ఇండియా జస్టిస్ రిపోర్టు 2025.. టాప్ లో దక్షిణాది రాష్ట్రాలు!
దేశంలోని సమర్థవంతమైన పోలీస్ వ్యవస్థ.. న్యాయవ్యవస్థలకు సంబంధించిన రిపోర్టు తాజాగా వెల్లడైంది.
By: Tupaki Desk | 16 April 2025 10:41 AM ISTరాష్ట్ర అభివృద్ధికి వ్యవస్థీకృతమైన పోలీసు వ్యవస్థ.. కఠినమైన శాంతిభద్రతల నిర్వహణ ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ ప్రాథమిక సూత్రాలను సమర్థవంతంగా అమలు చేసే రాష్ట్రాలు సామాజికంగా.. ఆర్థికంగా శరవేగంగా అభివృద్ధి చెందుతాయి. ఈ నేపథ్యంలో తాజాగా విడుదలైన ఇండియన్ జస్టిస్ రిపోర్ట్ –2025 నివేదిక దేశంలోనే అత్యుత్తమ పోలీసు వ్యవస్థ కలిగిన రాష్ట్రాల జాబితాను వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం, తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది.
తెలంగాణ రాష్ట్రం 6.48 స్కోర్‌తో మొదటి స్థానంలో నిలవగా, ఆంధ్రప్రదేశ్ 6.44 స్కోర్‌తో రెండో స్థానాన్ని దక్కించుకుంది. కర్ణాటక రాష్ట్రం 6.19 స్కోర్‌తో మూడో స్థానంలో నిలిచింది. విశేషం ఏమిటంటే.. గత ఏడాది మూడో స్థానంలో ఉన్న తెలంగాణ ఈ ఏడాది అద్భుతమైన పురోగతి సాధించి మొదటి స్థానానికి ఎగబాకింది.
కోటి కంటే ఎక్కువ జనాభా కలిగిన రాష్ట్రాల జాబితాలో తెలంగాణ అగ్రస్థానంలో నిలవడం నిజంగా గొప్ప విషయం. ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వం యొక్క పోలీసు విధానాలకు ఒక ప్రత్యక్ష నిదర్శనం అని చెప్పవచ్చు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయని ఈ ర్యాంకింగ్స్ ద్వారా స్పష్టమవుతోంది.
ముఖ్యంగా పోలీసు ర్యాంకింగ్‌ల విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ రాష్ట్రాలు నిలకడగా అగ్రస్థానంలో ఉండటం చాలా ప్రోత్సాహకరమైన విషయం. రెండు తెలుగు రాష్ట్రాలు దేశంలోనే అత్యుత్తమ పోలీసు వ్యవస్థను కలిగి ఉండటం గర్వించదగ్గ విషయం.
గత కొంతకాలంగా రెండు రాష్ట్రాల్లోనూ చోటుచేసుకున్న ప్రభుత్వాల మార్పులు మెరుగైన పోలీసు వ్యవస్థ, శాంతిభద్రతల నిర్వహణకు దోహదపడినట్లు కనిపిస్తోంది. ప్రజల భద్రత , శాంతియుత జీవనం కోసం ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు ఫలిస్తున్నాయని ఈ ర్యాంకింగ్స్ తెలియజేస్తున్నాయి.
మొత్తం మీద ఇండియన్ జస్టిస్ రిపోర్ట్ –2025 తెలంగాణ పోలీసులకు దేశంలోనే మొదటి స్థానాన్ని ఇవ్వడం ఆ రాష్ట్రానికి ఒక గొప్ప గుర్తింపు. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో నిలవడం కూడా ఆ రాష్ట్ర పోలీసు వ్యవస్థ యొక్క సామర్థ్యాన్ని తెలియజేస్తుంది. ఈ రెండు రాష్ట్రాలు తమ పోలీసు వ్యవస్థను మరింత మెరుగుపరచుకొని దేశానికే ఆదర్శంగా నిలవాలని ఆశిద్దాం.
