Begin typing your search above and press return to search.

పాక్ అధికారిని బహిష్కరించిన భారత్.. 24 గంటల్లో దేశం విడిచి వెళ్లాలని ఆదేశాలు

పాకిస్థాన్ హైకమిషన్‌లో పని చేస్తున్న వారు తమ అధికారాలను దుర్వినియోగం చేసుకోకూడదని భారత్ స్పష్టం చేసింది.

By:  Tupaki Desk   |   21 May 2025 11:11 PM IST
పాక్ అధికారిని బహిష్కరించిన భారత్.. 24 గంటల్లో దేశం విడిచి వెళ్లాలని ఆదేశాలు
X

ఢిల్లీలోని పాకిస్థాన్ హైకమిషన్‌లో పనిచేస్తున్న ఒక అధికారి తన దౌత్య హోదాకు విరుద్ధంగా వ్యవహరించినందుకు భారత ప్రభుత్వం ఆయనను 'పర్సనా నాన్ గ్రాటా'(Persona non grata) (అవాంఛిత వ్యక్తి)గా ప్రకటించింది. దీంతో సదరు అధికారి 24 గంటల్లోపు దేశం విడిచి వెళ్లాలని భారత్ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు పాకిస్థాన్ హైకమిషన్‌కు ఛార్జ్ డి అఫైర్స్ ద్వారా అధికారికంగా ఆదేశాలు ఇచ్చింది. పాకిస్థాన్ హైకమిషన్‌లో పని చేస్తున్న వారు తమ అధికారాలను దుర్వినియోగం చేసుకోకూడదని భారత్ స్పష్టం చేసింది.

భారత విదేశాంగ శాఖ అధికారిక ప్రకటనలో ఆ అధికారి పేరును వెల్లడించనప్పటికీ విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. సదరు అధికారి గూఢచర్య కార్యకలాపాల్లో పాల్గొన్నట్లు భారత్ గుర్తించింది. పంజాబ్ పోలీసులు ఇటీవల అరెస్టు చేసిన ఇద్దరు వ్యక్తులతో ఈ అధికారికి సంబంధాలు ఉన్నాయని, వారు భారత సైనిక దళాల కదలికలకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని పాకిస్థాన్‌కు చేరవేసినట్లు పోలీసులు గుర్తించారు. దౌత్యవేత్తలు తమ కార్యాలయ పరిధిని దాటి శత్రుపూరిత కార్యకలాపాల్లో పాల్గొనడం అంతర్జాతీయ దౌత్య నియమాలకు విరుద్ధం.

ఇటీవల పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి తర్వాత భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. 'ఆపరేషన్ సింధూర్' పేరుతో భారత సైన్యం మే 7న పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు నిర్వహించింది. ఈ పరిస్థితుల నేపథ్యంలోనే భారత్ ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. దౌత్య హోదాను అడ్డుపెట్టుకొని దేశ భద్రతకు ముప్పు వాటిల్లే కార్యకలాపాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని భారత్ ఈ చర్య ద్వారా స్పష్టం చేసింది.

దౌత్యవేత్తను 'పర్సనా నాన్ గ్రాటా'గా ప్రకటించడం అంటే ఆ వ్యక్తిని సదరు దేశంలో అవాంఛిత వ్యక్తిగా గుర్తించడం. దీని ద్వారా ఆ అధికారికి లభించే దౌత్యపరమైన మినహాయింపులు, రక్షణలు రద్దు అవుతాయి. సాధారణంగా ఒక దేశం దౌత్యవేత్తను బహిష్కరించినప్పుడు, దానికి ప్రతీకారంగా అవతలి దేశం కూడా తమ దేశంలోని సదరు దేశ దౌత్యవేత్తను బహిష్కరిస్తుంటుంది. అయితే, ఈ విషయంలో పాకిస్థాన్ ఎలా స్పందిస్తుందో చూడాలి.