పాక్.. లంక.. నేపాల్.. చైనాను నమ్మితే పరారే పరారే..
2022లో శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్సేపై తీవ్రస్థాయిలో ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి.
By: Tupaki Desk | 10 Sept 2025 9:27 AM ISTనాలుగేళ్లలో భారత్ ఇరుగుపొరుగున ఉన్న నాలుగు దేశాల్లో రాజకీయ అనిశ్చితి...! వీటిలో మూడు దేశాల్లో ప్రధానులు దిగిపోగా.. మరో దేశంలో అధ్యక్షుడు పరారయ్యారు. మరీ ముఖ్యంగా వీరిలో మూడు దేశాల వారు చైనాతో చెట్టాపట్టాల్ వేసుకుని తిరిగారు. తర్వాత పదవులు కోల్పోయారు. మరో దేశాధినేత కూడా కాస్త చైనాతో సన్నిహితంగా మెలిగినా భారత్ వైపే ఎక్కువ మొగ్గుచూపారు.
పరారే పరారే...
2022లో శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్సేపై తీవ్రస్థాయిలో ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. ధరలు విపరీతంగా పెరగడం, గొటబాయ సోదరుల అవినీతితో ప్రజలు విసుగెత్తారు. ఏకంగా అధ్యక్ష భవనంలోకి చొరబడి చేతికందిన వస్తువులను ఎత్తుకెళ్లారు. కొందరైతే భవనంలో విచ్చలవిడిగా ప్రవర్తించారు. గొటబాయలపై ప్రధాన ఆరోపణల్లో ఒకటి.. వారు చైనాకు తొత్తులుగా వ్యవహరించడం. భారత్‌కు వ్యతిరేకంగానా అన్నట్లు వీరు చైనా పెట్టుబడులను ప్రోత్సహించారు. ఓ పోర్టులో చైనా, గొటబాయ సోదరులు పెట్టుబడులు పెట్టడం గమనార్హం.
హసీనాపై కుట్రలు
నిరుడు ఆగస్టులో బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా ప్రభుత్వంపై ఆందోళనలు మిన్నంటాయి. ఆమె ప్రభుత్వంలో అవినీతిపై అప్పటికే ఆగ్రహం ఉన్నా.. స్వాతంత్ర్య సమరయోధుల వారసులకు రిజర్వేషన్ల పొడిగింపును ఆసరాగా చేసుకుని ఆందోళనకారులు రెచ్చిపోయారు. రెండు మూడు నెలలైనా ఆగ్రహ జ్వాల ఎంతకూ చల్లారలేదు. దీంతో హసీనా దిగిపోక తప్పలేదు. ఆమె చివరకు భారత్‌కు వచ్చేశారు. హసీనా భారత్‌కు మద్దతుదారు. చైనాతో ఎప్పుడూ ఆమె సన్నిహితంగా ఉన్నట్లు కనిపించలేదు. కానీ, అమెరికా డిమాండ్లను నెరవేర్చకపోవడం హసీనాపై కుట్రకు దారితీసిందని చెబుతున్నారు.
రష్యా వెళ్లి.. చైనా మద్దతుతో...
-ఉక్రెయిన్-రష్యా యుద్ధం మొదలైన సమయంలో రష్యాలో పర్యటించారు పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్. ఈయన చైనాతో భుజంభుజం రాసుకుని తిరిగారు. ఆ తర్వాత పదవిని కోల్పోయారు. చైనా... ఎప్పటినుంచో పాక్‌లో పెట్టుబడులు పెడుతున్న సంగతి తెలిసిందే. అంతేగాక చైనా చెప్పినట్లు పాక్ ఆడుతోంది. ఆపరేషన్ సిందూర్ సమయంలోనూ ఆ దేశం సాయం పొందింది. ఇమ్రాన్.. పరారు కాకున్నా, జైల్లో ఉన్నారు.
ఇప్పుడు నేపాల్ వంతు
భారత్-చైనాకు మధ్యలో ఉండే నేపాల్ ఇప్పుడు అట్టుడుకుతోంది. ప్రధాని పదవికి రాజీనామా చేసిన కేపీ శర్మ వోలీ.. చైనాకు సన్నిహితుడు. భారత్‌కు వ్యతిరేకి. నేపాల్‌లో అమెరికా సంస్థలు చేపట్టిన ప్రాజెక్టులకు ఓలీ ప్రభుత్వం అడ్డంకులు కల్పిస్తోందని, దీంతో ఆయనకు వ్యతిరేకంగా ఉద్యమం ఉధృతమైంది. ఓలీ.. ఓ దశలో దుబాయ్‌కు పారిపోయినట్లు ఊహాగానాలు వినిపించాయి. కానీ, ఆయన నేపాల్‌లోనే ఉన్నట్లు తెలుస్తోంది.
-ఈ కథనంతో సంబంధం లేకున్నా.. 2021లో తాలిబన్లు రాజధాని కాబూల్‌లోకి రావడంతో అఫ్ఘానిస్థాన్ అప్పటి అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ దేశం విడిచివెళ్లిపోయారు.
-తిరుగుబాటుదారులు పైచేయి సాధించడంతో గత ఏడాది చివర్లో సిరియా అధ్యక్షుడు అసద్ కూడా దేశం విడిచి వెళ్లిపోయారు.
