భారత్‌లో జపాన్ ‘షింకన్‌సెన్’.. వేగం, సాంకేతికత, భవిష్యత్ మార్గదర్శకం
ప్రధాని నరేంద్ర మోదీ జపాన్ పర్యటనలో భాగంగా బుల్లెట్ రైలు ప్రాజెక్టుపై ప్రత్యేక చర్చలు జరగనున్నాయి.
By: Tupaki Desk | 30 Aug 2025 10:00 PM ISTప్రధాని నరేంద్ర మోదీ జపాన్ పర్యటనలో భాగంగా బుల్లెట్ రైలు ప్రాజెక్టుపై ప్రత్యేక చర్చలు జరగనున్నాయి. ముంబయి-అహ్మదాబాద్ మధ్య ప్రారంభమవుతున్న ఈ ప్రాజెక్ట్ భారత్ రైల్వే చరిత్రలోనే కీలకమైన మలుపు.
జపాన్ పర్యటనలో భాగంగా మోదీ తోహోకు షింకన్‌సెన్ ప్లాంట్‌ను సందర్శించారు. అక్కడ ప్రత్యేకంగా శిక్షణ పొందుతున్న భారతీయ డ్రైవర్లతో ప్రదాని మాట్లాడారు. దీని ద్వారా ఈ ప్రాజెక్ట్‌కు భారత్ ఇస్తున్న ప్రాధాన్యం మరింత స్పష్టమైంది.
షింకన్‌సెన్ ప్రత్యేకతలు
షింకన్‌సెన్ అనగా జపనీస్‌లో “కొత్త ప్రధాన మార్గం” అని అర్థం. 1964 నుంచి నడుస్తున్న ఈ రైళ్లకు ఇప్పటివరకు పెద్ద ప్రమాదాలు జరగలేదు. భూకంపాలు, ప్రకృతి విపత్తుల సమయంలో కూడా రైలు సురక్షితంగా నడవడానికి ప్రత్యేక ఎల్-ఆకారపు గైడ్స్ ఏర్పాటు చేశారు. E10 సిరీస్ షింకన్‌సెన్ అత్యాధునిక సాంకేతికతతో రూపుదిద్దుకుంది. ఎక్కువ లగేజీ స్థలం, వీల్‌ఛైర్ ప్రయాణికుల కోసం ప్రత్యేక సీట్లు, అధునాతన బ్రేకింగ్ సిస్టమ్ వంటి సదుపాయాలు ఉన్నాయి. ఈ ట్రైన్ గరిష్ఠ వేగం గంటకు 320 కి.మీ. అయితే ఎలక్ట్రానిక్ పరిమితి తొలగిస్తే ఇది 360 కి.మీ. వేగాన్నీ చేరుకోగలదు.
భారత్‌కు బుల్లెట్ రైలు ప్రాధాన్యం
భారత్ మొదటగా E5 సిరీస్‌ను తీసుకురావాలని భావించింది. సాంకేతిక పురోగతిని దృష్టిలో ఉంచుకుని ఇప్పుడు E10 వైపు మొగ్గు చూపుతున్నది. ట్రాక్‌ల చుట్టూ అధిక జనసంచారం ఉండే భారత్ పరిస్థితులకు అనుగుణంగా బ్రేకింగ్ సిస్టమ్‌లో ప్రత్యేక మార్పులు చేశారు. ఇది ప్రయాణికుల భద్రతకు కీలకం.
ప్రాజెక్టు పురోగతి
ముంబయి-అహ్మదాబాద్ హైస్పీడ్ రైలు ప్రాజెక్టు (MAHSR) 2017లో సబర్మతిలో ప్రారంభమైంది. దాదాపు 508 కి.మీ. దూరాన్ని ఈ బుల్లెట్ రైలు కేవలం రెండు గంటల ఏడు నిమిషాల్లో పూర్తిచేస్తుంది. ప్రాజెక్టు మొదటి దశ 2027లో గుజరాత్‌లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. పూర్తిస్థాయి మార్గం 2028 నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
భారత్-జపాన్ వ్యూహాత్మక భాగస్వామ్యం
ఈ ప్రాజెక్ట్ కేవలం రవాణా రంగానికే పరిమితం కాదు. ఇది భారత్-జపాన్ వ్యూహాత్మక భాగస్వామ్యానికి ప్రతీక. అంతర్జాతీయ స్థాయిలో భారత్ సాంకేతిక అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోందని ఇది నిరూపిస్తోంది. "తక్కువ సమయంలో గమ్యస్థానానికి చేరుకునే అవకాశం, అత్యున్నత భద్రతా ప్రమాణాలు, ప్రయాణికుల కోసం ఆధునిక సౌకర్యాల సమీకరణ—ఈ అంశాల కలయిక బుల్లెట్ రైలు ప్రాజెక్టును ప్రత్యేకంగా నిలబెడుతోంది." రాబోయే దశాబ్దాల్లో ఇది భారత్ రవాణా రంగానికే కాక ఆర్థిక వృద్ధికి కూడా ప్రధాన ప్రేరణ కానుంది.
