Begin typing your search above and press return to search.

‘వర్క్ ఇన్ ఇండియా’ దిశగా ప్రపంచం.. కారణం ఇదే..

ఇప్పుడు భారత్ కార్పొరేట్‌ వర్క్‌స్పేస్‌ల ప్రపంచంలో కొత్త చరిత్ర రాయబోతోంది.

By:  Tupaki Desk   |   21 Oct 2025 9:00 PM IST
‘వర్క్ ఇన్ ఇండియా’ దిశగా ప్రపంచం.. కారణం ఇదే..
X

ఆర్థిక ప్రపంచంలో ఇప్పుడు ఒక నిశ్శబ్ద విప్లవం జరుగుతోంది. గతంలో తయారీ రంగంలో చైనా గ్లోబల్‌ మ్యాప్‌ను ఆక్రమిస్తే.. ఇప్పుడు భారత్ కార్పొరేట్‌ వర్క్‌స్పేస్‌ల ప్రపంచంలో కొత్త చరిత్ర రాయబోతోంది. 2026 నాటికి గ్రేడ్-A ఆఫీస్ స్పేస్ లో ఆసియా-పసిఫిక్‌ (APAC) ప్రాంతంలో చైనాను అధిగమించి భారత్ అగ్రస్థానంలో నిలుస్తుందని అంతర్జాతీయ రియల్‌ ఎస్టేట్‌ సంస్థ CBRE అంచనా వేసింది. ఇది ఒక మారుతున్న ఆర్థిక దిశను చూపిస్తుంది.

2026 నాటికి కల సాకారం..

ఈ అంచనాల ప్రకారం, 2026 నాటికి ఆసియా-పసిఫిక్‌ ప్రాంతంలో గ్రేడ్-A ఆఫీస్‌ సరఫరా ఉన్న టాప్‌ 10 నగరాల్లో భారత్‌ నుంచి నాలుగు నగరాలు చోటు దక్కించుకున్నాయి. ఆ జాబితాలో బెంగళూరు (13.09 మిలియన్‌ చ.అ.), హైదరాబాద్‌ (9.25 మిలియన్‌ చ.అ.), ఢిల్లీ NCR (8.98 మిలియన్‌ చ.అ.), ముంబై (4.34 మిలియన్‌ చ.అ.) ఉన్నాయి. చైనాకు చెందిన షాంఘై, షెన్‌జెన్‌, బీజింగ్‌, గ్వాంగ్‌జౌ వంటి నగరాలు ఈ ర్యాంకింగ్‌లో భారత నగరాల తర్వాత నిలవడం గమనార్హం. ఇది చిన్న విజయం కాదు. ఇది ‘భారత మైండ్‌ పవర్‌’ ప్రపంచ మార్కెట్లను ఎలా తిరిగి మలుస్తోందో చూపించే స్పష్టమైన ఉదాహరణ.

భారత నగరాల కొత్త శక్తి కేంద్రాలు..

బెంగళూరు ఇప్పటికే ‘ఇండియా యొక్క సిలికాన్‌ వ్యాలీ’గా గుర్తింపు దక్కించుకుంది. ప్రపంచ ఐటీ దిగ్గజాలు, స్టార్టప్‌లు, ఫిన్‌టెక్‌, రీసెర్చ్‌ సంస్థలు ఇవన్నీ ఇక్కడే తమ ప్రధాన కేంద్రాలను ఏర్పాటు చేసుకున్నాయి. 13 మిలియన్‌ చదరపు అడుగుల కొత్త ఆఫీస్‌ ద్వారా బెంగళూరు కేవలం ఆఫీస్‌ హబ్‌ కాదు.. గ్లోబల్‌ బిజినెస్‌ భవిష్యత్తుకు దిశా నిర్ధేశం చేసే నగరంగా ఎదుగుతోంది.

హైదరాబాద్‌ రెండో స్థానంలో నిలవడం దేశానికి గర్వకారణం. 9.25 మిలియన్‌ చ.అ. కొత్త ఆఫీస్ స్పేస్ తో ఈ నగరం అంతర్జాతీయ కంపెనీలకు ప్రాధాన్య గమ్యంగా మారింది. ఐటీ, బయోటెక్‌, ఫార్మా రంగాల్లో పెట్టుబడులు పెరిగి, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ విస్తరిస్తుండడంతో హైదరాబాద్‌ గ్లోబల్‌ వేదికపై బలంగా నిలుస్తోంది. ఢిల్లీ తన రాజకీయ, ఆర్థిక కేంద్ర స్థానం వల్ల మూడో స్థానంలో నిలవడం సహజం. ఇది కేవలం ప్రభుత్వానికి దగ్గరగా ఉన్న వర్క్‌హబ్‌ మాత్రమే కాదు.. మల్టీనేషనల్‌ కంపెనీలు, కన్సల్టెన్సీలు, మీడియా సంస్థలు, ఫైనాన్షియల్‌ సర్వీసుల సమాహారం. ముంబై నాలుగో స్థానంలో ఉన్నప్పటికీ, అది దేశ ఆర్థిక హృదయం.

