ఎలాన్ మస్క్‌కు ఇండియా బిగ్ షాక్.. స్టార్‌లింక్‌కు బ్రేకులు వేసిన మోదీ సర్కార్!
ప్రపంచ కుబేరుడు, టెక్ దిగ్గజం, స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్‌కు భారత ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది.
By: Tupaki Political Desk | 10 Jun 2026 1:54 PM ISTప్రపంచ కుబేరుడు, టెక్ దిగ్గజం, స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్‌కు భారత ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది. భారత్‌లో శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను వేగంగా విస్తరించాలని భావిస్తున్న మస్క్ కలలపై నీళ్లు చల్లింది. దేశంలో స్టార్‌లింక్ కమర్షియల్ కార్యకలాపాలు ప్రారంభించడానికి అవసరమైన అత్యవసర అనుమతులను భారత ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసింది. బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం ఈ నిర్ణయం వెనుక బలమైన కారణాలు ఉన్నట్లు చెబుతున్నారు.
అసలు కారణం ఏంటి?
భారత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రధానంగా జాతీయ భద్రతా కారణాలే కారణమని నిపుణులు చెబుతున్నారు. పశ్చిమాసియాలోని తీవ్ర ఉద్రిక్తతలు ఉన్న ప్రాంతాల్లో, ముఖ్యంగా ఇరాన్ వంటి దేశాలలో స్టార్‌లింక్ టెర్మినల్స్ అక్రమంగా వినియోగిస్తున్నారనే వార్తలు రావడం భారత భద్రతా సంస్థలను అప్రమత్తం చేసిందని చెబుతున్నారు. ఇరాన్‌లో స్టార్‌లింక్ సేవలకు అధికారికంగా ఎలాంటి లైసెన్స్ లేనప్పటికీ, అక్కడ ఈ టెర్మినల్స్ అందుబాటులోకి రావడంపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సరిహద్దులు దాటి పనిచేసే ఇటువంటి శాటిలైట్ సేవల వల్ల దేశ భద్రతకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందనే ఉద్దేశంతో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని చెబుతున్నారు.
చాలా అనుమానాలు
భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు తలెత్తినప్పుడు, అమెరికా ఆధారిత కమ్యూనికేషన్ సంస్థ అయిన స్టార్‌లింక్ భారత నిబంధనలను ఎంతవరకు గౌరవిస్తుంది? విదేశీ నియంత్రణలకు వెలుపల పనిచేసే ఈ వ్యవస్థపై పూర్తి నమ్మకం ఉంచవచ్చా? ఇతర విదేశీ ప్రభుత్వాల ఒత్తిడి ఎదురైనప్పుడు స్టార్‌లింక్ పనితీరు ఎలా ఉంటుంది? అనే అంశాలపై భారత భద్రతా అధికారులు అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. అందుకే అన్ని అంచనాలు క్లియర్ అయ్యే వరకు అనుమతులు ఇవ్వకూడదని నిర్ణయించారని అంటున్నారు.
మస్క్ గ్లోబల్ ప్లాన్స్‌కు దెబ్బ
భారత ప్రభుత్వం తీసుకున్న ఈ అనూహ్య నిర్ణయం స్పేస్ ఎక్స్ అంతర్జాతీయ విస్తరణ ప్రణాళికలపై తీవ్ర ప్రభావాన్ని చూపే అవకాశం ఉందని వ్యాఖ్యానిస్తున్నారు. ఎందుకంటే, స్పేస్ ఎక్స్ సంస్థ సమీప భవిష్యత్తులో భారీ ఐపీఓకి వెళ్లేందుకు సన్నాహాలు చేస్తోందని చెబుతున్నారు. మార్కెట్ అంచనాల ప్రకారం ఈ ఐపీఓ విలువ దాదాపు 1.75 ట్రిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో సుమారు రూ. 145 లక్షల కోట్లకు పైగా ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. స్టార్‌లింక్ భవిష్యత్తు ఆదాయ వృద్ధిపైనే స్పేస్ ఎక్స్ ఐపీఓ సక్సెస్ ఆధారపడి ఉంది. ఇలాంటి కీలక సమయంలో భారత్ లాంటి ప్రపంచంలోనే అతిపెద్ద ఇంటర్నెట్ మార్కెట్ దేశంలో ఇటువంటి నియంత్రణ సవాళ్లు, భద్రతాపరమైన అడ్డంకులు ఎదురుకావడం ఎలాన్ మస్క్ వ్యూహాలకు పెద్ద స్పీడ్ బ్రేకర్ లాంటిదని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
