ఈ రోజు మీ ఫోన్ ఉన్నట్లుండి అరుస్తుంది.. కంగారు పడకు బాస్
ఈ రోజు మీ ఫోన్ నుంచి ఉన్నట్లుండి సైరన్ లాంటి పెద్ద శబ్ధం రావొచ్చు. ఎప్పుడూ లేని రీతిలో ఈ అసాధారణ శబ్ధమేంటన్న టెన్షన్ పడాల్సిన అవసరం లేదు.
By: Tupaki Desk | 2 May 2026 10:15 AM ISTఈ రోజు మీ ఫోన్ నుంచి ఉన్నట్లుండి సైరన్ లాంటి పెద్ద శబ్ధం రావొచ్చు. ఎప్పుడూ లేని రీతిలో ఈ అసాధారణ శబ్ధమేంటన్న టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీ ఫోన్ కు ఏమైనా అయ్యిందా? అన్న ఆందోళన కూడా అక్కర్లేదు. ఎందుకంటే.. ఈ రోజు (మే 2, శనివారం) దేశవ్యాప్తంగా ఉన్న ప్రజల ఫోన్లను అలెర్టు చేసేలా సౌండ్ రానుంది. రానున్న రోజుల్లో అత్యవసర పరిస్థితులు ఏమైనా ఏర్పడినా..విపత్తుల వేళ.. అందరిని మూకుమ్ముడిగా అప్రమత్తం చేసేందుకు వీలుగా.. ఈ ఏర్పాటు చేస్తున్నారు.
తాజాగా సెల్ బ్రాడ్ కాస్ట్ ఆలర్టు వ్యవస్థను సిద్ధం చేశారు. దీన్ని ఈ రోజు ప్రయోగాత్మకంగా పరీక్షించనున్నారు. ఈ కారణంగా ఒక్కసారిగా మీ ఫోన్ పెద్ద శబ్ధం చేయనుంది. దీన్ని దేశ రాజధాని నగరంతో పాటు దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ.. కేంద్రపాలిత ప్రాంతాల్లోనే పరీక్షించనున్నారు. అయితే.. సరిహద్దు ప్రాంతాలతో పాటు.. ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్ని దీని నుంచి మినహాయించారు.
కేంద్రం సిద్ధం చేసిన వ్యవస్థ ఎలా పని చేస్తుందన్న విషయాన్ని పరీక్షించేందుకు వీలుగా ప్రజల మొబైల్ ఫోన్లలో అత్యవసర అలర్ట్ నోటిఫికేషన్ వస్తుంది. ఉన్నట్లుండి పెద్ద శబ్ధం కానీ వైబ్రేషన్ కానీ రావొచ్చని చెబుతున్నారు. అలెర్టు వ్యవస్థ సమర్థతను తనిఖీ చేయటంలో భాగంగానే దీన్ని చేపట్టారు. ఈ నేపథ్యంలో ఫోన్ కు ఏమైందన్న ఆందోళన అవసరం లేదని చెబుతున్నారు. అత్యవసర సమయాల్లో కీలక సమాచారాన్ని వేగంగా ప్రజలకు చేరవేయటంతో పాటు.. వారిని అలెర్టు చేయటం ఈ పరీక్షల ప్రధాన ఉద్దేశంగా చెబుతున్నారు. సో.. మీ ఫోన్ ఈ రోజులో ఎప్పుడైనా గట్టిగా శబ్దం చేస్తుంది.. బీ రెఢీ.
