ఎబోలా వైరస్ : ఆ మూడు దేశాలకు వెళ్లొద్దు.. కేంద్రం హెచ్చరికలు
అత్యంత ప్రాణాంతక వ్యాధులలో ఒకటిగా గుర్తింపు పొందిన ఎబోలా వైరస్ వ్యాప్తి మళ్లీ వేగంగా పెరుగుతుండటంతో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది.
By: A.N.Kumar | 24 May 2026 11:46 AM ISTప్రపంచాన్ని మరోసారి ప్రమాదకర వైరస్ కలవరపెడుతోంది. అత్యంత ప్రాణాంతక వ్యాధులలో ఒకటిగా గుర్తింపు పొందిన ఎబోలా వైరస్ వ్యాప్తి మళ్లీ వేగంగా పెరుగుతుండటంతో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య, విదేశాంగ శాఖలు కలిసి భారతీయుల కోసం కీలక ట్రావెల్ అడ్వైజరీ జారీ చేశాయి. ముఖ్యంగా ఎబోలా ప్రభావం తీవ్రంగా ఉన్న ఆఫ్రికా దేశాలు అయిన డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఉగాండా, సౌత్ సూడాన్‌లకు అత్యవసర పరిస్థితులు తప్ప ప్రయాణాలు చేయవద్దని స్పష్టంగా హెచ్చరించాయి.
ఇప్పటికే కాంగోలో ఎబోలా వైరస్ విస్తరణ ఆందోళనకర స్థాయికి చేరుకుంది. అక్కడ ఇప్పటివరకు సుమారు 750 కేసులు నమోదైనట్లు సమాచారం. వీరిలో 177 నుంచి 204 మంది వరకు ప్రాణాలు కోల్పోయినట్లు అంతర్జాతీయ ఆరోగ్య సంస్థలు అంచనా వేస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు వైరస్ వ్యాపించే ప్రమాదం పెరుగుతుండటంతో అక్కడి ప్రభుత్వ యంత్రాంగం హై అలర్ట్‌లో ఉంది.
ఎబోలా వైరస్ ప్రధానంగా శరీర ద్రవాల ద్వారా వ్యాపిస్తుంది. వైరస్ సోకిన వ్యక్తుల రక్తం, చెమట, లాలాజలం లేదా ఇతర ద్రవాలతో ప్రత్యక్ష సంబంధం కలిగితే సంక్రమణ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రారంభంలో జ్వరం, తీవ్ర అలసట, తలనొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. అనంతరం అంతర్గత రక్తస్రావం వంటి తీవ్రమైన పరిస్థితులు తలెత్తే ప్రమాదం ఉంటుంది. చికిత్స ఆలస్యమైతే ప్రాణాపాయం తప్పదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఆ దేశాల్లో ఇప్పటికే నివసిస్తున్న భారతీయులు అత్యంత జాగ్రత్తలు పాటించాలని కేంద్రం సూచించింది. జనసమ్మర్థ ప్రాంతాలకు వెళ్లకూడదని, అనారోగ్య లక్షణాలు కనిపిస్తే వెంటనే స్థానిక వైద్య అధికారులను సంప్రదించాలని తెలిపింది. అలాగే వ్యక్తిగత పరిశుభ్రత, మాస్కుల వినియోగం, శానిటైజేషన్ వంటి జాగ్రత్తలను కచ్చితంగా పాటించాలని సూచించింది.
భారత్‌లో ప్రస్తుతం ఎబోలా కేసులు నమోదుకాలేదని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. అయినప్పటికీ అంతర్జాతీయ ప్రయాణాల నేపథ్యంలో ముందస్తు అప్రమత్తత చర్యలు చేపట్టినట్లు వెల్లడించింది. దేశంలోని అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ప్రత్యేక స్క్రీనింగ్ చర్యలు చేపట్టే అవకాశాలపై కూడా అధికారులు పరిశీలిస్తున్నట్లు సమాచారం.
కరోనా మహమ్మారి అనంతరం ప్రపంచం ఆరోగ్య భద్రతపై మరింత అప్రమత్తంగా మారిన సమయంలో ఎబోలా వైరస్ మళ్లీ వ్యాపించడం అంతర్జాతీయ సమాజాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ప్రభావిత దేశాలకు సహాయక చర్యలను వేగవంతం చేస్తోంది.
