యుద్ధం వేళ భారత్ బయలుదేరిన విద్యార్థులు.. రూట్ మ్యాప్ ఇదే!
ఈ సమయంలో అక్కడున్న భారతీయులను తరలించేందుకు కేంద్రం రంగం సిద్ధం చేసింది.
By: Tupaki Desk | 17 Jun 2025 9:45 AM ISTప్రస్తుతం పశ్చిమాసియా రగిలిపోతోంది. ఇజ్రాయెల్ - ఇరాన్ ల మధ్య యుద్ధం కారణంగా భయానక వాతావరణం ఏర్పడింది. ఈ సమయంలో రాజధాని టెహ్రాన్ లో నివాసితులు వేల సంఖ్యలో ఆ ప్రాంతాన్ని ఖాళీ చేస్తున్నారని అంటున్నారు. ఈ సమయంలో భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా.. అక్కడ నుంచి భారతీయులను తరలించేందుకు రంగం సిద్ధం చేసింది.
అవును... గత కొన్ని రోజులుగా పశ్చిమాసియాలో పరిస్థితులు భయంకరంగా మారిన సంగతి తెలిసిందే. ఇజ్రాయెల్ – ఇరాన్ యుద్ధం కారణంగా పరిస్థితులు రోజురోజుకీ మరింత ఉద్రిక్తంగా మారుతున్నాయి. ఈ సమయంలో అక్కడున్న భారతీయులను తరలించేందుకు కేంద్రం రంగం సిద్ధం చేసింది. ఇందులో భాగంగా.. తొలి విడతలో 100 మందిని టెహ్రాన్ నుంచి బయలుదేరించింది.
వాస్తవానికి ఇరాన్ లో భారత్ కు చెందిన వందలాదిమంది విద్యార్థులు ఉన్నారు. ఈ సమయంలో.. ఇజ్రాయెల్ బాంబు దాడులు కొనసాగిస్తుండటంతో భారత్ లోని వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో.. వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సహకరించాలని ఇరాన్ కు భారత్ విజ్ఞప్తి చేసింది. ఈ విజ్ఞప్తికి టెహ్రాన్ సానుకూలంగా స్పందించింది.
అయితే ప్రస్తుతం వీరిని వాయుమార్గంలో భారత్ కు రప్పించే అవకాశం లేదు. ఇప్పటికే ఇరాన్ వాయుమార్గం పూర్తిగా మూసివేసిన పరిస్థితి. దీంతో.. ఇరాన్ నుంచి భారత విద్యార్థులు సోమవారం అర్ధరాత్రి అర్మేనియాకు చేరుకున్న అనంతరం.. అక్కడ నుంచి అజర్ బైజాన్, తుర్కమెనిస్థాన్, ఆఫ్గనిస్తాన్ మీదుగా భారత్ కు తరలించనున్నారు!
మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ... ప్రతి ఒక్కరూ వెంటనే టెహ్రాన్ ను ఖాళీ చేయాలని కోరారు. ఇరాన్ అమెరికాతో అణు ఒప్పందంపై సంతకం చేసి ఉండాలని పునరుద్ఘాటించారు. మరోవైపు ఇజ్రాయెల్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. దీంతో.. వాట్ నెక్స్ట్ అనేది చర్చనీయాంశంగా మారింది.
