Begin typing your search above and press return to search.

భుట్టోకు భారత్ నుంచి స్ట్రాంగ్ రిప్లై... కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు!

ఇదే సమయంలో... సింధూ జలాల ఒప్పందాన్ని నిలిపివేయాలనే భారత్‌ నిర్ణయాన్ని తప్పుబట్టారు.

By:  Tupaki Desk   |   27 Jun 2025 2:00 AM IST
భుట్టోకు భారత్  నుంచి స్ట్రాంగ్  రిప్లై... కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు!
X

సింధు జలాల ఒప్పందం కింద తమకు న్యాయంగా రావాల్సిన నీటి వాటా ఇచ్చేందుకు భారత్‌ నిరాకరిస్తే తమ దేశం యుద్ధానికి వెళ్తుందని పాక్ విదేశాంగ శాఖ మాజీ మంత్రి, పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) అధినేత బిలావల్‌ భుట్టో జర్దారీ హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో తాజాగా ఆ హెచ్చరికలకు భారత్ నుంచి స్ట్రాంగ్ రిప్లై వచ్చేసింది.

అవును... పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ సైనిక చర్య చేపట్టకముందు తీసుకున్న పలు దౌత్యపరమైన నిర్ణయాల్లో సింధూ జలాల ఒప్పందం రద్దు అంశం ఒకటనే సంగతి తెలిసిందే. దీనిపై ఇటీవల స్పందించిన భుట్టో... భారత్ జలాలను న్యాయంగా తమతో పంచుకోవాలి.. లేదంటే, తాము సింధు పరివాహక ప్రాంతంలోని ఆరు నదుల నుంచి నీటిని తీసుకుంటామని వ్యాఖ్యానించారు.

ఇదే సమయంలో... సింధూ జలాల ఒప్పందాన్ని నిలిపివేయాలనే భారత్‌ నిర్ణయాన్ని తప్పుబట్టారు. పలు కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో.. ఈ విషయం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. యుద్ధం ఆపండి మహాప్రభో అంటూ కాళ్లబేరానికి వచ్చిన పాకిస్థాన్.. ఇప్పుడు యుద్ధం గురించి మాట్లాడం ఏమిటనే కామెంట్లు వినిపించాయి. ఈ నేపథ్యంలో కేంద్ర జలశక్తి మంత్రి పాటిల్ స్పందించారు.

ఇందులో భాగంగా... సింధు జలాల ఒప్పందం (ఐ.డబ్ల్యూ.టీ) సస్పెన్షన్‌ పై భారతదేశ కఠిన వైఖరిని కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ గురువారం పునరుద్ఘాటించారు. నాడు తీసుకున్న ఆ చర్య దేశ ప్రయోజనాల కోసమేనని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా బిలావల్ భుట్టో హెచ్చరికల వాఖ్యలను ఖాళీ బెదిరింపులుగా తోసిపుచ్చారు.

ఈ సందర్భంగా... సింధూ జలాల ఒప్పందం రద్దు నిర్ణయం భారత ప్రభుత్వానికి, భారత ప్రధానమంత్రికి చెందినదని.. ఈ ఒప్పందం రద్దుపై ఎటువంటి మార్పు లేదని.. తాము ఏ నిర్ణయం తీసుకున్నా అది దేశానికి మాత్రమే ప్రయోజనం చేకూర్చేలా ఉంటుందని పాటిల్ అన్నారు. ఈ నేపథ్యలోనే... "నీరు ఎక్కడికీ పోదు" అని క్లారిటీ ఇచ్చారు.

ఇక, బిలావల్ భుట్టో చాలా వ్యాఖ్యలు చేశారని, అవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదని, అలాంటి హెచ్చరికలకు భయపడేది లేదని.. సింధూ నదీ జలాలు ఎక్కడికీ పోవని.. ఈ జలాల విషయంలో భారత్ తీసుకున్న నిర్ణయంలో మార్పు లేదని సీఆర్ పాటిల్ తేల్చి చెప్పారు!