Begin typing your search above and press return to search.

దేశంలో పెళ్లి కాని ప్రసాద్ లు ఎంత మంది ఉన్నారు?

ఆధునిక జీవనశైలి, ఉన్నత విద్య, ఉద్యోగాలపై యువత దృష్టి పెట్టడం వంటి కారణాల వల్ల వివాహాలు ఆలస్యం అవుతున్నాయి. ఇది జనాభా పెరుగుదల రేటుపై కూడా ప్రభావం చూపుతోంది.

By:  Tupaki Desk   |   15 July 2025 11:48 AM IST
దేశంలో పెళ్లి కాని ప్రసాద్ లు ఎంత మంది ఉన్నారు?
X

దేశంలో వివాహ వయస్సు పెరుగుతూ ఉండటం, పెళ్లికాని యువత సంఖ్య క్రమంగా అధికం అవుతుండటం వంటి అంశాలు జాతీయ జనాభా నమూనా సర్వే (NSS) 2022లో వెల్లడయ్యాయి. ఆధునిక జీవనశైలి, ఉన్నత విద్య, ఉద్యోగాలపై యువత దృష్టి పెట్టడం వంటి కారణాల వల్ల వివాహాలు ఆలస్యం అవుతున్నాయి. ఇది జనాభా పెరుగుదల రేటుపై కూడా ప్రభావం చూపుతోంది.

-పెళ్లి కాని యువత అధికం

NSS 2022 సర్వే ప్రకారం దేశంలోని యుక్తవయస్కులలో 51.1 శాతం మందికి ఇంకా పెళ్లి కాలేదు. వీరిలో పురుషులు 56.3 శాతం ఉండగా, మహిళలు 45.7 శాతం ఉన్నారు. ఇది దేశంలో మారుతున్న సామాజిక ధోరణులను స్పష్టంగా తెలియజేస్తోంది.

-తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి

తెలంగాణలో పెళ్లి కానివారి శాతం 47.5% కాగా ఆంధ్రప్రదేశ్‌లో 43.7% గా ఉంది. ఈ రెండు రాష్ట్రాల్లోని గణాంకాలు జాతీయ సగటు కంటే తక్కువగానే ఉన్నప్పటికీ, వివాహాల ఆలస్యం స్పష్టంగా కనిపిస్తోంది.

- చిన్న వయసులో వివాహాలు

దేశవ్యాప్తంగా 18 ఏళ్ల లోపు యువతులలో 2.3 శాతం మందికి పెళ్లి అయినట్లు సర్వే వెల్లడించింది. ఈ విషయంలో పశ్చిమ బెంగాల్ 6.3%తో మొదటి స్థానంలో ఉంది. శుభ సూచకం ఏంటంటే తెలంగాణ (1.6%) , ఆంధ్రప్రదేశ్ (1.7%) ఈ విషయంలో తక్కువ స్థాయిలో ఉన్నాయి. ఇది విద్య, అవగాహన పెరగడం వల్ల సాధ్యమైందని భావించవచ్చు.

- విడాకులు, విడిపోయిన వారు, శ్రామిక జనాభా

విడాకులు లేదా విడిపోయిన వారు దేశ జనాభాలో 3.3 శాతం మంది ఉన్నారు. వివాహం తర్వాత విడిపోయినవారు లేదా జీవిత భాగస్వామిని కోల్పోయినవారు పెరుగుతున్నారు.. ఇది కుటుంబ వ్యవస్థలో వస్తున్న మార్పులను సూచిస్తుంది. ఇక శ్రామిక జనాభా చూస్తే.. తెలుగు రాష్ట్రాల్లో పనిచేసే వయస్సు గల (15–59 సంవత్సరాలు) జనాభాలో శ్రామికుల శాతం అత్యధికంగా ఉంది. తెలంగాణలో 70.4%, ఆంధ్రప్రదేశ్‌లో 70.2% మంది శ్రామికులు ఉన్నారు. ఇది ఆర్థికంగా చురుకైన జనాభా అధికంగా ఉన్నట్లు సూచిస్తుంది.

- జనాభా నిర్మాణంలో మార్పులు

దేశంలో జనాభా నిర్మాణంలో గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. బాలల జనాభా తగ్గుదల కనిపిస్తోంది. 1971లో దేశ జనాభాలో 14 ఏళ్ల లోపు బాలల శాతం 41.2% ఉండగా.. 2022 నాటికి ఇది 24.7%కి పడిపోయింది. యువ, మధ్యవయస్కుల పెరుగుదల కనిపిస్తోంది. ఇదే సమయంలో 15–59 సంవత్సరాల మధ్య వయస్సు గల వారి శాతం 53.4% నుండి 66.3%కి పెరిగింది. వృద్ధుల జనాభా పెరుగుదల కూడా కారణం. 60 ఏళ్ల పైబడిన వారు 9%గా, 65 ఏళ్ల పైబడిన వారు 5.9%గా ఉన్నారు. రాష్ట్రాల వారీగా చూస్తే, ఆంధ్రప్రదేశ్‌లో 60 ఏళ్లు పైబడిన వారు 10.1% (దేశంలో 6వ స్థానం) ఉండగా, తెలంగాణలో 8.8% (దేశంలో 12వ స్థానం) ఉన్నారు.

- బాలల శాతం 4 ఏళ్ల లోపు చూస్తే..

4 ఏళ్ల లోపు బాలల శాతంలో బిహార్ 11.4%తో దేశంలో మొదటి స్థానంలో ఉంది. తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో 6.5%, ఆంధ్రప్రదేశ్‌లో 6.4% బాలలు ఉన్నారు.

జాతీయ జనాభా నమూనా సర్వే ఫలితాలు దేశంలోని వివాహాలు, జనాభా మార్పులు, వృద్ధుల సంఖ్య పెరుగుదలపై స్పష్టమైన అవగాహనను కల్పిస్తున్నాయి. ప్రజల జీవన విధానాలు మారుతున్న కొద్దీ దేశ జనాభా నిర్మాణంలోనూ కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ అంశాలు పాలకులు, విద్యావేత్తలు, ఆరోగ్య, సంక్షేమ రంగాల ప్రణాళికల్లో దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది.