నాటోకు ధీటైన బదులు.. తగ్గేదేలే అన్న భారత్
రష్యాతో వాణిజ్య సంబంధాలను కొనసాగిస్తే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని నాటో చీఫ్ చేసిన హెచ్చరికలపై భారత్ సూటిగా, ఘాటుగా స్పందించింది
By: Tupaki Desk | 17 July 2025 9:46 PM ISTరష్యాతో వాణిజ్య సంబంధాలను కొనసాగిస్తే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని నాటో చీఫ్ చేసిన హెచ్చరికలపై భారత్ సూటిగా, ఘాటుగా స్పందించింది. "ద్వంద్వ ప్రమాణాలు" అని నాటో వైఖరిని అభివర్ణిస్తూ, భారత్ తన స్వతంత్ర విధానాల ఆధారంగానే నిర్ణయాలు తీసుకుంటుందని స్పష్టం చేసింది. నాటో లేదా ఏ ఇతర కూటముల ఒత్తిళ్లకు తలవంచేది లేదని, దేశ ప్రజల ప్రయోజనాలే తమకు అత్యంత ముఖ్యమని భారత్ తేల్చి చెప్పింది.
-నాటో హెచ్చరికలు: రష్యాపై ఒత్తిడి వ్యూహం
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో మాస్కోపై ఒత్తిడి పెంచేందుకు అమెరికా-నాటో కూటములు ప్రయత్నిస్తున్నాయి. ఇందులో భాగంగానే నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టె ఇటీవల అమెరికా సెనేటర్లతో సమావేశం అనంతరం మాట్లాడుతూ రష్యా నుంచి చమురు, గ్యాస్ కొనుగోలు చేస్తున్న చైనా, భారత్, బ్రెజిల్ వంటి దేశాలపై 100 శాతం సుంకాలు విధించేందుకు సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. "ఈ దేశాలు పుతిన్‌పై ఒత్తిడి తెచ్చి శాంతి చర్చల వైపు మళ్లించే బాధ్యత కలిగి ఉన్నాయి. లేకపోతే భారీ ఆర్థిక ప్రభావాలను ఎదుర్కొనాల్సి ఉంటుంది" అని రుట్టె వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయంగా తీవ్ర చర్చకు దారి తీశాయి.
-భారత్ ధీటైన సమాధానం: ప్రజల అవసరాలే ప్రాధాన్యత
నాటో చీఫ్ వ్యాఖ్యలపై భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైశ్వాల్ గట్టి కౌంటర్ ఇచ్చారు. "నాటో చీఫ్ వ్యాఖ్యలపై మనం నిర్లక్ష్యంగా ఉండము. జరుగుతున్న పరిణామాలను చాలా దగ్గరగా గమనిస్తున్నాం. భారత ప్రజల ఇంధన అవసరాలు అత్యంత ప్రాధాన్యంగా ఉన్నాయి. అందుబాటులో ఉన్న మార్కెట్ల ఆధారంగా, ప్రపంచ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని భారత్ నిర్ణయాలు తీసుకుంటుంది" అని ఆయన స్పష్టం చేశారు.
కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురీ కూడా ఈ వ్యాఖ్యలపై స్పందిస్తూ "భారత్‌కు మరో మార్గం లేనిది కాదు. గతంలో మేము 27 దేశాల నుంచి ముడి చమురు దిగుమతి చేసుకునేవాళ్లం. ఇప్పుడు అది 40 దేశాలకు పెరిగింది. మేము మా దేశ ప్రజలకు అత్యంత సరసమైన ధరలతో ఇంధనాన్ని అందించేందుకు కట్టుబడి ఉన్నాం. రష్యా చమురుపై ఆంక్షలు విధించినా, మాకు ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయి" అని వెల్లడించారు. ఈ వ్యాఖ్యలు భారత్ తన ఆర్థిక సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి సిద్ధంగా ఉందని సూచిస్తున్నాయి.
-స్వతంత్ర విదేశాంగ విధానం: భారత ప్రాధాన్యత
భారత ప్రభుత్వం తన స్వతంత్ర విదేశాంగ విధానాన్ని మరోసారి స్పష్టం చేసింది. దేశ ప్రజల ప్రయోజనాలే తమకు మించినవి అని తేల్చి చెప్పింది. "ద్వంద్వ ప్రమాణాలను గమనిస్తాం. తగిన సమయంలో తగిన తీరుగా స్పందిస్తాం" అని జైశ్వాల్ వ్యాఖ్యానించడం ద్వారా నాటో వైఖరిని భారత్ తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ పరిణామాలు భారత ఆర్థిక-వాణిజ్య విధానాలు భిన్నంగా ఉన్నాయని, అంతర్జాతీయ ఒత్తిళ్లను సమర్థంగా ఎదుర్కొనే సత్తా భారత్‌కు ఉందని నిరూపిస్తున్నాయి. భారత్ తన మౌలిక అవసరాల పరంగా స్వయంపూర్తి వైపు అడుగులు వేస్తూ, ఏ ఒత్తిడికీ తలవంచబోదని ఈ తాజా స్పందనతో స్పష్టం చేసింది. అయితే, శాంతిని కోరుకునే దేశంగా భారత్ చర్చల పట్ల అనుకూలంగా ఉంటుందని పేర్కొనడం గమనార్హం.
మొత్తంగా పాశ్చాత్య దేశాలకు భారత్ భయపడే రోజులు పోయాయని, దేశ ప్రయోజనాలను కాపాడుకోవడంలో భారత్ వెనకడుగు వేయదని నాటోకు భారత్ ఇచ్చిన కౌంటర్ స్పష్టం చేస్తోంది. అంతర్జాతీయ వేదికపై భారత్ తనదైన ముద్ర వేయడానికి సిద్ధంగా ఉందనే సంకేతాలను ఈ పరిణామాలు ఇస్తున్నాయి.
