రైల్వేలో కొత్త శకం.. జులై నుంచి పట్టాలెక్కనున్న హైడ్రోజన్ రైలు
మన భారతీయ రైల్వే కొత్త శిఖరాలకు చేరుకుంటోంది. బొగ్గు, డీజిల్, విద్యుత్ ఆధారంగా నడిచే రైళ్ల స్థానంలో కొత్తగా హైడ్రోజన్ రైళ్లను ప్రవేశపెడుతోంది.
By: Tupaki Desk | 21 April 2025 5:05 PM ISTమన భారతీయ రైల్వే కొత్త శిఖరాలకు చేరుకుంటోంది. బొగ్గు, డీజిల్, విద్యుత్ ఆధారంగా నడిచే రైళ్ల స్థానంలో కొత్తగా హైడ్రోజన్ రైళ్లను ప్రవేశపెడుతోంది. ప్రస్తుతానికి హెరిటేజ్, టూరిజం ప్లేసులకు మాత్రమే ఈ రైళ్లను నడపాలని భావిస్తున్నా, దశలవారీగా దేశవ్యాప్తంగా విస్తరించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. హైడ్రోజన్ ను నీటితో కలిపి శక్తిగా మార్చడం ద్వారా ఈ రైళ్లు పట్టాలపై పరుగులు తీయనున్నాయి. దాదాపు 110 నుంచి 140 కి.మీ. వేగంతో ప్రయాణించే హైడ్రోజన్ రైలు మొదట హరియాణాలోని జీంద్-సోనిపత్ రూట్లో నడపనున్నారు. ఇందుకోసం జులైలో ముహూర్తం ఫిక్స్ చేశారు.
దేశంలో తొలి హైడ్రోజన్ రైలు ప్రస్తుతం చెన్నై కోచ్ ఫ్యాక్టరీ తయారువుతోంది. తుది మెరుగులు దిద్దుకుంటున్న ఈ రైలును జులై నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి తేనున్నారు. హైడ్రోజన్ ఫర్ హెరిటేజ్ ఇన్నోవేషన్ కింద హైడ్రోజన్ శక్తితో నడిచే 35 రైళ్లను ప్రభుత్వం తయారు చేయిస్తోంది. ప్రతి రైలు కు దాదాపు రూ.80 కోట్లు ఖర్చు చేస్తున్నారు. అంతేకాకుండా రైల్వే స్టేషన్లలో మౌలిక సదుపాయాల కోసం అదనంగా రూ.70 కోట్లు వెచ్చిస్తున్నారు. హెరిటేజ్, హిల్ స్టేషన్లలో ఈ రైళ్లను నడిపేందుకు ప్రణాళికలు రెడీ చేస్తున్నారు.
చెన్నైలోని సెంట్రల్ కోచ్ ఫ్యాక్టరీలో హైడ్రోజన్ ట్రైన్ ను తయారు చేస్తున్నారు. మరోవైపు ట్రైన్ తిరిగే రూట్లో హైడ్రోజన్ ప్లాంట్ నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. చెన్నై నుంచి జీంద్ కు ట్రైన్ తెచ్చిన తర్వాత ముందుగా ట్రయల్ రన్ నిర్వహించనున్నారు. ఈ రైలు అందుబాటులోకి వస్తే జీంద్-సోనిపత్ మధ్య ప్రయాణం సజావుగా సాగుతుందని అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న హైడ్రోజన్ ప్లాంటు పూర్తయ్యేందుకు మరో రెండు నెలల సమయం పట్టవచ్చని అంటున్నారు.
జీంద్ నుంచి సోనిపత్ మధ్య నడపాలని ప్రతిపాదిస్తున్న హైడ్రోజను రైలుకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. జీంద్ లోని వాషింగ్ లైను ను ప్రస్తుతం 17 కోచుల సామర్థ్యంతో నిర్వహిస్తున్నారు. దీన్ని23 కోచ్ లకు విస్తరించాలని రైల్వే అధికారులు ప్రతిపాదిస్తున్నారు. అదేవిధంగా కొత్త రైల్వే జంక్షన్ పనులను ఆగస్టు-సెప్టెంబరు కల్లా పూర్తిచేస్తామని అంటున్నారు. హైడ్రోజన్ రైలు నడిచేందుకు సుమారు 40 వేల లీటర్ల నీటిని ఉపయోగించుకోనుంది. ఒకసారి ట్యాంకు నింపితే వెయ్యి కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుందని అధికారులు చెబుతున్నారు. తొలిసారి హైడ్రోజన్ తో నడిచే రైలును అందుబాటులోకి తేనుండటం అందరిలనూ ఆసక్తి రేపుతోంది.
