Begin typing your search above and press return to search.

మావోయిస్టు మూలాలపైనే దెబ్బ.. 126 నుంచి 6 జిల్లాలకు పడిపోయిన ఎర్రదండు

దేశంలో ఆపరేషన్ కగార్ ప్రారంభమైన తర్వాత మావోయిస్టు ఉద్యమం పూర్తిస్థాయిలో దెబ్బతిన్నది.

By:  Tupaki Desk   |   19 May 2025 2:00 AM IST
మావోయిస్టు మూలాలపైనే దెబ్బ.. 126 నుంచి 6 జిల్లాలకు పడిపోయిన ఎర్రదండు
X

దేశంలో ఆపరేషన్ కగార్ ప్రారంభమైన తర్వాత మావోయిస్టు ఉద్యమం పూర్తిస్థాయిలో దెబ్బతిన్నది. వచ్చే ఏడాది మార్చి 31 నాటికి నక్సల్స్ రహిత భారత్ ను ఆవిష్కరిస్తామని కేంద్రం ప్రభుత్వం ప్రకటిస్తోంది. ఆ లక్ష్యం చేరుకునేందుకు వడివడిగా అడుగులు వేస్తోంది. దీంతో ఆరు దశాబ్దాల మావోయిస్టు ఉద్యమం అవసాన దశకు చేరుకున్నట్లేనని అంటున్నారు. గత పదేళ్లలో దేశంలో నక్సలిజం చాలా వరకు తగ్గిపోయిందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం దీనికి ఉతమిస్తోందని అంటున్నారు.

కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వివిధ కార్యక్రమాలతో నక్సల్స్ హింస 81% తగ్గిపోయిందని తాజాగా కేంద్రం ప్రకటించింది. తమ ప్రభుత్వం తీసుకున్న చర్యలతో దేశంలో నక్సల్స్ ప్రభావం 126 జిల్లాల నుంచి ఆరు జిల్లాలకు తగ్గిందని ఓ నివేదకలో కేంద్రం వెల్లడించింది. ఒకప్పుడు మావోయిస్టులకు కంచుకోటలుగా ఉన్న ప్రాంతాల్లో కేంద్ర బలగాలు క్యాంపులు ఏర్పాటు చేయడంతో మావోయిస్టులు తమ స్థావరాలను ఖాళీ చేయాల్సివచ్చిందని అంటున్నారు.

పైగా నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో చిన్నారులకు విద్య, యువతకు వృత్తి నైపుణ్యంలో శిక్షణ, రోడ్ల నిర్మాణం, 4జీ నెట్ వర్కుతో సెల్ ఫోన్ సౌకర్యం, పోలీసుస్టేషన్ల ఏర్పాటుతో మావోయిస్టుల ఉద్యమం బాగా తెబ్బతిన్నదని చెబుతున్నారు. మావోయిస్టుల రిక్రూట్మెంట్లు, కమ్యూనికేషన్, రవాణా వనరులపై దెబ్బకొట్టింది కేంద్ర ప్రభుత్వం. 2014లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నక్సల్స్ ఏరివేతను వేగవంతం చేసిందని ప్రకటించింది. దీనిలో భాగంగా 2014లో 126 జిల్లాల్లో మావోయిస్టులు ప్రభావం చూపగా, 2018 వచ్చేసరికి 90 జిల్లాలకు పడిపోయారని, 2021లో 70 జిల్లాలకు 2024లో 38 జిల్లాలకు ప్రస్తుతం ఆరు జిల్లాలకు మాత్రమే పరిమితమయ్యారని కేంద్రం ఓ నివేదికలో పేర్కొంది.

అదేసమయంలో గత పదేళ్లలో 8 వేల మంది మావోయిస్టులు హింసామార్గాన్ని వీడారని, 81 శాతం హింస తగ్గిందని, 85 శాతం మేర హింసాత్మక ఘటనలు తగ్గాయని కేంద్రం వెల్లడించింది. ఏజెన్సీ ప్రాంతంలో 14 వేల కోట్ల రోడ్డు మార్గం నిర్మాణం, 10 వేల సెల్ టవర్ల ఏర్పాటుతో మావోయిస్టులకు ఆదరణ తగ్గిందని ఆ నివేదకలో కేంద్రం వివరించింది. బ్యాంకు సేవలు, ఏటీఎంలు, పోస్టాఫీసులు, ఏకలవ్య పాఠశాలలు, ఐటీఐలు ఇలా అనేక కార్యక్రమాలతో నక్సల్స్ ను పూర్తిగా అదుపులో పెట్టినట్లు కేంద్రం ప్రకటించింది.