ట్రంప్ నెక్స్ట్ టార్గెట్ ఫిక్స్... హైదరాబాద్ కు బ్యాడ్ న్యూస్!
ఈ సమయంలో చాలా మంది రెగ్యులర్ వాడే డయబటీస్, పెయిన్ కిల్లర్, యాంటీ బయాటిక్స్ మందుల ధరలు పెరగడం పేదలపై పెను ప్రభావం చూపుతుందని అంటున్నారు.
By: Tupaki Desk | 15 April 2025 11:32 AM ISTపెరిగేవాడు పెరుగుతూనే ఉంటే.. తరిగేవాడు తరుగుతూనే ఉన్నాడని అంటుంటారు. ఈ సమయంలో నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయని.. పెరిగిన ధరలు పేదలపై పెను ప్రభావం చూపుతున్నాయనే మాటలు నిత్యం వినిపిస్తూనే ఉంటాయి. ఈ సమయంలో చాలా మంది రెగ్యులర్ వాడే డయబటీస్, పెయిన్ కిల్లర్, యాంటీ బయాటిక్స్ మందుల ధరలు పెరగడం పేదలపై పెను ప్రభావం చూపుతుందని అంటున్నారు.
అవును... ఏప్రిల్ 1 నుంచి దేశీయంగా 900 రకాలకు పైగా ఔషదాల ధరలు పెరిగిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (ఎన్.పీ.పీ.ఏ) ప్రకటించింది. ఈ క్రమంలో... 2023తో పోలిస్తే 2024 క్యాలెండర్ ఇయర్ లో నమోదైన టొకు ద్రవ్యోల్బణం ఆధారంగా మందుల ధరలు గరిష్టంగా 1.74 శాతం వరకూ పెరిగినట్లు ఎన్.పీ.పీ.ఏ. పేర్కొంది. ఈ ప్రభావం పేదలపై భారీగానే ఉన్నట్లు చెబుతున్నారు.
ఉదాహరణకు.. సవరించిన ధరల ప్రకారం యాంటీబయ్యాటిక్ అజిత్రోమైసిన్ 250ఎంజీ ఒక్కో టాబ్లెట్ ధర రూ.11.87, 500ఎంజీ ధర రూ.23.97కు పెరిగింది. డైక్లోఫెనాక్ పెయిన్ కిల్లర్ ధర రూ.2.09, డయాబెటిస్ మెడిసిన్ డపాగ్లిఫోజిన్, మెట్ ఫార్మిన్, గ్లిమొపిరైడ్ కలయిక తాజా ధరల ప్రకారం ఒక టాబ్లెట్ ధర రూ.12.74 అవుతుంది.
ఇలా ఒక్కో టాబ్లెట్ ధర కనీసం రూ.1 నుంచి రూ.2 కు పెరగడం అనేది నెలలో రూ.1500 - 2000 వరకూ సామాన్యులపై భారం పడుతుందని చెబుతున్నారు. ఇది ఒక్కో టాబ్లెట్ పరంగా చూసినప్పుడు స్వల్ప భారంగా అనిపించినా.. నెల మొత్తంగా చూసినప్పుడు పేదల ప్రియారిటీలను ప్రభావితం చేసే స్థాయిలోనే పెరుగుదల నమోదైనట్లని చెబుతున్నారు.
ప్రధానంగా రెగ్యులర్ గా దీర్ఘకాలికంగా మందులు వాడాల్సినవారు, ఇప్పటికే వాడుతున్నవారిపై ఈ పెరిగిన ధరల ప్రభావం బలంగానే ఉంటుందని అంటున్నారు. ఈ విషయమలో డాక్టర్ ఆఫ్ ఫార్మసీ అసోసియేషన్, ప్రభుత్వం.. పునరాలోచన చేసే అవకాశాలు, సబ్సిడీ ఆలోచనలు చేసే అవకాశంపై ఆసక్తి నెలకొంది. వాస్తవానికి ఆరోగ్యమే మహాభాగ్యం అని అంటారు.. ఇప్పుడు మందులు కొనడమే మహాభాగ్యం అనాల్సిన పరిస్థితి అనే మాటలు వినిపిస్తున్నాయి.
ట్రంప్ నెక్స్ట్ టార్గెట్ ఫిక్స్:
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ప్రపంచ దేశాలపై పన్నులతో విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే పలు రంగాలపై విపరీతంగా టారిఫ్ లు పెంచిన ఆయన.. ఇప్పుడు తాజాగా భారత్ కు మరో షాకిచ్చారు. ఇందులో భాగంగా... భారత్ పై 26 శాతం వరకూ టారిఫ్ విధించారు.
దీంతో.. భారత్ నుంచి అమెరికాకు ఎగుమతయ్యే ప్రతీ వస్తువుపైనా ఇప్పటివరకూ ఉన్న టారిఫ్ కు అదనంగా మరో 26% మేర చెల్లించాల్సి ఉంటుందన్నమాట. ఇదే సమయంలో.. ఫార్మాసూటికల్స్ రంగంపై టారిఫ్ విధించనున్నట్లు ట్రంప్ ప్రకటించారు. అమెరికా సొంతంగా డ్రగ్స్, ఇతర మందులు తయారు చేయట్లేదనే విషయాన్ని గుర్తు చేశారు.
వాస్తవానికి ఫార్మాసూటికల్స్ రంగంలో అమెరికాకు అధికంగా ఎగుమతులు చేస్తోంది భారత్! ఇందులో భాగంగా... మహారాష్ట్ర, గుజరాత్ లతో పాటు తెలంగాణ రాష్ట్రం నుంచి పెద్ద ఎత్తున ఔషదాలు అగ్రరాజ్యానికి ఎగుమతి అవుతున్నాయి. ఈ విషయంలో హైదరాబాద్ ఫార్మా హబ్ గా ఉంటోంది. ఈ నేపథ్యంలో ట్రంప్ కొత్త టారిఫ్ లు ఏ మేరకు, ఎలాంటి షాక్ ఇవ్వబోతున్నాయనేది ఆసక్తిగా మారింది.