించిన కేంద్రం.. దశాబ్ధం తర్వాత అత్యంత కీలక నిర్ణయం..

దశాబ్దానికి పైగా మార్పులేకుండా కొనసాగిన డ్యూటీ-ఫ్రీ పరిమితిపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

By:  Tupaki Political Desk   |   4 Feb 2026 4:00 PM IST
వాటిపై సుంకం తగ్గించిన కేంద్రం.. దశాబ్ధం తర్వాత అత్యంత కీలక నిర్ణయం..
X

దశాబ్దానికి పైగా మార్పులేకుండా కొనసాగిన డ్యూటీ-ఫ్రీ పరిమితిపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కస్టమ్స్ నియమాలను సవరించి, అంతర్జాతీయ ప్రయాణికులకు స్పష్టమైన ఉపశమనం కలిగించేలా కొత్త బ్యాగేజ్ రూల్స్-2026ను అమల్లోకి తెచ్చింది. పెరుగుతున్న గ్లోబల్ ధరలు, మారుతున్న వినియోగ ధోరణులను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఫిబ్రవరి 2, 2026 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి.

ఆకట్టుకుంటున్న కొత్త నిర్ణయం..

కొత్త మార్పుల ప్రకారం.., వాయు (ఎయిర్) లేదా సముద్ర (సీ) మార్గం ద్వారా భారతదేశానికి తిరిగి వచ్చే భారతీయ నివాసితులు, భారత సంతతికి చెందిన పర్యాటకులు ఇప్పుడు ₹75,000 వరకు విలువైన వస్తువులను సుంకం లేకుండా తీసుకురావచ్చు. ఇది గతంలో ఉన్న ₹50,000 పరిమితిని భర్తీ చేస్తోంది. దాదాపు పదేళ్ల తర్వాత ఈ పెంపు రావడం గమనార్హం. ప్రయాణికులు తమ వ్యక్తిగత లగేజీలో లేదా సహ బ్యాగేజీలో తీసుకొచ్చే వస్తువులకు ఈ పరిమితి వర్తిస్తుంది. విదేశీ పర్యాటకులకు కూడా సడలింపు లభించింది. వాయు లేదా సముద్ర మార్గం ద్వారా భారత్‌కు వచ్చే విదేశీయులు ఇప్పుడు ₹25,000 వరకు ఎలాంటి సుంకం లేకుండా వస్తువులు తీసుకురావచ్చు. గతంలో ఈ పరిమితి ₹15,000 మాత్రమే ఉండేది. అంతర్జాతీయ ప్రయాణాల పెరుగుదల, వినియోగ వస్తువుల ధరల పెరుగుదల నేపథ్యంలో ఈ మార్పులు అవసరమయ్యాయని ప్రభుత్వం పేర్కొంది.

స్వదేశానికి వచ్చే వారికి భారీ ఊరట..

కొత్త బ్యాగేజ్ రూల్స్‌లో మరో ముఖ్యమైన అంశం విదేశాలలో ఎక్కువకాలం నివసించి తిరిగి వచ్చే భారతీయుల కోసం ఆభరణాల భత్యాల నవీకరణ. దీర్ఘకాలిక ప్రవాసుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఆభరణాల డ్యూటీ-ఫ్రీ పరిమితిని సవరించారు. అంతే కాకుండా, డ్యూటీ ఫ్రీ కింద అర్హత పొందే వస్తువుల జాబితాను స్పష్టంగా పేర్కొన్నారు. విమానాశ్రయాలు, పోర్టుల్లో కస్టమ్స్ కౌంటర్ల వద్ద గందరగోళం తగ్గించేందుకు ఎలక్ట్రానిక్ డిక్లరేషన్ వ్యవస్థను కూడా ప్రవేశపెట్టారు. గతంలో ఉన్న పరిమితులు వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా లేవన్న విమర్శలు తరచూ వినిపిస్తూ ఉండేవి. విదేశాల్లో కొనుగోలు చేసే ఎలక్ట్రానిక్ వస్తువులు, దుస్తులు, వ్యక్తి గత వినియోగ సామగ్రి ధరలు గణనీయంగా పెరిగినా, డ్యూటీ-ఫ్రీ పరిమితి మాత్రం యథాతథంగా ఉండేది. దీంతో ప్రయాణికులు అదనపు సుంకాలు చెల్లించాల్సి వచ్చేది. ఈ నేపథ్యంలో కొత్త పరిమితులు ప్రయాణికుల ఆర్థిక భారం తగ్గించేలా ఉంటాయని అధికారులు అభిప్రాయపడుతున్నారు. తరుచూ విదేశీ ప్రయాణాలు చేసే పరిశ్రమ నిపుణులు ఈ నిర్ణయాన్ని స్వాగతించారు. డ్యూటీ ఫ్రీ పరిమితి పెంపుతో వివాదాలు తగ్గుతాయని, విమానాశ్రయాల్లో సమయం ఆదా అవుతుందని చెబుతున్నారు. ముఖ్యంగా పండుగల సీజన్‌లో విదేశాల నుంచి బహుమతులు, గాడ్జెట్లు తీసుకొచ్చే వారికి ఇది మరింత ఉపశమనం కలిగించనుంది.

మొత్తంగా చూస్తే, డ్యూటీ ఫ్రీ లిమిట్ పెంపు భారతీయ ప్రయాణికులకు గణనీయమైన ఊరట లభిస్తుంది. అంతర్జాతీయ ప్రయాణాలు పెరుగుతున్న ఈ కాలంలో.., మారుతున్న ఆర్థిక వాస్తవాలకు అనుగుణంగా తీసుకున్న ఈ నిర్ణయం ప్రయాణ సౌలభ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా, కస్టమ్స్ ప్రక్రియలను మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా మార్చే దిశగా ఒక కీలక అడుగుగా భావిస్తున్నారు.