Begin typing your search above and press return to search.

MQ-9 రీపర్: భారత్ కొనుగోలు చేస్తున్న ఈ డ్రోన్ ఎంత శక్తివంతమైనదో తెలుసా?

అమెరికా రూపొందించిన MQ-9 రీపర్ ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన, అత్యాధునికమైన డ్రోన్‌గా గుర్తింపు పొందింది.

By:  Tupaki Desk   |   19 May 2025 10:00 PM IST
MQ-9 రీపర్: భారత్ కొనుగోలు చేస్తున్న ఈ డ్రోన్ ఎంత శక్తివంతమైనదో తెలుసా?
X

భారతదేశం, పాకిస్తాన్ మధ్య సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో శత్రుదేశాలు డ్రోన్ల ద్వారా దాడులకు తెగబడుతున్నాయి. అయితే, భారత సైన్యం అప్రమత్తంగా ఉంటూ వాటిని సమర్థవంతంగా తిప్పికొడుతోంది. ఈ సమయంలో ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన, ప్రమాదకరమైన డ్రోన్ ఏదో మీకు తెలుసా? భవిష్యత్తులో అలాంటి తిరుగులేని ఆయుధం మన దేశానికి అందుబాటులోకి రాబోతుందా.. అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన డ్రోన్‌గా పేరుగాంచిన MQ-9 రీపర్‌ను భారత్ కొనుగోలు చేయబోతోంది. ఈ డ్రోన్ ఎలాంటి విధ్వంసం సృష్టించగలదో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే.

ప్రపంచాన్ని వణికిస్తున్న డ్రోన్ MQ-9 రీపర్

అమెరికా రూపొందించిన MQ-9 రీపర్ ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన, అత్యాధునికమైన డ్రోన్‌గా గుర్తింపు పొందింది. శత్రువుల కదలికలను పసిగట్టడానికి, గూఢచర్యం చేయడానికి, అవసరమైతే క్షణాల్లో వారి స్థావరాలను నాశనం చేయడానికి దీన్ని ఉపయోగిస్తారు. ఈ డ్రోన్ ఆకాశంలో ఎక్కువసేపు నిలవగలదు. చాలా ఎత్తులో ఎగరగలదు. అంతేకాదు, శత్రువులకు ఏమాత్రం అనుమానం రాకుండా అత్యంత కచ్చితత్వంతో లక్ష్యాన్ని ఛేదించగల సామర్థ్యం దీని సొంతం. అమెరికాకు చెందిన జనరల్ అటామిక్స్ ఏరోనాటికల్ సిస్టమ్స్ ఈ డ్రోన్‌ను అభివృద్ధి చేసింది.

ఈ డ్రోన్ దాదాపు 1900 కిలోమీటర్ల దూరం వరకు ఎగరగలదు. 50,000 అడుగుల ఎత్తును చేరుకోగలదు. గంటకు దాదాపు 482 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోగలదు. ఒకేసారి 1800 కిలోల ఇంధనంతో పాటు 1700 కిలోల ఆయుధాలను మోసుకెళ్లగలదు. MQ-9 రీపర్‌ను భూమిపై ఉన్న ఇద్దరు నిపుణులు కంప్యూటర్ల ద్వారా నియంత్రిస్తారు. ఇది చూడటానికి వీడియో గేమ్ ఆడినట్లుగా ఉంటుంది. ఈ డ్రోన్ 36.1 అడుగుల పొడవు, 65.7 అడుగుల రెక్కల వెడల్పు, 12.6 అడుగుల ఎత్తును కలిగి ఉంటుంది. దీని బరువు దాదాపు 2223 కిలోగ్రాములు.

ఈ డ్రోన్‌కు ఏకంగా 7 హార్డ్‌పాయింట్లు ఉన్నాయి. అంటే దీనికి అనేక రకాల ఆయుధాలను అమర్చవచ్చు. ముఖ్యంగా 4 AGM-114 హెల్‌ఫైర్ క్షిపణులను దీనికి అమర్చవచ్చు. ఈ క్షిపణులు గాలి నుంచి భూమికి అత్యంత కచ్చితత్వంతో దాడి చేయగలవు. అంతేకాకుండా, రెండు GBU-12 పావ్‌వే II లేజర్ గైడెడ్ బాంబులను కూడా ఇది మోసుకెళ్లగలదు. ఈ ఆయుధాలే దీన్ని ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన డ్రోన్‌గా మార్చాయి.

భారతదేశం ఈ డ్రోన్‌ను సొంతం చేసుకోబోతోంది. అమెరికాతో ఇప్పటికే దీనికి సంబంధించిన ఒప్పందం కుదిరింది. దీని విలువ దాదాపు రూ. 34,500 కోట్లు. ఈ డ్రోన్ల నిర్వహణ, మరమ్మత్తు కోసం మన దేశంలో ప్రత్యేకంగా ఒక కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. అంటే అతి త్వరలోనే మన గగనతలం ఈ శక్తివంతమైన డ్రోన్ల ద్వారా మరింత సురక్షితం కానుంది.