దేశంలోనే ఫస్ట్ టైమ్: కారుణ్య మరణానికి సుప్రీం ఓకే!
దేశంలోనే తొలిసారిగా.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఓ వ్యక్తి కారుణ్య మరణానికి అనుమతిని మంజూరు చేసింది.
By: Garuda Media | 11 March 2026 3:47 PM ISTదేశంలోనే తొలిసారిగా.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఓ వ్యక్తి కారుణ్య మరణానికి అనుమతిని మంజూరు చేసింది. ''ఇదేమీ తప్పుకాదు. నేరం కూడా కాదు. ఆ వ్యక్తిని మంచానికి పరిమితం.. ఆయనను, ఆయన కుటుంబ సభ్యులను రోజూ చంపడం కంటే.. ఇది పెద్ద నేరం కాదు. కారుణ్యమరణాలు అవస రమైనప్పుడు. వాటిని మేం నిరోధించలేం.'' అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ వ్యాఖ్యానించారు.
అయితే.. గతంలోనూ అనేక మంది కారుణ్యమరణాలకు దరఖాస్తు చేసుకున్నారు. కానీ, అప్పట్లో కోర్టులు అనుమతించలేదు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 జీవించే స్వేచ్ఛను మాత్రమే ఇచ్చిందని.. మరణించే స్వేచ్ఛను ప్రసాదించలేదని వ్యాఖ్యానించింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ మహిళ కేసులో ఇలా వ్యాఖ్యానించిన రోజే.. సదరు మహిళ మృతి చెందడం గమనార్హం. ఇదిలావుంటే.. తాజాగా ఇచ్చిన తీర్పుపై అనేక వాదనలు వినిపిస్తున్నాయి. కొందరు వ్యతిరేకిస్తున్నారు. ఇది భవిష్యత్తులో అనేక విపరిణామాలకు దారి తీస్తాయని చెబుతున్నారు.
అమ్మే అడిగిందని!
తాజా కేసులో ఓ మాతృమూర్తి.. తన కుమారుడికి కారుణ్యమరణం ప్రసాదించాలని కోరినట్టు సుప్రీంకోర్టు పేర్కొంది. ''ఏ తల్లి అయినా.. ఇలా కోరుతారా? ఇక్కడ ఎంత మనో వేదన ఉందో అర్థమవుతోంది.'' అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. కాగా.. ఢిల్లీకి చెందిన హరీష్ రాణా అనే యువకుడు.. 2013లో ప్రమాదవ శాత్తు.. నాలుగో అంతస్థు నుంచి కిందపడిపోయాడు. ఈ క్రమంలో తలకు తీవ్ర గాయమైంది. అప్పటి నుంచి నేటి వరకు .. ఆయన కోమాలోనే ఉన్నాడు. ప్రస్తుతం ఆయన వయసు 32 సంవత్సరాలు. వైద్య సేవలకు కూడా శరీరం సహకరించని పరిస్థితి నెలకొంది.
ఈ క్రమంలోనే.. తన కుమారుడికి కారుణ్య మరణం ప్రసాదించాలంటూ హరీష్ తల్లిదండ్రులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ప్రముఖ ఆసుపత్రుల్లో చికిత్స అందించినా హరీష్ ఆరోగ్యంలో ఎలాంటి పురోగతి కనిపించలేదని తెలిపారు. ఈ చికిత్స కోసం ఆర్థికంగా, మానసికంగా చితికిపోయామని కన్నీరుమున్నీరయ్యారు. 2024లోనే కారుణ్య మరణం ప్రసాదించాలని వేడుకున్నామని.. కానీ, కాలేదన్నారు. మెడికల్ రిపోర్ట్‌లను పరిశీలించిన సుప్రీం కోర్టు తాజాగా ''వైద్య సేవలు నిలిపివేయండి'' అని తీర్పు ఇచ్చింది. తద్వారా కారుణ్యమరణానికి అనుమతి ఇచ్చింది.
