అక్కడ బాంబుల మోత.. ఇక్కడ నకిలీల సయ్యాట!
ఎవరికి తోచిన ప్రచారం వారు చేస్తున్నారు. దీంతో తలపట్టుకున్న కేంద్రం.. ఇలాంటి నకిలీ వార్తల ప్రచారం చేసేవారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని మరోసారి తాజాగా రాష్ట్రాలకు ఉత్తర్వులు జారీ చేసింది.
By: Tupaki Desk | 9 May 2025 2:02 PM ISTభారత్-పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగి.. పరస్పర దాడులకు దారి తీసిన విషయం తెలిసిందే. ఇది యుద్ధంకాదని, ముష్కర మూకలపై తాము జరుపుతున్న దాడులు మాత్రమేనని భారత్ చెబుతోంది. ఇక, పాకిస్థాన్ ఏకంగా యుద్ధానికి దిగి భారత్‌లోని నాలుగు రాష్ట్రాల్లో ఉన్న(గుజరాత్-పంజాబ్-జమ్ము కశ్మీర్- రాజస్థాన్) సరిహద్దు జిల్లాలను టార్గెట్ చేసుకుంది. అయితే.. దీనికి దీటుగా భారత బలగాలు సైతం దాడులు చేస్తున్నాయి.
ఇలా దేశ సరిహద్దుల్లో దాడులు జరుగుతూ.. మన దేశానికి చెందిన జవాన్లు.. పోరు బాటలో నిమగ్నమైన వేళ.. దేశంలోని కొందరు పౌరులు మాత్రం.. నకిలీ వార్తల ప్రచారానికి తెరదీశారు. ఎవరికి తోచిన ప్రచారం వారు చేస్తున్నారు. దీంతో తలపట్టుకున్న కేంద్రం.. ఇలాంటి నకిలీ వార్తల ప్రచారం చేసేవారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని మరోసారి తాజాగా రాష్ట్రాలకు ఉత్తర్వులు జారీ చేసింది. ''ఇలా ప్రచారం చేసే వారిని గుర్తించి క్రిమినల్ చర్యలు తీసుకోవాలి'' అని హోం శాఖ తెలిపింది.
ఏం చేస్తున్నారంటే..?
+ సోషల్ మీడియాలో కొందరు దేశవ్యాప్తంగా చమురు నిండుకుందని.. ఈ రోజు(శుక్రవారం) సాయంత్రం నుంచి దేశవ్యాప్తంగా పెట్రోల్ బంకులు మూసేస్తున్నారని ప్రచారం చేస్తున్నారు. దీంతో పెద్ద అలజడి రేగింది. ఇది నిజమేనా? అంటూ.. చాలా మంది ఆరా తీయడంతోపాటు.. వందల సంఖ్యలో బంకుల వద్ద క్యూకట్టారు. ఇది నిజం కాదని కేంద్రం తెలిపింది.
+ అదేవిధంగా మరికొందరు.. ఏటీఎంలను మూసేస్తున్నారని.. వరుసగా బ్యాంకులకు కూడా సెలవులు ఇచ్చేస్తున్నారని ప్రచారం చేస్తున్నారు. దీంతో ఏటీఎంల వద్ద ప్రజలు క్యూ కట్టారు. ఇది కూడా నకిలీనేని తమకు సంబంధం లేదని ఆర్బీఐ ప్రకటించింది. సాధారణంగా రెండో శనివారం, ఆదివారం బ్యాంకులకు సెలవేనని.. అంతకుమించి ఉద్రిక్తతల నేపథ్యంలో ఎలాంటి సెలవులు లేవని తెలిపింది.
+ ఇక, ఇజ్రాయెల్ దాడులకు సంబంధించిన పాత వీడియోలను కొందరు ప్రచారం చేస్తూ.. ఇవి భారత్ చేసిన దాడులేనని ప్రచారం చేస్తున్నారు. కానీ, ఈ దాడుల తీవ్రత.. నగరాలకు నగరాలు..నేల మట్టం కావడం వంటివి ఇప్పటి వరకు భారత్ చేసిన దాడుల్లో లేవు. ఇది భారత్‌లోని ఓ వర్గాన్ని రెచ్చగొట్టే చర్యలుగా భావించిన కేంద్రం ఇలాంటి నకిలీ ప్రచారంపై చర్యలు తీసుకోవాలని కోరింది.
+ మరోవైపు.. ఆర్మీ ఆపరేషన్స్ పై మీడియా, డిజిటల్ ఛానల్స్ లైవ్ కవరేజ్, రియల్ టైమ్ రిపోర్టింగ్స్ ఇవ్వటం దయ చేసి ఆపాలని రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. ఇలాంటి చర్యల వల్లే కార్గిల్ వార్, 26/11, కాందహార్ హైజాక్స్ లో చాలా నష్టపోయామని పేర్కొన్నాయి. సెన్సిటివ్ కంటెంట్ ను ఇవ్వటంపై ఆయా ఛానళ్ల యాజమాన్యాలు బాధ్యత తీసుకోవాలని విన్నవించాయి.
