24 గంటల్లో దేశాన్ని వీడి వెళ్లిపోవాలంటూ పాక్ అధికారికి భారత్ హుకుం
భారత్ - పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల్ని కాల్పుల విరమణతో ఒక కొలిక్కి తీసుకొచ్చిన అనంతరం చోటు చేసుకున్న కీలక పరిణామంగా దీన్ని చెప్పాలి.
By: Tupaki Desk | 14 May 2025 10:05 AM ISTభారత్ - పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల్ని కాల్పుల విరమణతో ఒక కొలిక్కి తీసుకొచ్చిన అనంతరం చోటు చేసుకున్న కీలక పరిణామంగా దీన్ని చెప్పాలి. భారత్ లో పని చేసే పాక్ హైకమిషన్ కార్యాలయంలోని ఒక ఉద్యోగిపై భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. సదరు అధికారిని 24 గంటల వ్యవధిలో దేశాన్ని విడిచి పెట్టి వెళ్లిపోవాల్సిందిగా సమన్లు జారీ చేసింది. తన దౌత్య కార్యకలాపాలకు విరుద్ధంగా వ్యవహరించినందుకు సదరు అధికారిని భారత ప్రభుత్వం పర్సనా నాన్ గ్రాటాగా ప్రకటించింది.
దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వు మంగళవారం జారీ చేసింది. అసలేం జరిగిందంటే.. భారత్ లోని పాక్ హైకమిషన్ కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్న ఒక ఉద్యోగి పాక్ సీక్రెట్ సర్వీసు ఐఎస్ఐకు పని చేస్తున్నారని స్పష్టం చేసింది. తన దౌత్య కార్యకలాపాలకు విరుద్ధంగా విధులు నిర్వహిస్తూ.. భారత రహస్యాల్ని పాక్ ఐఎస్ఐ సర్వీసుకు అందజేస్తున్నట్లుగా పేర్కొంది.
ఈ నేపథ్యంలో సదరు అధికారి 24 గంటల వ్యవధిలో భారత్ ను విడిచి పెట్టి వెళ్లిపోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. పాక్ దౌత్య కార్యాలయంలో పని చేసే రెహమాన్ అనే అధికారి దౌత్య అధికారి ముసుగులో గూఢచర్యం చేస్తున్నట్లుగా భారత్ పేర్కొంటూ సమన్లు జారీ చేసింది. తాజా సమన్లు పాకిస్తాన్ హైకమిషన్ ఛార్జ్ డి అఫైర్స్ కు మే 13న అంటే మంగళవారం ఆదేశాలు జారీ చేసినట్లుగా కేంద్ర విదేశాంగ శాఖ వెల్లడించింది.
పహల్గాం ఉగ్రఘటన.. అనంతరం ఆపరేషన్ సిందూర్.. తదనంతర పరిణామాలు.. తీవ్ర ఉద్రిక్తలకు చెక్ పెడుతూ ఇరు దేశాలు కాల్పుల విరమణ ఒప్పంద నిర్ణయాన్ని తీసుకోవటం.. అమెరికా జోక్యంతోనే ఇదంతా సాధ్యమైందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేర్కొనటం తెలిసిందే. ఇలాంటి వేళలో.. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గుతున్న వేళ.. భారత్ తీసుకున్న ఈ నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. దీనికి పాక్ స్పందన వెల్లడి కావాల్సి ఉంది.
