భారత్ ను ఎవరూ శాసించలేరు...మంత్రి జైశంకర్
భారత్ ఎవరితో మాట్లాడాలి...ఎవరితో బంధాలు పెంచుకోవాలి...ఇవన్నీ ఎవరూ చెప్పక్కర్లేదు. భారత్ కు ఓ విధానం ఉంది.
By: Tupaki Desk | 6 Dec 2025 5:15 PM ISTభారత్ ఎవరితో మాట్లాడాలి...ఎవరితో బంధాలు పెంచుకోవాలి...ఇవన్నీ ఎవరూ చెప్పక్కర్లేదు. భారత్ కు ఓ విధానం ఉంది. ఓ అవగాహన ఉంది. దాని ప్రకారమే ముందుకు వెళుతుంది. ఇందుకు ఏ దేశమో నిర్దేశించాల్సిన అవసరం లేదని భారత విదేశాంగ మంత్రి జైశంకర్ స్పష్టం చేశారు. ప్రపంచంలో ఏదేశంతో అయినా సంబంధాలు పెంచుకునేంత స్వేచ్చ హక్కు భారత్ కు ఉంది. ప్రపంచంలో గడ్డుపరిస్థితులు నెలకొంటున్నా...ఒడుదొడుకులున్నా...భారత్ రష్యా సంబంధం స్థిరంగా సాగుతోందని ఆయన వివరించారు.
భారత్ రష్యాతో సన్నిహితంగా ఉంటోంది...ఇరువురి నడుమ లావాదేవీలు కొనసాగుతున్నాయన్న విషయంగా అమెరికా చాలా అసంతృప్తిగా ఉంటోంది. రష్యా ఉక్రెయిన్ యుద్దాన్ని భూతంగా చూపి భారత్ ను అనవసరంగా ప్రపంచం ముందు దోషిగా నిలబెట్టడానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విఫలయత్నం చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. భారత్ రష్యాతో చమురు కొనుగోలు చేస్తోందని రాద్ధాంతం చేసిన ట్రంప్ అదే రష్యాతో అణు ఇంధనం కొంటున్న విషయంగా నోరు మెదపరు. ఇదే విషయాన్ని భారత్ లో పర్యటించిన సందర్భంగా రష్యాఅధ్యక్షుడు పుతిన్ ప్రస్తావించారు. అమెరికా ప్రతీకార సుంకాలు విధించినా..భారత్ తన పంథాను వీడనని తన చేతల ద్వారే చెబుతోంది.
ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ ఓ విలేఖరి మాట్లాడుతూ... రష్యాతో సంబంధం వల్ల అమెరికాతో భారత్ వాణిజ్య సంబంధాలు సంక్లిష్టంగా మారుతాయా అంటే దానికి విదేశాంగ మంత్రి జైశంకర్ చాలా ఘాటుగా స్పందించారు. ప్రపంచంలో ఒక దేశం ఎన్ని దేశాలతో అయినా సంబంధాలు పెంచుకునే స్వేచ్ఛ ఉంది దాన్ని అడ్డుకునే హక్కు ఎవరికీ లేదని అన్నారు. దౌత్యం అంటే కేవలం ఎవరినో సంతోషపెట్టడం కాదు. మా దేశ ప్రయోజనాలే మాకు ముఖ్యం అందుకోసం ఏ దేశంతో అయినా జట్టుకట్టడానికి సిద్ధమని మంత్రి జైశంకర్ అన్నారు.
అమెరికాతో కూడా తమకు ఎలాంటి భిన్నాభిప్రాయాలు లేవని త్వరలో ఆ దేశంతో వాణిజ్య చర్చలుంటాయని మంత్రి తెలిపారు. ఏదేశంతో సంబంధాలు పెంచుకున్నా...అంతిమంగా భారత్ కు రైతులు, మధ్యతరగతి ప్రజలు, కార్మికుల ప్రయోజనాలే ప్రధానమని విదేశాంగ మంత్రి జైశంకర్ తెలపడం హర్షణీయం.
