Begin typing your search above and press return to search.

దేశంలో భారీ ఆర్ధిక సంక్షోభం...ముందున్నది ముసళ్ళ పండుగ !

దేశంలో భారీ ఆర్ధిక సంక్షోభం సంభవించబోతోందా అంటే జవాబు అవును అనే వస్తోంది.

By:  Satya P   |   1 Jun 2026 12:10 AM IST
దేశంలో భారీ ఆర్ధిక సంక్షోభం...ముందున్నది ముసళ్ళ పండుగ !
X

దేశంలో భారీ ఆర్ధిక సంక్షోభం సంభవించబోతోందా అంటే జవాబు అవును అనే వస్తోంది. అంతే కాదు భవిష్యత్తు అంతా బెంగ అని తెలుస్తోంది. ఇవన్నీ అంచనాలు కావు, కాబోయే నిజాలు అని కూడా నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం దేశంలో ఆర్ధిక పరిస్థితి అలాగే భవిష్యత్తు గమనం వంటివి కేంద్ర ఆర్ధిక మంత్రిత్వ శాఖ తన తాజా నెలవారీ ఆర్ధిక సమీక్షలో పేర్కొంటూ విడుదల చేసిన నివేదికను చూస్తే ఫ్యూచర్ ఏంటో కళ్ళ ముందు కనిపిస్తోంది అని అంటున్నారు. ఈ నివేదికలో ప్రస్తుతం దేశ ఆర్థిక వ్యవస్థ మీద ఒక జాగ్రత్తతో కూడిన హెచ్చరికలు ఉన్నాయని చెబుతున్నారు.

ఇంటా బయటా సమస్యలు :

ఈ రోజున చూస్తే దేశ ఆర్ధిక వ్యవస్థ పునాదులు ఎంతో బలంగా కనిపిస్తున్నప్పటికీ అంతర్జాతీయంగా నెలకొని ఉన్న అనిశ్చితి రాజకీయ ఉద్రిక్తతలు అన్నవి దేశ ఆర్ధిక పురోగతి మీద తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయని అంటున్నారు. పైగా బలహీనమైన రుతు పవనాల సూచనలు కూడా ఉన్నాయని అందుకే ప్రభుత్వం అప్రమత్తం కావాల్సి ఉందని కూడా ఈ నివేదిక పేర్కొంది. మరో వైపు దేశ ఆర్ధిక వృద్ధి రేటుకు ఎలాంటి ఇబ్బందులు ఆటంకాలు లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఈ నివేదిక పేర్కొన్నది.

గల్ఫ్ యుద్ధంతోనే :

ఇక భారత్ ఆర్ధిక వ్యవస్థకు అతి పెద్ద ముప్పు గల్ఫ్ యుద్ధంతోనే సంభవిస్తోంది అని అంటున్నారు. ఈ యుద్ధ వాతావరణం కారణంగా ఇంధన రవాణాకు ఇబ్బందులు అలాగే హర్మూజ్ జల సంధిలో ఏర్పడిన సమస్యలు ఇవన్నీ భారత్ కి ప్రధానమైన ఆందోళనగా మారాయని అంటున్నారు. ఇక గల్ఫ్ యుద్ధం సుదీర్ఘ కాలం కొనసాగితే మాత్రం దేశంలో ద్రవ్యోల్బణం తీవ్రంగా పెరుగుతుందని కూడా హెచ్చరికలు ఉన్నాయి. ఇదిలా ఉంటే 2025-26 ఆర్థిక సంవత్సరంలో పశ్చిమ గల్ఫ్ సహకార మండలి ప్రాంతం నుండి భారతదేశం చేసుకున్న మొత్తం దిగుమతులలో ముడి చమురు అలాగే ఇతర పెట్రోలియం ఉత్పత్తుల వాటా చూస్తే అత్యధికం అని తెలుస్తోంది. ఏకంగా 53.9 శాతంగా ఉండటం చూస్తే గల్ఫ్ యుద్ధం ఏ విధంగా భారత్ కి దెబ్బ కొడుతోంది అన్నది అర్థం అవుతుంది. అక్కడ పరిస్థితులు చక్కబడకుండా ఉంటే కనుక దేశంలో ఆర్ధిక ఇబ్బందులు పెరిగి పెద్దవి అయి భారీ సంక్షోభానికి దారి తీస్తాయని అంటున్నారు. ఒక వేళ వీలైనంత తొందరగా అవి అదుపులోకి వస్తే మాత్రం భారత్ పెట్టుబడులు దన్నుతో వేగంగా అర్ధిక వృద్ధి సాధిస్తుందని అంటున్నారు.

