Begin typing your search above and press return to search.

10 రోజుల్లో దాదాపు రూ.8 పెంపు.. సామాన్యుడికి భారీ షాక్

వరుస పెంపులతో వాహనదారులు, సామాన్య వినియోగదారులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు.

By:  A.N.Kumar   |   25 May 2026 11:12 AM IST
10 రోజుల్లో దాదాపు రూ.8 పెంపు.. సామాన్యుడికి భారీ షాక్
X

దేశంలో ఇంధన ధరల పెరుగుదల మరోసారి సామాన్య, మధ్యతరగతి ప్రజల నడ్డివిరిచేలా మారింది. “ధరలు పెంచేదే లేదు” అంటూ గతంలో ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం.. కేవలం 10 రోజుల వ్యవధిలోనే నాలుగు సార్లు ఇంధన ధరలను పెంచడం ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. వరుస పెంపులతో వాహనదారులు, సామాన్య వినియోగదారులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు.

10 రోజుల్లో 'నాలుగు' వడ్డనలు.. ఎప్పుడెప్పుడు ఎంత పెరిగిందంటే?

చమురు ఉత్పత్తి సంస్థలు గత కొన్ని రోజులుగా వరుసగా ధరలను సవరిస్తూ వినియోగదారులపై భారాన్ని మోపుతున్నాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. మే 15న లీటర్‌కు ఏకంగా రూ. 3 మేర పెంచారు. మే 19న మరో 90 పైసలు అదనంగా పెరిగింది. మే 23న లీటరుపై 87 పైసలు పెంచారు. మే 25న తాజాగా ఈరోజు ఏకంగా పెట్రోల్‌పై రూ. 2.84, డీజిల్‌పై రూ. 2.86 మేర భారీగా ధరలు పెరిగాయి. ఈ వరుస పెంపులపై సోషల్ మీడియాలో సామాన్యులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. “పెంచుకుంటూ పోతున్నారు.. ఎన్నాళ్లు ఈ పెట్రోమంట?” అంటూ నెటిజన్లు ప్రభుత్వాలపై, చమురు సంస్థలపై విమర్శలు గుప్పిస్తున్నారు.

తాజా పెంపుతో దేశంలోని ప్రధాన నగరాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇంధన ధరలు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. తాజా పెంపుతో దేశంలోని ప్రధాన నగరాల్లో ఇంధన ధరలు మరింత ఎగబాకాయి. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.102.12కి చేరగా, డీజిల్ రూ.95.20గా ఉంది. ముంబైలో పెట్రోల్ రూ.111.12, చెన్నైలో రూ.107.77కు విక్రయిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో అయితే పరిస్థితి మరింత భారంగా మారింది. విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ.117.19, డీజిల్ రూ.104.88గా ఉండగా.. గుంటూరులో పెట్రోల్ రూ.117.59, డీజిల్ రూ.105.28కు చేరింది. హైదరాబాద్‌లో పెట్రోల్ రూ.115.58, డీజిల్ రూ.103.74గా నమోదైంది.

కూరగాయలు, నిత్యావసరాలపై ఇంధన ధరల ప్రభావం

పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల ప్రభావం కేవలం వాహనదారులకే పరిమితం కాలేదు. ఇది మొత్తం మార్కెట్ వ్యవస్థను కుదిపేస్తోంది. డీజిల్ ధరలు పెరగడంతో రవాణా (ట్రాన్స్‌పోర్ట్) ఖర్చులు భారీగా పెరిగాయి. దీనివల్ల పొరుగు రాష్ట్రాలు, జిల్లాల నుండి వచ్చే కూరగాయలు, పప్పుధాన్యాలు, పాలు, ఇతర నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇప్పటికే ద్రవ్యోల్బణంతో (పెరిగిన ధరలతో) ఇబ్బందులు పడుతున్న మధ్యతరగతి, పేద ప్రజలకు ఈ తాజా పెంపులు కోలుకోలేని దెబ్బ తీశాయి. పెట్రోల్ ధరలు పెరిగిన ప్రతిసారీ.. దానిని సాకుగా చూపిస్తూ వ్యాపారులు ఇతర వస్తువుల ధరలను కూడా ఇష్టానుసారంగా పెంచేస్తున్నారని వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ధరల పెరుగుదలకు కారణాలు ఏంటి?

ఈ అంతర్గత ధరల పెరుగుదలకు అంతర్జాతీయ పరిస్థితులే కారణమని కేంద్ర ప్రభుత్వ మద్దతుదారులు, ఆర్థిక విశ్లేషకులు చెబుతున్నారు. మిడిల్ ఈస్ట్ (మధ్యప్రాచ్యం) ప్రాంతంలో యుద్ధ ఉద్రిక్తతలు కొంత తగ్గినట్లు అనిపించినా, చమురు సరఫరా మాత్రం ఇంకా సాధారణ స్థితికి రాలేదు. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పెరుగుతున్నాయి. యుద్ధాల వల్ల తాము నష్టపోయిన ఆదాయాన్ని పూడ్చుకునేందుకు గల్ఫ్ దేశాలు చమురు ధరలను పెంచుతున్నట్లు సమాచారం. రవాణా, పరిశ్రమలు, వ్యవసాయం, సేవా రంగం అన్నీ ఇంధనంపైనే ఆధారపడి పనిచేస్తాయి. కాబట్టి చమురు ధరల పెరుగుదల వల్ల అన్ని రంగాల్లో ఉత్పత్తి ఖర్చులు పెరిగి ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలు ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి.

పరిష్కారం ఎప్పుడు?

పరిస్థితి తీవ్రతను గమనించిన కొన్ని దేశాలు ఇప్పటికే చమురు వినియోగంపై ఆంక్షలు విధించే దిశగా అడుగులు వేస్తున్నాయి. ప్రజలు కూడా అనవసర ప్రయాణాలను తగ్గించుకోవాలని సూచిస్తున్నాయి. ప్రస్తుతం ఇరాన్ – అమెరికా మధ్య అంతర్జాతీయ స్థాయిలో శాంతి చర్చలు జరుగుతున్నప్పటికీ.. ఈ ఉద్రిక్తతలు ఎప్పుడు ముగుస్తాయో ధరలు ఎప్పుడు అదుపులోకి వస్తాయో ఎవరూ ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు. అంతవరకు మాత్రం సామాన్య భారతీయుడికి ఈ “పెట్రోమంట” తప్పేలా లేదు.