Begin typing your search above and press return to search.

బ్రెయిన్ డ్రెయిన్: మన యువత, మన వనరులు.. ఎందుకు విదేశాల బాట పడుతున్నారు?

అయితే ఒక దేశం నుంచి అత్యధిక సంఖ్యలో ప్రజలు వలస వెళ్తున్నారంటే ఆ దేశ యువతరం ఆకాంక్షలకు, వాస్తవ పరిస్థితులకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని అది సూచిస్తుంది

By:  A.N.Kumar   |   10 March 2026 8:45 AM IST
బ్రెయిన్ డ్రెయిన్: మన యువత, మన వనరులు.. ఎందుకు విదేశాల బాట పడుతున్నారు?
X

ప్రస్తుత ప్రపంచీకరణ యుగంలో వలసలు సహజమైన ప్రక్రియ. అయితే ఒక దేశం నుంచి అత్యధిక సంఖ్యలో ప్రజలు వలస వెళ్తున్నారంటే ఆ దేశ యువతరం ఆకాంక్షలకు, వాస్తవ పరిస్థితులకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని అది సూచిస్తుంది. భారత్ ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద 'వలస వనరు'గా మారింది. సుమారు 3 కోట్ల మంది భారతీయులు ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉండటం అనేది ఒక రికార్డు.

వలసల వెనుక ఉన్న సామాజిక-ఆర్థిక చట్రం

ఈ వలసలను కేవలం 'మెరుగైన జీతం' అనే కోణంలో మాత్రమే చూడలేము. ఇది ఒక లోతైన సామాజిక మార్పు. ఒకప్పుడు వలసలు కేవలం ఆర్థిక అవసరాల కోసం జరిగేవి. నేడు అవి జీవనశైలి, సామాజిక భద్రత, విద్యా నాణ్యత, వృత్తిపరమైన ఎదుగుదల కోసం జరుగుతున్నాయి.

కెనడా, ఆస్ట్రేలియా, యూకే వంటి దేశాలు తమ జనాభా అవసరాల దృష్ట్యా 'స్కిల్డ్ ఇమిగ్రేషన్' విధానాలను సరళతరం చేశాయి. ఇది భారతీయ యువతకు ఒక సువర్ణావకాశంగా మారింది. మరోవైపు అమెరికా వంటి దేశాలు భారతీయ ప్రతిభను ముఖ్యంగా టెక్నాలజీ, వైద్య రంగాలలో తమ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా మార్చుకున్నాయి.

ఎందుకు ఈ 'బ్రెయిన్ డ్రెయిన్'?

ప్రతిభావంతులు దేశాన్ని వదిలి వెళ్లడాన్ని మనం 'బ్రెయిన్ డ్రెయిన్' అని పిలుస్తాము. మన దేశంలో విద్యా వ్యవస్థ సిద్ధాంతపరంగా బాగున్నప్పటికీ పరిశోధనలకు కేటాయిస్తున్న నిధులు, సౌకర్యాలు అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే తక్కువ. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నాణ్యమైన ఉద్యోగాల సృష్టి జరగడం లేదు. ఉన్నత చదువులు చదివిన యువతకు, వారు ఆశించిన స్థాయి జీవన ప్రమాణాలను అందించే ఉపాధి అవకాశాలు ఇక్కడ పరిమితంగా ఉంటున్నాయి. అనేకమంది యువత మెరుగైన మౌలిక సదుపాయాలు, అవినీతి లేని పాలన, వ్యక్తిగత స్వేచ్ఛను కోరుకుంటున్నారు..ఇవి విదేశాల్లో సులభంగా లభిస్తున్నాయని భావిస్తారు.

మనం ఆలోచించాల్సిన ప్రశ్నలు

విదేశాలకు వెళ్లడం వారి హక్కు, అది వ్యక్తిగత ఎదుగుదలకు మార్గం. కానీ, నిరంతరం జరుగుతున్న ఈ భారీ వలసలు భారత్ భవిష్యత్తుపై దీర్ఘకాలిక ప్రభావం చూపుతాయి. ప్రతిభను నిలుపుకోవడం ఎలా? దేశంలోనే స్టార్టప్ సంస్కృతి పెరుగుతున్నా అది ఉన్నతస్థాయి ప్రతిభను పట్టుకోవడానికి సరిపోతుందా? అన్నది ప్రశ్న..

విదేశాల్లో ఉన్న భారతీయులు పంపుతున్న డబ్బులు మన ఆర్థిక వ్యవస్థకు పెద్ద ఊతం ఇస్తున్నాయి. అయితే కేవలం డబ్బు రూపంలో కాకుండా వారి జ్ఞానాన్ని, సాంకేతికతను స్వదేశానికి ఎలా రప్పించాలి? అన్నది ప్రభుత్వాలు ఆలోచించాల్సిన అవసరం ఉంది.

భారత్ ఇప్పుడు తన యువ శక్తిని కేవలం ఎగుమతి చేసే దేశంగా ఉండకూడదు. ప్రపంచ స్థాయి పరిశోధనా సంస్థలు, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన పని వాతావరణాన్ని మన దేశంలోనే సృష్టించగలిగితేనే ఈ ప్రతిభ మన సొంత అభివృద్ధికి ఉపయోగపడుతుంది.

భారతీయులు ప్రపంచాన్ని శాసిస్తున్నారు అనేది గర్వించదగ్గ విషయం. కానీ ఆ గర్వం మన దేశం విడిచి వెళ్లిన వారి ప్రతిభపైనే ఆధారపడి ఉండకూడదు. ఆ ప్రతిభను మన గడ్డపైనే పండించేలా పాలసీలు రూపొందడం నేటి అత్యవసర అవసరం.