సగటు జీవికే ఇబ్బంది :

ప్రస్తుతం అంతర్జాతీయంగా సాగుతున్న పరిణామాలు చూస్తే కనుక దేశంలో చమురు ఆహార వస్తువుల ధరలు పెరుగుదల అధికంగా ఉంటుందని అది ఆర్ధిక వ్యవస్థకు పెను ముప్పు అని విశ్లేషణలు ఉన్నాయి. ఇక రిటైల్ గా ఉన్న ద్రవ్యోల్బణానికి అలాగే టోకు ద్రవ్యోల్బణానికి మధ్య ఉన్న తేడా రాబోయే రోజులలో సగటు జీవి జేబుకు చిల్లు పెట్టవచ్చు అని అంటున్నారు. ఇక ఏప్రిల్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం చూస్తే 3.48 శాతంగా ఉంది. ఇది రిజర్వ్ బ్యాంక్ నిర్దేశిత పరిమితిలోనే ఉన్నప్పటికీ అదే సమయంలో టోకు ద్రవ్యోల్బణం మాత్రం 8.3 శాతానికి చేరుకుందని అంటున్నారు. ఇప్పటికే చూస్తే పెట్రోల్ ధరను లీటర్ మీద 7.35, డీజిల్ ధర లీటర్ కి 7.53కి పెంచడం జరిగింది. ఈ పెరుగుదల చూస్తే గత నాలుగేళ్ల కాలంలో ఇదే ప్రధమం. దీంతో ఒక్కసారిగా ఇది మే నెల రిటైల్ ద్రవ్యోల్బణ గణాంకాలపై పడనుందని నిపుణులు చెబుతున్నారు.

రుతు పవనాల ప్రభావం :

ఇక గల్ఫ్ యుద్ధం ప్రభావం ఒక వైపు ఉంటే రుతు పవనాల ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుందని అంటున్నారు దీనిమీద ఐఎండీ వేసిన అంచనాలు చూస్తే ఈ ఏడాది నైరుతి రుతుపవనాల వల్ల ఆశించిన స్థాయిలో వర్షాలు కురవవని పేర్కొంది. ఇది సాధారణం కంటే తక్కువ వర్షపాతాన్ని సూచిస్తోంది. ఇలా భారీగా వర్షాలు తగ్గడం వల్ల వ్యవసాయ రంగానికి తీవ్రమైన నష్టం వాటిల్లడమే కాకుండా ఆహార ధరలు పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. దాంతో దేశీయంగా కరవు పరిస్థితులు ఉత్పన్నం అవుతాయని అలాగే అంతర్జాతీయ పరిణామాలు తోడు అయితే మొత్తంగా ఆహార భద్రతకు ముప్పు వాటిల్లుతుందని కూడా ఆందోళన వ్యక్తం చేస్తునారు. సరిగ్గా ఇదే విషయం మీద ఆహార ద్రవ్యోల్బణం పెరగవచ్చని కేంద్ర మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. భారత జీడీపీలో దేశీయ వినియోగం అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే దాంతో గ్రామీణ ప్రాంతాలలో పరిస్థితులలో తేడా వస్తే కనుక దాని వల్ల దేశ మొత్తం వృద్ధి రేటు దెబ్బ తింటుందని అంటున్నారు.

పెట్టుబడుల ఉపసంహరణ :

ఇక పశ్చిమాసియాలో ఉద్రిక్తతల ప్రభావంతో విదేశీ పెట్టుబడులు దేశీయ మార్కెట్ల నుంచి భారీగా ఉపసంహరించుకుంటున్న నేపథ్యం కనిపిస్తుంది. దాంతో ప్రపంచ మార్కెట్ నుంచి వచ్చే ఒత్తిళ్ల ప్రభావం దేశీయ ఉత్పత్తి మీద పెట్టుబడులపై కూడా స్పష్టంగా కనిపిస్తోంది. ఫలితంగా కొన్ని కీలక రంగాల ఉత్పత్తిలో మందగమనం కనిపిస్తోంది అని ఆర్థిక నిపుణులు గుర్తు చేస్తున్నారు. ఇక గల్ఫ్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి మే 21వ తేదీ మధ్య దాకా చూస్తే కనుక విదేశీ ఇన్వెస్టర్లు భారత మార్కెట్ల నుంచి మొత్తం 23.6 బిలియన్ డాలర్లను వెనక్కి తీసుకోవడం కీలకమైన పరిణామంగా చూడాల్సి ఉంది. ఇలా భారీ పెట్టుబడుల ఉపసంహరణతో పాటు పెరిగిన ముడిచమురు ధరలు, అంతర్జాతీయంగా అమెరికన్ డాలర్ బలపడటం వంటి కారణాల వల్ల భారత రూపాయిపై తీవ్ర ఒత్తిడి పెరిగిందని విశ్లేషిస్తున్నారు. దాంతో గల్ఫ్ యుద్ధం మొదలైనప్పటి నుండి ఇప్పటిదాకా డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ సుమారు 4.9 శాతం మేర బలహీనపడిందని చెబుతున్నారు. మొత్తంగా చూస్తే దేశీయ ఆర్ధిక వ్యవస్థ అన్నది సంక్షోభం దిశగానే సాగుతోంది అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.