పాక్ పై ‘వాటర్ బాంబ్’... భారత్ కొట్టిన దెబ్బ ప్రభావం చెప్పిన సెనేటర్!
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంపై ఆపరేషన్ సిందూర్ చేపట్టడానికి ముందు పాక్ కు భారత్ కొన్ని దౌత్యపరమైన షాకులిచ్చిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 24 May 2025 12:39 AM ISTపహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంపై ఆపరేషన్ సిందూర్ చేపట్టడానికి ముందు పాక్ కు భారత్ కొన్ని దౌత్యపరమైన షాకులిచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో ప్రధానంగా సింధూ నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేసింది. భారత్ తీసుకొన్న ఈ నిర్ణయం ప్రభావం పాక్ లో మొదలైపోయిందని అంటున్నారు. తాజాగా పాక్ సెనేటర్ చేసిన వ్యాఖ్యలు దీనికి బలం చేకూరుస్తున్నాయి.
అవును... పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా సింధూ నదీ జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేయడం పాక్ ను కలవరపెట్టడం మొదలుపెట్టిందని అంటున్నారు. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ సెనేటర్ సయ్యద్ అలీ జాఫర్.. భారత్ తీసుకొన్న ఈ నిర్ణయాన్ని "వాటర్ బాంబ్" గా అభివర్ణించారు. దీంతో.. వారిలో ఈ టెన్షన్ ఏ స్థాయిలో ఉందో అర్ధమవుతోంది!
తాజాగా జరిగిన సెనేట్ సమావేశంలో మాట్లాడిన ఇమ్రాన్ ఖాన్ కు చెందిన పార్టీ, ప్రతిపక్ష పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) సీనియర్ నాయకుడు జాఫర్.. భారత్ తీసుకొన్న సింధూ జలాల నిర్ణయం పాకిస్థాన్ లోని ప్రతీ 10 మందిలో కనీసం ఒకరిని నేరుగా దెబ్బతీస్తుందని అన్నారు! ఇది విస్తృతమైన ఆకలికి, సామూహిక మరణాలకు దారి తీస్తుందని హెచ్చరించారు.
ఈ సందర్భంగా స్పందించిన సెనేటర్ సయ్యద్ అలీ జాఫర్... ఈ నీటి సంక్షోభాన్ని పాకిస్థాన్ ఇప్పుడు పరిష్కరించుకోకపోతే ఆకలితో చనిపోతామని అన్నారు. సింధూ నదీ పరివాహక ప్రాంతం పాక్ జీవనాడి అని.. పాక్ వాడే నీటిలో మూడువంతుల నీరు దేశం వెలుపల నుంచే వస్తాయని.. ఇక్కడ పంటలు 90% ఈ నీటిపైనే ఆధారపడి ఉంటాయని స్పష్టం చేశారు!
ఇదే సమయంలో... పాకిస్థాన్ లోని 10 మందిలో తొమ్మిది మంది ప్రజలు తమ జీవనోపాధి కోసం సింధూ నదీ పరివాహక ప్రాంతంపైనే ఆధారపడతారని.. అన్ని విద్యుత్ ప్రాజెక్టులు, ఆనకట్టలు దానిపైనే నిర్మించబడ్డాయని తెలిపారు. ఈ నేపథ్యంలోనే... భారత్ నిర్ణయం దేశంపై వేలాడుతున్న నీటి బాంబు అని.. దానిని వెంటనే నిర్వీర్యం చేయాలని పాక్ ప్రభుత్వానికి సూచించారు.
కాగా... పాక్ కు సింధూ నదీ వ్యవస్థ జీవనాడి లాంటిది! ఈ నదీ వ్యవస్థ నుంచి సుమారు 93% నీటిని పాకిస్థాన్ నీటిపారుదల, విద్యుత్ ఉత్పత్తికి ఉపయోగిస్తుంది. ఇదే సమయంలో.. ఆ దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక భూమిక పోషించే వ్యవసాయానికి సంబంధించిన సాగునీటిలో సుమారు 80% భూమి ఈ జలాలపైనే ఆధారపడి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే.. భారత్ నిర్ణయం పాక్ పై వేలాడుతోన్న నీటి బాంబు గా అభివర్ణించారు జాఫర్!
