Begin typing your search above and press return to search.

కార్వార్‌లో భారత నౌకాదళం గర్జన.. గాలి, నేల, నీరు పాక్ ను చుట్టుముట్టిన భారత్

భారత నౌకాదళం మే 7, 2025న కర్ణాటకలోని కార్వార్ తీరం నుంచి అరేబియా సముద్రంలో భారీ క్షిపణి ప్రయోగాన్ని నిర్వహించనుంది.

By:  Tupaki Desk   |   3 May 2025 6:00 PM IST
కార్వార్‌లో భారత నౌకాదళం గర్జన..  గాలి, నేల, నీరు పాక్ ను చుట్టుముట్టిన భారత్
X

భారత్ పాక్ కు తన శక్తిని అన్ని విధాలుగా చాటి చెప్పందుకు రెడీ అయింది.ఇప్పటికే భూమిపై, ఉపరితలంలో తన సత్తా ఏంటో రుచి చూపించిన భారత్, ఇప్పుడు సముద్రంలోనూ పాక్‌కు తన బలమెంతో చూపించబోతోంది. భారత నౌకాదళం మే 7, 2025న కర్ణాటకలోని కార్వార్ తీరం నుంచి అరేబియా సముద్రంలో భారీ క్షిపణి ప్రయోగాన్ని నిర్వహించనుంది. ఈ విన్యాసం ఉదయం 8:30 నుంచి సాయంత్రం 6:30 వరకు కార్వార్ నుంచి దాదాపు 390 కిలోమీటర్ల దూరంలో సముద్రంలో జరగనుంది. దీని కోసం నౌకాదళం 'నోటీస్ టు ఎయిర్‌మెన్' (NOTAM) కూడా జారీ చేసింది.

ఇటీవల జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన దారుణమైన ఉగ్రదాడి తర్వాత భారతదేశం తన భద్రతా వ్యవస్థను మరింత కట్టుదిట్టం చేసింది. ఈ క్షిపణి ప్రయోగం కేవలం సాధారణ శిక్షణలో భాగం మాత్రమే కాదు.. పాకిస్తాన్‌కు ఒక క్లియర్ కట్ హెచ్చరిక కూడా. భారత్ ఇప్పుడు అన్ని రంగాల్లోనూ రెడీగా ఉందని.. అది భూమి కావచ్చు లేదా సముద్రం కావచ్చు, ఎక్కడైనా తమను ఎదుర్కోవడానికి తాము సై అంటున్నామని ఈ విన్యాసం ద్వారా భారత్ చాటి చెబుతోంది.

కార్వార్ నౌకా స్థావరం అంటే ఏమిటి?

కార్వార్ నౌకా స్థావరం భారత నౌకాదళానికి ఒక ముఖ్యమైన వ్యూహాత్మక కేంద్రం. ఇక్కడ జరగబోయే ఈ క్షిపణి ప్రయోగం, భారత్ కేవలం నియంత్రణ రేఖ (LOC) వద్ద మాత్రమే కాకుండా, సముద్ర సరిహద్దుల్లో కూడా ఎంత అప్రమత్తంగా, దూకుడుగా ఉందో తెలియజేస్తుంది.

భారత్-పాక్ ఉద్రిక్తతల మధ్య సైనిక సంకేతం

పాకిస్తాన్ సరిహద్దు దాటి ఉగ్రవాదాన్ని నిరంతరం ప్రోత్సహిస్తూనే ఉంది. పహల్గాం దాడిలో ఉగ్రవాదుల హస్తం ఉందని స్పష్టంగా తెలియడంతో భారత్ ఇప్పుడు ప్రతిస్పందన వ్యూహాలపై దృష్టి పెట్టింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ క్షిపణి ప్రయోగం కేవలం ఒక శిక్షణ మాత్రమే కాదు. పాకిస్తాన్, దాని మద్దతు ఉన్న ఉగ్రవాద సంస్థలకు ఇది ఒక స్పష్టమైన సందేశం. భారత త్రివిధ దళాలు పూర్తిగా సిద్ధంగా ఉన్నాయని చెప్పే ఒక విధానం ఇది. ఈ విన్యాసం భారత నౌకాదళం శక్తిని, సముద్ర భద్రతను మరింత బలోపేతం చేయడానికి ఒక ముఖ్యమైన చర్య.పహల్గాంలో అమాయక ప్రజల రక్తం చిందించిన వారికి కార్వార్ నుంచి స్పష్టమైన హెచ్చరిక వెళ్తోంది. భారత్ ఇకపై మౌనంగా ఉండబోదు. గాలి, నేల, సముద్రం నుండి కూడా తగిన సమాధానం వస్తుంది.

పహల్గామ్‌లో భయంకరమైన దాడి

జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాంలో ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రదాడి అత్యంత దారుణమైంది. పుల్వామా దాడి తర్వాత జరిగిన అతి పెద్ద దాడిగా దీనిని భావిస్తున్నారు. ఉగ్రవాదులు పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపారు. 26 మందిపై కాల్పులు జరిపి, పర్యాటకులను అత్యంత క్రూరంగా చంపేశారు. ఈ దాడి తర్వాత పాకిస్తాన్‌పై దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తం అయంది. భారతదేశం పాకిస్తాన్ ఈ దుష్ట కుట్రకు వ్యతిరేకంగా కఠిన చర్యలు తీసుకుంది.

దీనిలో భాగంగా ఒకవైపు సైన్యం అప్రమత్తంగా ఉండి సెర్చ్ ఆపరేషన్లు కొనసాగిస్తుంది. మరోవైపు ఈ దాడిపై దర్యాప్తు జరుగుతోంది. అంతేకాకుండా, భారత్ పాకిస్తాన్‌తో చేసుకున్న సింధు జలాల ఒప్పందాన్ని కూడా నిలిపివేసింది. దీని తర్వాత పాకిస్తాన్‌కు నీటి విషయంలో కూడా కష్టాలు మొదలయ్యాయి. మరోవైపు, భారత్ పాకిస్తానీయుల వీసాలను రద్దు చేయడంతో పాటు అనేక పాకిస్తానీ యూట్యూబ్ ఛానెల్‌లను కూడా నిషేధించింది.