Begin typing your search above and press return to search.

రిపోర్టు: అంతకంతకూ పెరుగుతున్న రాత్రి ఉష్ణోగ్రతలు

పగలు ఎలా ఉన్నా.. రాత్రి అయితే చాలు వాతావరణం చల్లగా ఉండే రోజులు రాన్రాను మరింత తగ్గనున్నాయి. గతంతో పోలిస్తే.. ఈ విషయంలో వచ్చిన మార్పును తాజాగా వెల్లడించిన రిపోర్టు స్పష్టం చేసింది.

By:  Tupaki Desk   |   6 Jun 2025 1:00 PM IST
రిపోర్టు: అంతకంతకూ పెరుగుతున్న రాత్రి ఉష్ణోగ్రతలు
X

పగలు ఎలా ఉన్నా.. రాత్రి అయితే చాలు వాతావరణం చల్లగా ఉండే రోజులు రాన్రాను మరింత తగ్గనున్నాయి. గతంతో పోలిస్తే.. ఈ విషయంలో వచ్చిన మార్పును తాజాగా వెల్లడించిన రిపోర్టు స్పష్టం చేసింది. అంతేకాదు.. గతంలో ఈ రేయి చల్లనిదన్న పాట..జనాల నోట రాదన్న విషయాన్ని చెబుతూ.. అందుకు కారణాల్ని కుండబద్ధలు కొట్టింది. పరిస్థితి ఎంత దారుణంగా ఉందన్న విషయాన్ని చెప్పేసింది. పగటి ఉష్ణోగ్రతల మాదిరే రాత్రి వేళలోనూ వేడి వాతావరణంతో వేధించే రోజులు వచ్చేసిన పాడు నిజాన్ని బయటపెట్టింది.

కేంద్ర ఇంధన.. పర్యావరణ.. నీటి మండలి ఏర్పాటు చేసిన హౌ ఎక్స్ ట్రీమ్ హీట్ ఇంపాక్టింగ్ ఇండియా అనే అధ్యయన వివరాలు తాజాగా వెల్లడయ్యాయి. దేశంలోని 734 జిల్లాల్లో గడిచిన నాలుగు దశాబ్దాల వాతావరణ ఆధారిత ఉష్ణోగ్రతల్ని అంచనా వేసి వివరాల్ని వెల్లడించింది. ఇందులో పట్టణ ప్రాంతాలే కాదు గ్రామీణ ప్రాంతాల్లోనూ రాత్రివేళ వేడి పెరుగుతున్న విషయాన్ని హెచ్చరించింది. దేశంలోని 734 జిల్లాల్లో 417 జిల్లాల్లో అత్యధిక ప్రమాదకరంగా వేడి పెరుగుతున్నట్లుగా గుర్తించింది. వేడి ఉష్ణోగ్రతల ప్రమాద స్థాయి 201 జిల్లాల్లో మధ్యస్థంగా.. 116 జిల్లాల్లో తక్కువగా ఉన్నట్లు తేల్చింది.

రాత్రిళ్లు వేడి వాతావరణం పెరిగిన టాప్ 10 రాష్ట్రాల జాబితాలో..

- ఢిల్లీ

- ఆంధ్రప్రదేశ్

- గోవా

- కేరళ

- మహారాష్ట్ర

- గుజరాత్

- రాజస్థాన్

- కర్ణాటక

- తమిళనాడు

- ఉత్తరప్రదేశ్

దేశంలో రాత్రి ఉష్ణోగ్రతలు ఎక్కువైన రాష్ట్రాల జాబితాలో తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఉండటం గమనార్హం.1982-2011 బేస్ లైన్ తో పోలిస్తే గడిచిన పదేళ్లలో 70 శాతం జిల్లాల్లో వేసవిలో ఐదు రెట్లు వేడి పెరిగిందని.. 10 శాతం తేమ పెరిగినట్లుగా ఈ అధ్యయనం వెల్లడించింది. గడిచిన యాభై ఏళ్లలో 700లకు పైగా వేడి తరంగాల కారణంగా దేశంలో 17వేల మంది మరణించినట్లుగా కేంద్ర ప్రభుత్వ సంస్థ వెల్లడించింది.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. మరోవైపు ఆందోళన కలిగించే హెచ్చరికను ఈ అధ్యయనం చేసింది. అదేమంటే..ఎక్కువ కాలం ఉండే వేడి రాత్రుల యుగంలోకి ప్రవేశిస్తున్నట్లుగా పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో పరిస్థితి తీవ్రతను గుర్తించి.. వాతావరణాన్ని చల్లబరిచేందుకు అత్యవసర చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. అదే జరగకపోతే.. సూర్యుడు ఆస్తమించే సమయం తగ్గిపోతుందన్న షాకింగ్ నిజాన్ని వెల్లడించారు.అదే జరిగితే రాత్రి కూడా పగలుగా మారుతుందని అధ్యయనం హెచ్చరించింది. ఇదంతా చదివిన తర్వాత.. జరిగిపోయిన కాలమే ఎంతో అందంగా.. హాయిగా ఉన్నట్లు అనిపించకమానదు.