భారత వృద్ధి వెనుక కొత్త ఆలోచనలు..

భారత వృద్ధి వెనక ఒక కొత్త ఆలోచనలు కనిపిస్తున్నాయి. ‘వర్క్‌ రీ ఇమాజిన్డ్‌’. కొవిడ్ తర్వాత ప్రపంచ కార్పొరేట్‌ కల్చర్‌ మారిపోయింది. దూరప్రాంతాల నుంచి పని చేసే సౌలభ్యం, టెక్‌-ఎనేబుల్డ్‌ ఆఫీస్‌లు, హైబ్రిడ్‌ వర్క్‌ మోడల్స్‌ ఇవన్నీ గ్రేడ్-A ఆఫీస్‌లకు డిమాండ్‌ను మళ్లీ పెంచాయి. భారతదేశం ఈ మార్పును సరిగ్గా అర్థం చేసుకొని, స్మార్ట్‌ సిటీల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఆఫీస్‌ హబ్‌లను నిర్మిస్తోంది.

కార్మిక శక్తే ఆయుధం..

ఇక చైనాతో పోలిస్తే.. భారత్ లో కార్మిక శక్తి ఎక్కువ.. వారికి ఇచ్చే వేతనాలు తక్కువ.. ఇంగ్లిష్ మాట్లాడే నైపుణ్యంతో కూడిన మానవ వనరులు భారత్ లో ఉండడంతో పెట్టుబడులను ఆకర్షిస్తోంది. అంతేకాకుండా, ప్రభుత్వ ప్రోత్సాహక విధానాలు ‘మేక్‌ ఇన్‌ ఇండియా’, ‘డిజిటల్‌ ఇండియా’, ‘స్మార్ట్‌ సిటీస్‌ మిషన్‌’ ఈ ట్రెండ్‌కు దారితీశాయి.

ప్రపంచానికి కొత్త సెంటర్ ఆఫ్ గ్రావిటీ..

ఇప్పటి వరకు ఆసియా ఆఫీస్‌ మార్కెట్‌పై చైనాకు ఆధిపత్యం ఉండేది. కానీ ఇప్పుడు ఆ దిశ మారుతోంది. షాంఘై, షెన్‌జెన్‌, బీజింగ్‌ నగరాలు నెమ్మదిగా స్థిర స్థాయిలో ఉన్నా.. భారత నగరాలు వేగంగా ఎదుగుతున్నాయి. CBRE అంచనా ప్రకారం, భారత్‌ 2026 నాటికి ఆసియా-పసిఫిక్‌లో గ్రేడ్-A ఆఫీస్‌ స్పేస్ లో 40 శాతం వాటా సాధించే అవకాశం నష్టంగా కనిపిస్తుందని తెలిపింది.

భారత ఆర్థిక విశ్వాసం..

ఇది కేవలం ఆఫీస్‌ స్థలాల సంఖ్య కాదు.. ఇది భారత ఆర్థిక విశ్వాసం. ప్రపంచ స్థాయి కంపెనీలు ఇప్పుడు ‘హైదరాబాద్‌ లేదంటే బెంగళూరులో బ్రాంచ్‌ ఓపెన్‌ చేయాలా?’ అని కాకుండా, ‘ఎన్ని ఫ్లోర్‌లు తీసుకోవాలి?’ అని అడుగుతున్న దశకు చేరుకున్నాయి. భారతదేశం ఇక గ్లోబల్‌ బిజినెస్‌ టేబుల్‌పై పాదం మోపడం కాదు.. దానిని నిలబెట్టుకునేలా మారుతోంది. 2026 నాటికి ఈ అంచనాలు నిజమైతే, ఆసియా ఆర్థిక పటంలో కొత్త కేంద్రం ఒక్కటే ఉంటుంది. అదే ఇండియా.

ఒకప్పుడు చైనా ఫ్యాక్టరీ ప్రపంచాన్ని నడిపింది.. ఇప్పుడు భారతదేశం ఆఫీస్‌ ప్రపంచాన్ని రూపుదిద్దుతోంది. భవిష్యత్తు కేవలం ‘మేడ్‌ ఇన్‌ ఇండియా’ కాదు ‘వర్క్‌ ఇన్‌ ఇండియా’ యుగం రాబోతోంది.