పాక్ వెన్నులో వణుకుపుట్టే పవర్ ఫుల్ డీల్ చేసుకున్న భారత్
రఫేల్-ఎం జెట్స్ భారత నౌకాదళానికి ఆధునిక, అత్యున్నత స్థాయి సముద్ర రక్షణ సామర్థ్యాన్ని అందించనున్నాయి.
By: Tupaki Desk | 28 April 2025 8:39 PM ISTప్రస్తుతం భారత్, పాకిస్థాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారత రక్షణ రంగానికి, ముఖ్యంగా నౌకాదళ సామర్థ్యానికి ఇది ఒక బృహత్తర బలం చేకూర్చే పరిణామం. భారత్ తన సముద్ర భద్రతా సామర్థ్యాలను మరింత పటిష్ఠం చేసుకునే దిశగా ఫ్రాన్స్‌తో కీలక ఒప్పందం కుదుర్చుకుంది. రఫేల్ మెరైన్ యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించిన ఈ డీల్ విలువ సుమారు రూ.63,000 కోట్లు. దీనిపై అధికారికంగా సోమవారం సంతకాలు జరిగాయి.
ఈ ఒప్పందం ప్రకారం.. భారత నౌకాదళం కోసం మొత్తం 26 యుద్ధ విమానాలు రానున్నాయి. వీటిలో 22 సింగిల్ సీట్ రఫేల్-ఎం యుద్ధ విమానాలు .. 4 ట్విన్ సీట్ శిక్షణ విమానాలు ఉన్నాయి. ఈ అత్యాధునిక జెట్‌లను ప్రధానంగా స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన ఐఎన్ఎస్ విక్రాంత్ వంటి విమాన వాహక నౌకల నుంచి ఆపరేట్ చేస్తారు. 2031 నాటికి అన్ని విమానాల డెలివరీ పూర్తవుతుందని అధికారులు వెల్లడించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ (CCS) ఇప్పటికే ఈ డీల్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
రఫేల్-ఎం జెట్స్ భారత నౌకాదళానికి ఆధునిక, అత్యున్నత స్థాయి సముద్ర రక్షణ సామర్థ్యాన్ని అందించనున్నాయి. ఇవి 4.5వ తరం యుద్ధ విమానాలు. ఎక్సోసెట్ ఏఎం39 యాంటీ-షిప్ మిస్సైళ్లు, స్కాల్ప్ గగనతలం నుంచి భూమి క్షిపణులు, మెటియోర్ ఎయిర్-టు-ఎయిర్ మిస్సైళ్లు వంటి అధునాతన ఆయుధాలతో ఇవి వస్తాయి. శత్రు నౌకలపై సుదూర దాడులు నిర్వహించేందుకు, సముద్రంలో వాయు ఆధిపత్యాన్ని సాధించేందుకు ఇవి నౌకాదళానికి అనన్యమైన శక్తినిస్తాయి.
ఇప్పటికే భారత వాయుసేన రఫేల్ యుద్ధ విమానాలను విజయవంతంగా ఉపయోగిస్తోంది. దీంతో నౌకాదళం కొనుగోలు చేసే రఫేల్-ఎం జెట్స్ వల్ల లాజిస్టిక్స్ , విడిభాగాల నిర్వహణలో సమన్వయం సులభతరం అవుతుంది. ఇది కీలకమైన ముందడుగు. పైగా, ప్రస్తుతం నౌకాదళం ఉపయోగిస్తున్న మిగ్-29కె విమానాలు తరచూ సాంకేతిక సమస్యలతో బాధపడుతున్నాయి. వాటి స్థానంలో రఫేల్-ఎం జెట్స్ అత్యవసరంగా అవసరమయ్యాయి.
ప్రస్తుత యుద్ధ వాతావరణాన్ని పరిగణనలోకి తీసుకుంటే, ఈ ఒప్పందం ద్వారా భారత్ మరోసారి తన సైనిక శక్తిని ప్రపంచ స్థాయిలో చాటుకుంది. సముద్ర ప్రాంతాల్లో భారత్ యొక్క ప్రభావం, శక్తి మరింత పెరగనుంది. ఇది పాకిస్థాన్‌తో సహా ప్రత్యర్థి దేశాలకు బలమైన మానసిక దెబ్బగా పరిగణించవచ్చు. రాబోయే కాలంలో భారత్ తన రక్షణ వ్యూహాన్ని మరింత పటిష్ఠం చేసుకునేందుకు ఈ రఫేల్ మెరైన్ యుద్ధ విమానాల డీల్ ఒక కీలకమైన అడుగు కానుంది.
