Begin typing your search above and press return to search.

ఈ పట్టణాల్లో ఇళ్లు కొనలేం.. రాయిటర్స్ సర్వేలో సంచలన విషయాలు..

ధనికుల కొనుగోలు డిమాండ్ పెర‌గ‌డం, సరసమైన గృహాల సరఫరా తగ్గడం వల్ల ఈ పరిస్థితి ఎదురవుతుందని రాయిటర్స్ నిర్వహించిన సర్వేలో బయటపడింది

By:  Tupaki Desk   |   19 Sept 2025 9:00 PM IST
ఈ పట్టణాల్లో ఇళ్లు కొనలేం.. రాయిటర్స్ సర్వేలో సంచలన విషయాలు..
X

భారత్‌లో ఇళ్ల ధరలు ఊహించిన దానికంటే వేగంగా పెరుగ‌నున్నాయి. ధనికుల కొనుగోలు డిమాండ్ పెర‌గ‌డం, సరసమైన గృహాల సరఫరా తగ్గడం వల్ల ఈ పరిస్థితి ఎదురవుతుందని రాయిటర్స్ నిర్వహించిన సర్వేలో బయటపడింది. అత్యున్నత వేత‌న ఉద్యోగాలు కొన్ని నగరాల్లోనే కేంద్రీకృతం కావడం, కరోనా కారణంగా సాధారణ వేతనాలు తగ్గడం వల్ల లక్షలాది మంది సొంత గృహం కలగానే మిగులుతోంది. ఉద్యోగాల కోసం పట్టణాల‌కు వ‌చ్చే వారిలో ఎక్కువ మంది ఇల్లు కొనలేక అద్దె ఇళ్లతోనే గడపాల్సి వస్తుంది.

ఆసియాలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన భారత్ గత త్రైమాసికంలో 7.8 శాతం వృద్ధి సాధించింది. కానీ ఆ ఫలాలు కేవలం కొద్ది శాతం జనాభాకే పరిమితమయ్యాయి. ఈ అసమానత గృహరంగంలోనూ స్పష్టంగా కనిపిస్తుంది. లగ్జరీ ఇళ్లకు డిమాండ్ పెరిగినా, సరసమైన ఇళ్ల కొరత కూడా మరింత పెరుగుతోంది. భారత్‌ లో సుమారు కోటి సరసమైన ఇళ్ల కొరత ఉందని, ఇది 2030 నాటికి మూడింతలు పెరగవచ్చని నిపుణులు చెప్తున్నారు.

గత దశాబ్దంలో సగటు ఇళ్ల ధరలు రెట్టింపయ్యాయి. ఈ సంవత్సరం 6.3 శాతం పెరుగుతాయని, 2026లో 7 శాతం వరకు పెరుగుతాయని రాయిటర్స్ ఆగస్ట్ 14, సెప్టెంబర్ 12వ తేదీ మధ్య 20 మంది నిపుణులపై చేసిన సర్వేలో తేలింది. ఇది జూన్‌లో అంచనా వేసిన 6 శాతం-5 శాతం కంటే ఎక్కువ.

కింది స్థాయి ప్రజలకు లాభం లేకపోవడం

‘ప్రస్తుతం ఉన్న బలమైన ఆర్థిక గణాంకాలు దిగువ తరగతికి లాభించలేదు. వారి డిస్పోజబుల్ ఇన్కమ్ స్థిరంగా ఉంది’ అని కొల్లియర్స్ మేనేజింగ్ డైరెక్టర్ అజయ్ శర్మ అన్నారు. ఇళ్లు కొనలేని ఈ వర్గం ఎక్కువగా అద్దెకు మొగ్గు చూపుతోందని చెప్పారు. అద్దె డిమాండ్ పెరగడంతో అద్దెలు కూడా పెరుగుతున్నాయని వివరించారు. రాబోయే ఏడాదిలో నగరాల్లో అద్దెలు 5% నుంచి 8% వరకు పెరుగుతాయని అంచనాలు చెబుతున్నాయి. ఇది వినియోగదారుల ద్రవ్యోల్బణం కంటే ఎక్కువ.

మొదటిసారి ఇల్లు కొనేవారికి మిశ్రమ అభిప్రాయాలు

మొదటిసారి ఇల్లు కొనేవారి కొనుగోలు సామర్థ్యం మెరుగుపడుతుందా అనే ప్రశ్నపై నిపుణులు విభేదిస్తున్నారు. 19 మందిలో 10 మంది మెరుగవుతుందని, 9 మంది క్షీణిస్తుందని చెప్తున్నారు. జూన్ సర్వేతో పోలిస్తే ఇది పెద్ద మార్పు. ఆర్బీఐ వడ్డీ రేట్లు 100 బేసిస్ పాయింట్లు తగ్గించి 5.50%కు తెచ్చినప్పటికీ, ఇది ఇళ్ల ధరలపై పెద్దగా ప్రభావం చూపకపోవచ్చని నిపుణులు అంటున్నారు.

సాధారణ కొనుగోలు దారులు దూరం

‘వడ్డీ రేట్లు తగ్గడం వల్ల హౌసింగ్ లోన్ల భారం కొంత తగ్గవచ్చు. కానీ దేశవ్యాప్తంగా ఇళ్ల ధరలు 7%-8% పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఢిల్లీ-ఎన్‌సీఆర్, బెంగళూరు వంటి నగరాల్లో మరింత ఎక్కువ పెరుగుదల కనిపిస్తోంది. మార్కెట్ మొత్తం ప్రీమియం, లగ్జరీ ఇళ్లవైపు మొగ్గు చూపుతున్నందున, సాధారణ దిగువ తరగతి వారు సొంత ఇల్లు అనే కాన్సెప్ట్ కు దూరంగా ఉంటున్నారు’ అని ఢిల్లీలోని ఈరోస్ గ్రూప్ డైరెక్టర్ అవనీష్ సూద్ తెలిపారు.

దీర్ఘకాల ప్రభావాలు

‘ఫైనాన్షలైజేషన్ తర్వాత గృహరంగంలో సరసమైన ఇళ్లు అందుబాటులోకి రాలేదు. బదులుగా పరిస్థితి మరింత క్షీణించింది. ఇల్లు కొనుగోలు చేసే వయసు సగటు 30-40 ఏళ్ల నుంచి 45 ఏళ్లకు పెరిగింది’ అని లయాసెస్ ఫోరస్‌కు చెందిన పంకజ్ కపూర్ అన్నారు.