ఈ ట్రేడ్ డీల్స్ ఇండియాకు లాభమా? నష్టమా?
ప్రపంచ వాణిజ్య రంగంలో భారత్ కొత్త అధ్యాయం మొదలుపెట్టింది.
By: A.N.Kumar | 12 Feb 2026 7:00 PM ISTప్రపంచ వాణిజ్య రంగంలో భారత్ కొత్త అధ్యాయం మొదలుపెట్టింది. యూకే, యూరోపియన్ యూనియన్, అమెరికా వంటి ఆర్థిక శక్తులతో కుదురుతున్న మెగా ట్రేడ్ డీల్స్ దేశ ఆర్థిక దిశను మార్చే స్థాయిలో ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. టారిఫ్‌ల తగ్గింపుతో వినియోగదారులకు తక్కువ ధరలు లభించే అవకాశం ఉండగా మరోవైపు దేశీయ పరిశ్రమల భవిష్యత్తుపై ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. ఈ ఒప్పందాలు భారత్‌కు బంగారు అవకాశమా? లేక ‘మేక్ ఇన్ ఇండియా’కు కొత్త సవాలా? అన్న దానిపై స్పెషల్ స్టోరీ...
ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థ ఒక కీలక మలుపులో ఉంది. ఒకవైపు స్వయం సమృద్ధి ఆత్మనిర్భర్ భారత్ నినాదం.. మరోవైపు ప్రపంచ దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు . బ్రిటన్ , యూరోపియన్ యూనియన్ (ఈయూ), అమెరికా వంటి అగ్రరాజ్యాలతో భారత్ జరుపుతున్న చర్చలు కేవలం వ్యాపారానికే పరిమితం కావు.. ఇవి రాబోయే దశాబ్ద కాలపు భారత ఆర్థిక ముఖచిత్రాన్ని నిర్ణయించబోతున్నాయి.
వినియోగదారుడి జేబుకు ఊరట: ధరల తగ్గుదల ఖాయమా?
ఈ ఒప్పందాలు అమల్లోకి వస్తే సామాన్యుడికి లభించే తక్షణ లాభం 'ధరల తగ్గుదల'. విదేశీ టెక్నాలజీపై టారిఫ్‌లు తగ్గితే మొబైల్స్, ల్యాప్‌టాప్‌లు.. హై-ఎండ్ టీవీల ధరలు తగ్గే అవకాశం ఉంది. విదేశీ కార్లు, బ్రాండెడ్ దుస్తులు, పర్ఫ్యూమ్స్ , చాక్లెట్లపై ప్రస్తుతం ఉన్న భారీ దిగుమతి సుంకాలు తగ్గితే అవి మధ్యతరగతికి కూడా అందుబాటులోకి వస్తాయి.
'మేక్ ఇన్ ఇండియా' వర్సెస్ దిగుమతులు... అసలు సవాల్ ఇక్కడే!
ఈ ట్రేడ్ డీల్స్ వల్ల "మేక్ ఇన్ ఇండియా" నినాదం బలహీనపడుతుందా అనే అనుమానం చాలామందిలో ఉంది. కానీ నిపుణుల మాట ప్రకారం.. విదేశీ కంపెనీలు కేవలం వస్తువులను ఇక్కడ అమ్మడమే కాకుండా భారత్‌ను ఒక 'ప్రత్యామ్నాయ తయారీ కేంద్రం'గా చూస్తున్నాయి. ట్రేడ్ డీల్స్ వల్ల భారత్‌లో తయారైన వస్తువులకు విదేశాల్లో సుంకాలు ఉండవు. దీనివల్ల ఇక్కడ ఫ్యాక్టరీలు పెట్టి ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి చేయడం కంపెనీలకు లాభదాయకం అవుతుంది. విదేశాల నుంచి వచ్చే నాణ్యమైన ముడి సరుకు తక్కువ ధరకే దొరికితే, భారతీయ తయారీదారులు అంతర్జాతీయ నాణ్యతతో వస్తువులను తయారు చేయగలరు.
ఎగుమతుల సునామీ.. ఏ రంగాలకు మేలు?
భారతదేశానికి బలమైన ఎగుమతి రంగాలు ఉన్నాయి. ట్రేడ్ డీల్స్ వీటికి రెక్కలు తొడుగుతాయి.. టెక్స్టైల్స్ & గార్మెంట్స్ రంగంలో బంగ్లాదేశ్, వియత్నాం వంటి దేశాల నుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకుని, యూరప్ మార్కెట్‌ను భారత్ కైవసం చేసుకోవచ్చు. ఫార్మా రంగంలోభారతీయ మందులకు విదేశాల్లో ఆమోదం సులభతరం అవుతుంది. సేవా రంగంలో భారతీయ నిపుణుల వీసా ప్రక్రియలు సులభతరం అయితే ఐటీ ఎగుమతులు భారీగా పెరుగుతాయి.
ట్రేడ్ డీల్స్ వల్ల నష్టాలు.. సవాళ్లు..
ప్రతి నాణేనికి రెండు పార్శ్వాలు ఉన్నట్లుగానే ఈ ఒప్పందాల్లో కొన్ని ప్రమాదాలు కూడా పొంచి ఉన్నాయి.. చిన్న తరహా పరిశ్రమలు విదేశీ దిగ్గజ కంపెనీల పోటీని తట్టుకోలేకపోవచ్చు. ప్రభుత్వం వీరికి ప్రత్యేక రాయితీలు ఇవ్వకపోతే కుదేలయ్యే ప్రమాదం ఉంది. అమెరికా, యూరప్ దేశాలు తమ రైతులకు భారీగా సబ్సిడీలు ఇస్తాయి. అక్కడి నుంచి పాల ఉత్పత్తులు, గోధుమలు తక్కువ ధరకే భారత్‌కు వస్తే మన రైతుల పరిస్థితి ఏంటన్నది పెద్ద ప్రశ్న. అందుకే భారత్ 'డైరీ , అగ్రికల్చర్' రంగాల్లో ఆచితూచి అడుగులు వేస్తోంది.
భారత్ గ్లోబల్ ప్లేయర్‌గా మారుతుందా?
ఈ ట్రేడ్ డీల్స్ భారత్‌కు ఒక రెండు వైపులా పదునున్న కత్తి వంటివి. మన దేశీయ మార్కెట్‌ను కాపాడుకుంటూనే ప్రపంచ మార్కెట్‌ను చేజిక్కించుకోవడమే అసలైన వ్యూహం. ట్రేడ్ డీల్స్ వల్ల వచ్చే పోటీ దేశీయ పరిశ్రమలను మరింత సమర్థవంతంగా తయారు చేస్తుంది. "మేక్ ఇన్ ఇండియా" అనేది కేవలం దేశం కోసం మాత్రమే కాదు.. ప్రపంచం కోసం తయారు చేసే స్థాయికి చేరాలంటే ఈ ఒప్పందాలు అనివార్యం.
