ఇది కేవలం శాంపిల్ మాత్రమే.. భారత క్షిపణి పరీక్షతో పాక్‌కు హెచ్చరిక జారీ!
పహల్గామ్ ఉగ్రదాడికి బాధ్యులైన పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులపై భారత్ కఠిన చర్యలకు ఉపక్రమించింది.
By: Tupaki Desk | 24 April 2025 4:23 PM ISTజమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్ ఉగ్రదాడి దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. దీంతో దేశమంతా పాక్ మీద కోపంతో ఊగిపోతుంది. ఈ నేపథ్యంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య, భారత్ తన సత్తాను మరోసారి చాటింది. అరేబియా సముద్రంలో భారత నౌకాదళం చేపట్టిన క్షిపణి పరీక్ష సక్సెస్ అయింది. శత్రువుల గుండెల్లో గుబులు పుట్టించే విధంగా, స్వదేశీ టెక్నాలజీతో తయారైన మిస్సైల్ విధ్వంసక క్షిపణిని ఐఎన్ఎస్ సూరత్ యుద్ధ నౌక నుంచి విజయవంతంగా పరీక్షించింది. సరిహద్దుల్లో కయ్యానికి కాలుదువ్వుతున్న వారికి ఇది గట్టి హెచ్చరికగా నిలుస్తోంది.
పహల్గామ్ ఉగ్రదాడికి బాధ్యులైన పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులపై భారత్ కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఈ దాడి తర్వాత దేశంలో భద్రతాపరమైన ఆందోళనలు నెలకొన్నాయి. భారత్ తీసుకుంటున్న చర్యలతో పాకిస్తాన్‌లో సైతం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ సమయంలోనే పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు దిగింది. ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే క్షిపణులను పరీక్షించనున్నట్లు ప్రకటించింది. కరాచీ తీర ప్రాంతంలో రెండు రోజుల పాటు ఈ పరీక్షలు కొనసాగుతాయని తెలిపింది. తీరం పంచుకుంటున్నందున ఈ సమాచారాన్ని భారత్‌కు కూడా తెలియజేసింది.
పాకిస్తాన్ చర్యలకు దీటుగా, భారత్ తన రక్షణ సామర్థ్యాన్ని మరోసారి నిరూపించింది. అరేబియా సముద్రంలో ఐఎన్ఎస్ సూరత్ యుద్ధ నౌక నుంచి క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. ఇది ఒక మిస్సైల్ విధ్వంసక క్షిపణి కావడం విశేషం. ఈ క్షిపణి సముద్రంపై తక్కువ ఎత్తులో ప్రయాణించే లక్ష్యాలను సైతం ఛేదించగలదు. ఈ విజయం భారత నౌకాదళ రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేసింది.
పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో యుద్ధ నౌకలను రూపొందించడం, నిర్మించడం, అభివృద్ధి చేయడంలో భారత నౌకాదళానికి ఎవరూ సాటిలేరని ఈ ప్రయోగం మరోసారి రుజువు చేసింది. సరిహద్దులను కాపాడుకోవడంలో భారతదేశం అచంచలమైన నిబద్ధతకు, ఆత్మనిర్భర్ భారత్‌కు ఇది ఒక గొప్ప ఉదాహరణ అని నౌకాదళం పేర్కొంది.
